వరంగల్, ఏప్రిల్ 7 (నమస్తే తెలంగాణ) : కేంద్రంలోని బీజేపీ సర్కారుకు వ్యతిరేకంగా దిక్కులు పిక్కటిల్లేలా నినదిస్తూ టీఆర్ఎస్ శ్రేణులు, ఉమ్మడి జిల్లాలో వేలాది మంది రైతులు కదం తొక్కారు. తెలంగాణలో పండిన యాసంగి ధాన్యాన్ని కేంద్రం కొని తీరాల్సిందేనని అల్టిమేటం జారీ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు జిల్లా కేంద్రాలను గురువారం నిరసన దీక్షలతో హోరెత్తించారు. భారీ ర్యాలీలు, రాస్తారోకోలు చేస్తూ, ప్లకార్డులు చేతబూని పెద్దపెట్టున నినాదాలు చేస్తూ దీక్షా స్థలాలకు చేరుకొని తమ ఆగ్రహాన్ని వెలిబుచ్చారు. మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు, జడ్పీ అధ్యక్షులు, ఇతర ప్రజాప్రతినిధులు రైతులతో కలిసి ధర్నాలో పాల్గొని కేంద్రంలోని బీజేపీ తీరును తూర్పారబట్టారు. వరంగల్ ఓ సిటీ మైదానంలోని ఆంజనేయస్వామి ఆలయ ఆవరణలో టీఆర్ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ ఆధ్వర్యంలో జరిగిన దీక్షకు రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
వరంగల్ తూర్పు, నర్సంపేట, పరకాల ఎమ్మెల్యేలు నన్నపునేని నరేందర్, పెద్ది సుదర్శన్ రెడ్డి, చల్లా ధర్మారెడ్డి, డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్రావు, నగర మేయర్ గుండు సుధారాణి, వరంగల్ అర్బన్ కో ఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ ఎర్రబెల్లి ప్రదీప్‌రావు తదితరులు దీక్షలో పాల్గొన్నారు. హనుమకొండలోని హయగ్రీవాచారి మైదానంలో టీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు, ప్రభుత్వ చీఫ్‌విప్ దాస్యం వినయ్‌భాస్కర్ ఆధ్వర్యంలో చేపట్టిన దీక్షలో ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, మేయర్ సుధారాణి, జడ్పీ అధ్యక్షుడు మారెపల్లి సుధీర్‌కుమార్, రైతు బంధు సమితి జిల్లా కోఆర్డినేటర్ ఎల్లావుల లలితాయాదవ్, రైతు రుణ విమోచన కమిషన్ చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్లు, కుడా చైర్మన్ సంగంరెడ్డి సుందర్‌రాజ్‌యాదవ్, దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ కేతిరెడ్డి వాసుదేవరెడ్డి, డీసీసీబీ చైర్మన్ మార్నేని, మాజీ ఎంపీ అజ్మీ రా సీతారాంనాయక్, ఆగ్రోస్ మాజీ చైర్మన్ లింగంపల్లి కిషన్‌రావు తదితరులు పాల్గొన్నారు.
జనగామ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ చౌరస్తా వద్ద టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, జడ్పీ చైర్మన్ పాగాల సంపత్‌రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన దీక్షలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, తాటికొండ రాజయ్య, మాజీ ఎమ్మెల్సీ బోడకుంటి వెంకటేశ్వర్లు పాల్గొని కేంద్రం తీరును ఎండగట్టారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఎంపీ, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు మాలోత్ కవిత అధ్యక్షతన నిర్వహించిన దీక్షలో రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్, ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు, ఎమ్మెల్యేలు డీఎస్ రెడ్యానాయక్, బానోత్ శంకర్‌నాయక్, జడ్పీ చైర్మన్ ఆంగోత్ బిందు పాల్గొన్నారు. ములుగు జిల్లా కేంద్రంలో టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్వర్ ఆధ్వర్యంలోజరిగిన దీక్షలో మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, జడ్పీ వైస్ చైర్పర్సన్ నాగజ్యోతి, రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు పల్లా బుచ్చయ్య పాల్గొన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో వరంగల్ జడ్పీ అధ్యక్షురాలు, జయశంకర్ జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షురాలు గండ్ర జ్యోతి అధ్యక్షతన చేపట్టిన నిరసన దీక్షలో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, జడ్పీ వైస్ చైర్పర్సన్ కళ్లెపు శోభ, మున్సిపల్ చైర్పర్సన్ సెగ్గం వెంకటరాణి పాల్గొన్నారు.