నమస్తే నెట్వర్క్: జిల్లావ్యాప్తంగా శుక్రవారం కార్తీక పౌర్ణమి వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో విశేష పూజలందించారు. వరంగల్‌లోని భద్రకాళీ ఆలయానికి భక్తులు పోటెత్తారు. గ్రేటర్ కార్పొరేషన్ కమిషనర్ ప్రావీణ్య అమ్మవారిని దర్శించుకున్నారు. వరంగల్ అండర్‌రైల్వేగేట్ ప్రాంతం కరీమాబాద్‌లోని శ్రీకాశీవిశ్వేశ్వర దేవస్థానం (బొమ్మలగుడి)లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వరంగల్ హనుమాన్ జంక్షన్‌లోని శ్రీరమా సత్యనారాయణస్వామి ఆలయంలో సామూహిక సత్యనారాయణస్వామి వ్రతాలు ఆచరించారు. 315 జంటలు పాల్గొన్నట్లు నిర్వాహకులు దాసరి మమత-శ్రీనివాస్ తెలిపారు. అలాగే, వరంగల్ శ్రీవాసవీమాత ఆలయంలోనూ వ్రతాలు చేశారు. కాశీబుగ్గ ప్రాంతంలోని శ్రీకాశీవిశ్వేశ్వర రంగనాథస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. సాయంత్రం లక్ష దీపాలంకరణ సేవ కార్యక్రమం నిర్వహించారు. ఒక్కొక్కరు 365 వత్తులతో దీపాలు వెలించారు. వరంగల్ రామన్నపేట, పాపయ్యపేటలోని శ్రీమల్లికార్జునస్వామి ఆలయాన్ని భక్తులు దర్శించుకున్నారు. వరంగల్ స్టేషన్‌రోడ్‌లోని కాశీవిశ్వేశ్వరాలయంలో వేడుకలు ఘనంగా జరిగాయి. గిర్మాజీపేట గోవిందాద్రిపై అనంతకోటి దీపోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. నర్సంపేటలో భక్తులు 360 వత్తులతో దీపాలు వెలిగించారు.
ఖానాపురం మండలం బుధరావుపేట వేంకటేశ్వరస్వామి, కొత్తూరు దుర్గామల్లేశ్వరస్వామి, అశోక్‌నగర్ కోదండరామాలయంలో భక్తులు పూజలు చేశారు. రాయపర్తి, మండలం సన్నూరు సమీపం వెంకటేశ్వరపల్లిలోని వేంకటేశ్వరస్వామి, సీతారామచంద్రస్వామి, రుద్రకోటేశ్వరస్వామి, కొత్త రాయపర్తిలోని ఉమామహేశ్వరస్వామి ఆలయాల్లో పూజలు చేశారు. ఇంటిల్లిపాది కేదారేశ్వరస్వామి వ్రతాల్లో పాల్గొన్నారు. నర్సంపేట పట్టణం సర్వాపురంలోని నాగమయ్య ఆలయానికి భక్తులు పోటెత్తారు. మాదన్నపేట పెద్ద చెరువు కట్టపై ఉన్న శ్రీరామలింగేశ్వరస్వామి, గురిజాలలోని శ్రీరామలింగేశ్వరస్వామి ఆలయంలో భక్తులు దీపాలు వెలిగించారు. దుగ్గొండి మండలవ్యాప్తంగా కార్తీపపౌర్ణమి వేడుకలు అంబరాన్నంటాయి. పర్వతగిరి మండలంలోని చింతనెక్కొండ, ఏనుగుల్లు, అన్నారం షరీఫ్, కల్లెడలో మహిళలు దీపాలు వెలిగించి పూజలు చేశారు. గీసుగొండ మండలంలోని ఆలయాల్లో వేడుకలు ఘనంగా జరిగాయి. ఊకల్ నాగేంద్రస్వామి ఆలయంలో పూజలు చేశారు. చెన్నారావుపేటలోని సిద్ధేశ్వరాలయంలో భక్తులు పూజలు చేశారు, సంగెంలోని సంగమేశ్వరాలయంలో ఎంపీపీ కందకట్ల కళావతి పాల్గొన్నారు. నెక్కొండలోని రామలింగేశ్వరాలయంలో శివునికి పంచామృతాభిషేకాలు, బిల్వార్చన నిర్వహించారు. సాయంత్రం 5.30 గంటల ప్రదోష కాలంలో ఆకాశ దీప ప్రజ్వలన కార్యక్రమాన్ని భక్తుల సమక్షంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు.