నయీంనగర్, ఏప్రిల్ 8 : హనుమకొండలోని నిట్లో స్ప్రింగ్ స్ప్రీ-2022 శుక్రవారం అట్టహాసంగా ప్రారంభమైంది. రెం డు సంవత్సరాల తర్వాత దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద సాంస్కృతిక మహోత్సవాన్ని సృష్టి అనే ఇతి వృత్తంతో స్టూడెంట్ కౌన్సిల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించేందుకు, పాల్గొనేందుకు దేశంలోని ప్రసిద్ధిగాంచిన ఇంజినీరింగ్ కళాశాలలు, ఐ ఐటీల నుంచి సుమారు రెండు వేల మంది విద్యార్థులు హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థు లు పలు ఈవెంట్లను ప్రదర్శించి ప్రతిభ చాటుకున్నారు. ఇతరులకు మెసేజ్ చూపెట్టడం, హ్యాండ్ ప్రింట్, మట్టి కుండల తయారీ, నుక్కడ్ నాడక్ బై, ఫేస్ పెయింటింగ్, రాత్రి సమయంలో రామ్ మిరియాల (డీజే టిల్లు సినిమా గాయకుడు), బిగ్బాస్ కంటెస్టెంట్ శ్రీరామచంద్ర ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి. వీటితోపాటు ఫ్లాష్ మాబ్, ఐడల్ – సింగింగ్ కాంపిటీషన్, వాయిస్ ఆఫ్ వర్డ్స్ – స్పీకింగ్ అండ్ రైటింగ్ ఈవెంట్, వార్ ఆఫ్ డీజేస్, గేమ్ డోమ్, క్యూ ఫ్యాక్టర్ జనరల్ క్విజ్, ఓపెన్ క్విజ్, చెస్, ఇంటరాక్టివ్ ట్రెజర్ హంట్, మ్యాడ్-యాడ్స్, క్రియేటివ్ అడ్వర్టైజ్మెంట్ ప్రదర్శన, నియాన్ క్రికెట్, ఫుడ్ ఫియస్టా, ఫుడ్ బింగింగ్ పోటీలు నిర్వహించారు.
నిట్లో మట్టి కుండ తయారీ..
నిట్లో మట్టి కుండలను తయారు చేయడాన్ని విద్యార్థులు ఆసక్తిగా తిలకించారు. కుమ్మరిసారెను ఏర్పాటు చేసి తిప్పుతూ చేతితో మట్టికుండను తయారు చేస్తారు. అబ్బ ఎంత బాగుందో కుండ తయారీ, ఎప్పుడు సినిమాల్లో చూసేవాళ్లం.. కానీ ఇప్పుడు స్వయంగా చూడడంతో విద్యార్థుల సంతోషానికి అవధులు లేకుండా పోయింది. ఎంత టెక్నాలజీ పెరిగినా కనుమరుగవుతున్న చేతి వృత్తులను మనం కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైన ఉందని పలువురు విద్యార్థులు చర్చించుకున్నారు. స్వయంగా కుండను తయారు చేయడంగా ఆనందగా ఉందని కరీంనగర్లో బీటెక్ ఫైనలియర్ చదువుతున్న ఆశ్రిత పేర్కొంది.
మెసేజ్ ఇతరులకు చూపెట్టడం..
నిట్లో ఒక చోట బోర్డును ఏర్పాటు చేశారు. అక్కడ విద్యార్థుల వారికి నచ్చింది రాసి ఆ బోర్డుపై అతికించాలి. అది ఇతర విద్యార్థులు చదువుతారు. దీంతో మనలో ఉన్న మాటలు ఇతరులకు చెప్పేందుకు ఉపయోగ పడుతుంది.
మాదక ద్రవ్యాల విముక్తికి ’నుక్కడ్ నాడక్ బై’
తమ పిల్లలు కళాశాలలకు వెళ్లి బాగా చదువుకుని ఉన్నత స్థానంలో ఉండాలని తల్లిదండ్రులు ఎన్నో కలలు కంటారు. అయితే, చెడు స్నేహితులతో కలిసి కొంత మంది మాదక ద్రవ్యాలకు అలవాటు పడి తమ జీవితా లను నాశనం చేసుకుంటారు. అయితే, అటువంటి విద్యార్థుల పరివర్తన కోసం ‘హిందీ కల్దిషి’ క్లబ్ వారు నుక్కడ్ నాడక్ బై అనే నాటకాన్ని ప్రదర్శించారు. 20 నిమిషాల్లో 20 మంది విద్యార్థులు మాదక ద్రవ్యాల నుంచి ఏ విధంగా విముక్తి పొందారో చక్కగా చూపించారు.