వరంగల్, ఏప్రిల్ 21(నమస్తేతెలంగాణ) : రంజాన్‌ను పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన గిఫ్ట్ ప్యాకెట్లను ముస్లింలకు పంపిణీ చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఒకటి రెండు రోజు ల్లో జిల్లాలో పంపిణీ ప్రారంభం కానుంది. వీటిని ఎ మ్మెల్యేల ద్వారా మసీదుల్లో పంపిణీ చేసేందుకు ఏర్పా ట్లు జరుగుతున్నాయి. ముస్లింలకు ఇఫ్తార్ విందు ఇ చ్చేందుకూ రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించింది. పండుగల సందర్భంగా ప్రతి సంవత్సరం తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు కానుకలను అందజేస్తున్నది. సద్దుల బతుకమ్మ పండుగ కోసం ఏటా కొద్ది రోజుల ముందే మహిళలకు బతుకమ్మ చీరెలను పంపిణీ చేస్తున్నది. క్రిస్మస్ పండుగ సమయంలో క్రైస్తవులకు నూత న వస్ర్తాలను గిఫ్ట్‌ప్యాక్ రూపంలో ఇస్తున్నది. పురుషులకు ప్యాంటు, షర్ట్, మహిళలకు చీర, జాకెట్, బాలికలకు డ్రెస్ మెటీరియల్ ఈ ప్యాక్‌లో ఉంటున్నాయి. రంజాన్ పండుగ కోసం ముస్లింలకు గిఫ్ట్ ప్యాకెట్లను అందజేస్తున్నది.
పురుషులు, మహిళలు, బాలికలకు ఈ గిఫ్ట్ ప్యాక్‌లో నూతన వస్ర్తాలు ఉంటాయి. ఈ ఏడా ది రంజాన్ పండుగ కోసం ముస్లింలకు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం జిల్లాకు ఆరు వేల గిఫ్ట్ ప్యాక్‌లను కే టాయించింది. వరంగల్‌తూర్పు నియోజకవర్గానికి 3 వేలు, నర్సంపేట నియోజకవర్గానికి 1,500, వర్ధన్నపేట నియోజకవర్గానికి 1,500 చొప్పున గిఫ్ట్ ప్యాక్‌లు కొద్ది రోజుల క్రితం జిల్లాకు చేరుకున్నట్లు మైనారిటీల సంక్షేమ శాఖ అధికారులు వెల్లడించారు. నియోజకవర్గ కేంద్రాల్లోని తహసీల్దార్ కార్యాలయాల్లో వీటిని భద్రపరిచినట్లు తెలిపారు. ఆయా శాసనసభ నియోజకవర్గాల్లో స్థానిక ఎమ్మెల్యే ద్వారా మసీదుల్లో వీటి పంపి ణీ జరుగనుంది. మే నెల మొదటి వారంలో రంజాన్ పండుగ ఉన్నందున ఈ నెల 22 తర్వాత పంపిణీ చే సేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. పంపిణీ షెడ్యూల్ ఖరారు కాగానే నియోజకవర్గ కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో ఉన్న గిఫ్ట్ ప్యాక్‌లను ఆయా మండలాలకు సరఫరా చేస్తారు. వీటి సరఫరా, మసీదుల్లో పంపిణీ కోసం ప్రజాప్రతినిధులు, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, ముస్లిం పెద్దలను సమన్వయపరిచేందుకు ఆర్డీవో, తహసీల్దార్లను ప్రభుత్వం ప్రత్యేకాధికారులుగా నియమించింది.
ఇఫ్తార్ విందుకు నిధులు..
ప్రతి సంవత్సరం రంజాన్ సందర్భంగా ప్రభుత్వం ముస్లింలకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేస్తున్నది. ఈ ఏడాది కూడా ఇఫ్తార్ విందు కోసం జిల్లాకు రూ.12 లక్షలు మంజూరు చేస్తూ కొద్దిరోజుల క్రితం ఉత్తర్వులు విడుదల చేసింది. వరంగల్‌తూర్పు నియోజకవర్గంలో 6, నర్సంపేట నియోజకవర్గంలో 3, వర్ధన్నపేట నియోజకవర్గంలో 3 మసీదుల్లో ఇఫ్తార్ విందు ఏర్పాటు కోసం రూ.లక్ష చొప్పున కేటాయించింది. ఈ నిధులతో త్వరలో ముస్లింలకు విందు ఏర్పాటు చేసేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు.