కాళేశ్వరం, ఏప్రిల్ 21 : పుష్కరాల సందర్భంగా భక్తులతో ప్రాణహిత నది పులకించిపోతున్నది. తొమ్మిదో రోజు గురువారం 40 వేల మందికి పైగా భక్తులు పుణ్యస్నానాలు చేశారు. దీంతో త్రివేణి సంగమం సందడిగా మారింది. తెలంగాణతోపాటు ఆంధ్రపదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, తమిళనాడు తదితర రాష్ర్టాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. నది తీరాన సైకత లింగాలకు ప్రత్యేక పూజలు చేసి దీపాలు వదిలి దర్పణం ఇచ్చారు. మంచిర్యాల జిల్లా అర్జునగుట్ట పుష్కరఘాట్ వద్ద పుణ్య స్నానాలు చేసిన భక్తులు దైవ దర్శనం కోసం కాళేశ్వరం తరలివస్తున్నారు. పితృ దేవలకు పిండ ప్రదానాలు చేసి, అయ్యగార్లకు వాయినం ఇస్తున్నారు. పుష్కరాల్లో భాగంగా తొమ్మిదో రోజు త్రివేణి సంగమం వద్ద అర్చకులు నదీ మాతకు కర్పూర హారతి ఇచ్చారు.
పుష్కరస్నానం చేసిన మంత్రి సత్యవతి
పుష్కరాల సందర్భంగా రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి వీఐపీ ఘాట్ వద్ద పుణ్యస్నానమాచరించారు. సంకల్పాలు చెప్పుకొని సైకత లింగానికి ప్రత్యేక పూజలు చేశారు. నదిలో దీపాలు వదిలారు. అనంతరం స్వామివారి దర్శనం కోసం ఆలయానికి రాగా అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పాలికారు. మొదట గణపతి వద్ద ప్రత్యేక పూజలు చేసి కాళేశ్వర, ముక్తీశ్వరస్వామికి ప్రత్యేక అభిషేకాలు చేశారు. పార్వతి అమ్మవారి ఆలయంలో పూజలు చేశాక శివ కల్యాణ మండపంలో అర్చకులు ఆశీర్వచనం చేయగా ఈవో మహేశ్ అమ్మవారి పట్టు వస్ర్తాలు అందజేశారు. వారి వెంట కలెక్టర్ భవేశ్‌మిశ్రా, అడిషనల్ కలెక్టర్ దివాకర, జడ్పీ సీఈవో శోభారాణి, భూపాలపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ సెగ్గం వెంకటరాణీ సిద్ధు దంపతులు, డీఎస్పీ కిషన్, సీడీపీవో రాధిక, మహదేవపూర్, భూపాలపల్లి, రేగొండ ఎంపీపీలు రాణీబాయి, లావణ్య, లక్ష్మి, ఎంపీటీసీ మమత, నాయకులు నాగరాజు, మోహన్‌రెడ్డి, రామారావు, ఆలయ సిబ్బంది ఉన్నారు. హైకోర్టు మాజీ జడ్జి ఆనందరెడ్డి కుటుంబ సమేతంగా ఆలయంలో పూజలు చేశారు. వీరికి అర్చకులు ఆశీర్వచనం చేసి స్వామి వారి శేష వస్ర్తాలతో సన్మానించారు. వివిధ పూజల ద్వారా ఆలయానికి రూ.4.50 లక్షల ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు.