వర్ధన్నపేట, ఏప్రిల్ 21: యాసంగి ధాన్యం కొనుగోళ్లకు అధికారులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. తెలంగాణ రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసే విషయంలో కేంద్ర ప్రభుత్వం వెనుకంజ వేయడంతో ప్రతి గింజనూ టీఆర్ఎస్ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడంతో జిల్లాలోని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం మద్దతు ధరకు కొనుగోలు చేయకపోతే తీవ్రంగా నష్టపోతామని అన్నదాతలు భయాందోళనలో ఉన్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ సర్కారు ధాన్యం కొనుగోలుకు ముందుకు రావడంతో ఊపిరి పీల్చుకున్నారు.
అన్నదాతల హర్షం..
యాసంగిలో తెలంగాణ జిల్లాల్లో వాతావరణానికి అనుకూలంగా ఉంటే దొడ్డు రకం ధాన్యాన్నే ఏటా రైతులు పండిస్తుంటారు. ఇందులో భాగంగానే ప్రస్తుత యాసంగిలో కూడా అన్నదాతలు చెరువులు, బావుల కింద దొడ్డు వడ్లు సాగు చేశారు. ప్రభుత్వం దొడ్డు రకం ధాన్యాన్ని క్వింటాల్‌కు రూ. 1960 చొప్పున మద్దతు ధరతో కొనుగోలు చేస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడంతో అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరో పది రోజుల్లో గ్రామాల్లో వరి కోతలు ప్రారంభం కానున్నాయి. ఇందుకోసం సివిల్ సప్లయ్, మార్కెటింగ్ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇల్లంద వ్యవసాయ మార్కెట్ యార్డులో గురువారం అధికారులు ధాన్యం తూకం వేసేందుకు ఉపయోగించే ఎలక్ట్రానిక్ కాంటాలను పరిశీలించారు. ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమైన తర్వాత కాంటాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తకుండా నిపుణులతో పరిశీలింపజేశారు. అలాగే, కొనుగోలు కేంద్రాలకు జిల్లా అధికారులు గన్నీ సంచులు కూడా సరఫరా చేస్తున్నారు. ఈ యాసంగిలో రైతులు తక్కువ విస్తీర్ణంలో వరి సాగు చేశారు. అయినా ప్రభుత్వం కొనుగోలు చేయడానికి ఏర్పాట్లు చేస్తుండడంతో అన్నదాతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అలాగే, ముఖ్యమంత్రి ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని ప్రకటించి ఏర్పాట్లు చేయిస్తుండడంతో రైతులు సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.