వరంగల్, ఏప్రిల్ 7 : కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ కీర్తి ప్రతిష్టలు పెంంచేలా పనిచేయాలని, చారిత్రక వరంగల్ నగరాభివృద్ధిలో కుడా మార్క్ కనిపించాలని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పిలుపునిచ్చారు. కుడా చైర్మన్‌గా సంగంరెడ్డి సుందర్రాజ్ యాదవ్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం జీడబ్ల్యూఎంసీ కమిషనర్ ప్రావీణ్య అధ్యక్షతన జరిగిన సభలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. టీఆర్ఎస్లో కష్టపడిన కార్యకర్తలు, నాయకులకు న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. ఉద్యమకాలం నుంచి టీఆర్ఎస్ పార్టీలో కష్టపడి పనిచేస్తున్న సుందర్రాజ్యాదవ్ను గుర్తించిన సీఎం కేసీఆర్ కుడా చైర్మన్ పదవి ఇచ్చారని అన్నారు. వరంగల్ నగర అభివృద్ధిపై ప్రత్యేక దృష్టిసారిస్తున్న సీఎం కేసీఆర్, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆలోచనలను క్షేత్రస్థాయిలో అమలు చేయాలని, నగరాన్ని ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేయాలని ఆయన సూచించారు.
అర్బన్ డెవలప్మెంట్ అథారిటీల్లో దేశంలోనే కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ టాప్-5లో ఉందని, ఆ స్థానాన్ని మరింత ముందుకు తీసుకుపోవాలని పేర్కొన్నారు. సమష్టిగా పనిచేస్తూ కుడాను సమర్థవంతంగా ముందుకు తీసుకుపోవాలని కోరారు. హెచ్ఎండీఏ తరహాలో కుడా ల్యాండ్ బ్యాంకును ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్ మాట్లాడుతూ త్వరలోనే నగరానికి నియో మెట్రో రైలు రానుందని తెలిపారు. దీనిపై పురపాలక మంత్రి కేటీఆర్ కేంద్రానికి లేఖ రాశారని వివరించారు. చైర్మన్ సుందర్‌రాజ్‌యాదవ్ నేతృత్వంలో కుడా మరింత అభివృద్ధి చెందాలని ఆయన ఆకాంక్షించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సహకారంతో నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దాలని సూచించారు. అభివృద్ధి నిరంతర పక్రియ అని, అందరి సహకారంతో నగరాభివృద్ధికి కృషి చేయాలని అన్నారు. త్వరలోనే కుడా సలహామండలి నియమాకం జరుగుతుందని వివరించారు.
ప్రజల అవసరాలను గుర్తించి ఆ దిశగా కుడా పనిచేయాలని అన్నారు. ఎమ్మెల్సీ కడియం శ్రీహరి మాట్లాడుతూ 1988లో తాను కుడా చైర్మన్‌గా పనిచేశానని గుర్తుచేశారు. వైస్ చైర్మన్, చైర్మన్ కలిసి పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యమతుందని అన్నారు. హైదరాబాద్ హెచ్ఎండీఏ తరహాలో కుడాను అభివృద్ధి చేయాలని అన్నారు. నగర శివారులోని భూముల యజమానులతో కుడా చర్చించి, ఒప్పించి సమష్టిగా అభివృద్ధి చేస్తే కుడాకు ఆదాయం పెరుగుతుందని ఆయన సూచించారు. నగరంలో జంక్ష న్లు అభివృద్ధి జరిగినా విజిబిలిటీ లుక్ కనిపించడం లేద ని, ప్రణాళికాబద్ధంగా మరింత అభివృద్ధి చేయలని కోరా రు. జంక్షన్లు, రోడ్లు, గ్రీనరీ సిటీలో ఎక్కువగా కనిపించేలా దృష్టి సారించాలని పేర్కొన్నారు. కుడా చైర్మన్ సుం దర్రాజ్ యాదవ్ మాట్లాడుతూ నగరాభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తానన్నారు. అందరి సహకారంతో కుడాను దేశంలోనే నంబర్ వన్‌గా నిలబెడుతానని, నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దుతానని పేర్కొన్నారు.
అభినందనల వెల్లువ..
కుడా చైర్మన్ సంగంరెడ్డి సుందర్రాజ్ యాదవ్‌కు అభినందనలు వెల్లువెత్తాయి. ఉదయం 9.30 గంటలకు బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్సీలు బస్వరాజు సారయ్య, తక్కళ్లపల్లి రవీందర్రావు, ఎమ్మెల్యేలు నన్నపునేని నరేందర్, చల్లా ధర్మారెడ్డి, మేయర్ గుండు సుధారాణి, రాష్ట్ర రోడ్ల అభివృద్ధి సంస్థ చైర్మన్ మెట్టు శ్రీనివాస్, రుణ విమోచన కమిషన్ చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్లు, డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్రావు, మాజీ ఎంపీ సీతారాంనాయక్, వరంగల్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకు చైర్మన్ ఎర్రబెల్లి ప్రదీప్‌రావు, కార్పొరేటర్లు వేముల శ్రీనివాస్, నల్లా స్వరూపారాణి, అశోక్‌యాదవ్, బైరబోయిన ఉమాదామోదర్, కావేటి కవిత, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకురాలు డాక్టర్ హరిరమాదేవి తదితరులు చైర్మన్ సుందర్‌రాజ్‌యాదవ్‌కు పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. హనుమకొండ, వరంగల్ కలెక్టర్లు రాజీవ్‌గాంధీ హన్మంతు, బీ గోపి కుడా కార్యాలయంలో చైర్మన్ సుందర్‌రాజ్‌ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందజేశారు.