వరంగల్, నవంబర్ 19(నమస్తేతెలంగాణ) : లాటరీ ద్వారా మద్యం దుకాణాల కేటాయింపు కోసం ఎక్సైజ్, ప్రొహిబిషన్ శాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు. వీటిని జిల్లా కలెక్టర్ బీ గోపి శుక్రవారం ఎక్సైజ్‌శాఖ అధికారులతో కలిసి పరిశీలించారు. జిల్లాలోని 63 మద్యం దుకాణాల కేటాయింపునకు డ్రా నిర్వహణపై సమీక్ష చేశారు. కాగా, 63 వైన్‌షాపులకు 1,793 దరఖాస్తులు వచ్చినట్లు ఎక్సైజ్‌శాఖ జిల్లా అధికారి శ్రీనివాసరావు శుక్రవారం ప్రకటించారు. గీసుగొండ మండలం ధర్మారంలోని మద్యం దుకాణానికి అత్యధికంగా 73 రావడం విశేషం. 65 దరఖాస్తులతో మచ్చాపూర్ మద్యం దుకాణం రెండోస్థానంలో ఉంది. దుగ్గొండి మండలం గిర్నిబావిలోని 1వ నంబర్ మద్యం దుకాణానికి 60, రెండో నంబర్ దుకాణానికి 57, దుగ్గొండిలోని దుకాణానికి 59 దరఖాస్తులు వచ్చాయి. గీసుగొండ మండలం కొనాయిమాకులలోని మద్యం దుకాణానికి 59, జాన్‌పాకలోని వైన్‌షాపునకు 54 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు.
నర్సంపేట రూటులోని షాపులకు…
వరంగల్- నర్సంపేట ప్రధాన రహదారిలోని వైన్ షాపులకు ఎక్కువ సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. మచ్చాపూర్ వైన్‌షాపు గౌడ కులస్తులకు కేటాయించింది. అలాగే నర్సంపేటలోని ఐదో నంబర్ మద్యం దుకాణానికి 11, రాయపర్తిలోని రెండో నంబర్ దుకాణానికి 59, ఎస్సీలకు కేటాయించిన ఇక్కడి మూడో నంబర్ దుకాణానికి 41, కొత్తగా నడికూడలో ఏర్పాటు చేసే వైన్‌షాపునకు 49 దరఖాస్తులు వచ్చాయి. నడికూడ దుకాణం గౌడ కులస్తులకు కేటాయించారు. 2019-21లో 56 మద్యం దుకాణాలకు 1,768 దరఖాస్తులు వస్తే ఈసారి వీటి సంఖ్య 1,793కు పెరిగింది. దరఖాస్తు రుసుం రూపంలో ఎక్సైజ్‌శాఖకు రూ.35.86 కోట్ల ఆదాయం సమకూరింది.
కలెక్టర్ సమక్షంలో డ్రా..
దరఖాస్తుదారులకు ఎక్సైజ్‌శాఖ అధికారులు ఎంట్రీ పాసులు ఇచ్చారు. శనివారం హనుమకొండ నిట్ సమీపంలోని తారా గార్డెన్లో 63 మద్యం దుకాణాల కేటాయింపునకు డ్రా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఉదయం 11 గంటలకు కలెక్టర్ బీ గోపి సమక్షంలో లాటరీ ద్వారా మద్యం దుకాణాల కేటాయింపు ప్రారంభం కానుంది. వీడియోగ్రఫీతో ఒకటో నంబర్ గెజిట్ దుకాణం నుంచి డ్రా తీయటం షురూ చేస్తారు. డ్రాలో దుకాణాలు దక్కించుకున్న వ్యాపారులు వెంటనే రెండేళ్ల ఎక్సైజ్ ట్యాక్స్‌లో 12శాతం చలానా రూపంలో చెల్లించేందుకు గార్డెన్లో ఎస్బీఐ కౌంటర్ ఏర్పాటు చేస్తుందని శ్రీనివాసరావు తెలిపారు.