ఖానాపురం, ఏప్రిల్ 8: అభివృద్ధి పనుల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు పారదర్శకత పాటించాలని అడిషనల్ కలెక్టర్ హరిసింగ్ అన్నారు. బోటిమీదితండా గ్రామ పంచాయతీకి సంబంధించిన జీపీ కార్యాలయాన్ని గొల్లగూడెంతండాలో ఏర్పాటు చేయడంతో కొద్ది నెలలుగా ఇరుతండాల వాసుల మధ్య పరస్పర ఘర్షణలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కలెక్టర్ ఆదేశాల మేరకు శుక్రవారం హరిసింగ్ ఆయా తండాలను సందర్శించారు. బోటిమీదితండా పేరున జీపీ ఏర్పాటైనందున ఇక్కడే జీపీ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాల్సి ఉన్నా గొల్లగూడెంతండాలో ఏర్పాటు చేసి పాలన కొనసాగిస్తున్నారని బోటిమీదితండావాసులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. బోటిమీదితండాలో ముగ్గురు వార్డు సభ్యులు ఉన్నా మూడేళ్లలో ఒక్క సమావేశానికి హాజరు కాలేదని, ప్రభుత్వపరంగా వస్తున్న నిధులను బోటిమీదితండాలో వెచ్చించడం లేదని ఆరోపించారు. అనంతరం గొల్లగూడెంతండాను సందర్శించి సర్పంచ్ తారమ్మతోపాటు ఆరుగురు వార్డు సభ్యులతో సమీక్షించారు.
శ్మశాన వాటిక, డంపింగ్యార్డు వినియోగంలోకి రాలేదని, ప్లాంటేషన్ ఎక్కడా కనిపించడం లేదని, జీపీకి ప్రతినెలా రూ. 82 వేల నిధులు వస్తున్నా వినియోగం సరిగా లేదని అడిషనల్ కలెక్టర్ వాపోయారు. జీపీకి ఇద్దరే సిబ్బంది ఉండగా నిధులు ఎలా ఖర్చువుతున్నాయని కార్యదర్శిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బోటిమీదితండా, గొల్లగూడెంతండాలో వెంటనే ఇద్దరు వాచర్లను నియమించాలని ఆదేశించారు. ఇకపై ఇరుతండావాసులు ఘర్షణలు మానుకొని కలిసికట్టుగా అభివృద్ధిలో భాగస్వాములు కావాలని, లేని పక్షంలో కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. కార్యక్రమంలో ఎంపీడీవో సుమనావాణి, ఎంపీవో పర్వీన్ కైసర్, ఉపసర్పంచ్ కిషన్, వార్డు సభ్యులు శంకర్, వీరమ్మ, సమ్మక్క, లాలు, భద్రి, చక్రూ, తండావాసులు కిషన్, రాము, భాను పాల్గొన్నారు.