వరంగల్, ఏప్రిల్ 3 (నమస్తే తెలంగాణ): యాసంగి వడ్లు కొనుగోలు చేయాలనే డిమాండ్‌తో గులాబీ సైన్యం కేంద్రంతో సమరానికి సిద్ధమైంది. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మలి విడుత ఉద్యమ కార్యాచరణ ప్రకటించడంతో నేటి నుంచి ఈ నెల 11దాకా వరుస ఆందోళనలకు సమాయత్తమైంది. ఇందులో భాగంగా సోమవారం అన్ని మండలకేంద్రాల్లో తలపెట్టే నిరసన దీక్షలకు ఉమ్మడి వరంగల్‌లోని టీఆర్ఎస్ శ్రేణులు, రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పిలుపునిచ్చారు. ఈమేరకు మంత్రి సత్యవతి రాథోడ్‌తో కలిసి ఆరు జిల్లాల ముఖ్యనేతలతో ఆదివారం టెలీ కాన్ఫరెన్స్‌లో దిశానిర్దేశం చేశారు. మండలాలవారీగా ఇన్చార్జిలను నియమించుకొని ప్రతి రైతు భాగస్వామ్యం ఉండేలా చూడాలని.. వరి సాగు, ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం చేస్తున్న అన్యాయాన్ని, అన్నదాతను ఆగం చేస్తున్న కిషన్‌రెడ్డి, బండి సంజయ్ వ్యాఖ్యలను రైతులకు వివరించాలని కోరారు. వడ్ల కోసం నేటి నుంచి మొదలయ్యే ఈ ఆందోళనలకు రైతులు సైతం సంపూర్ణ మద్దతు తెలుపనుండడంతో ‘ధాన్యం ఉద్యమం’ మరింత ఉధృతం కానున్నది.
వరంగల్, ఏప్రిల్ 3(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ధాన్యం కొనుగోళ్ల కోసం కేంద్రంపై టీఆర్ఎస్ చేస్తున్న పోరాటం ఉధృతమవుతున్నది. యాసంగి వడ్లను కొనుగోలు చేయాలని డిమాండ్‌తో బీజేపీ ప్రభుత్వంపై టీఆర్ఎస్ మలి విడుత ఉద్యమానికి సిద్ధమైంది. సోమవారం నుంచి ఈ నెల 11 వరకు వరుసగా వివిధ రూపాల్లో నిరసనలు చేపట్టాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా సోమవారం అన్ని మండలకేంద్రాల్లో రైతులతో కలిసి పెద్ద ఎత్తున ధర్నాలు చేయాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. ఈమేరకు హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్, జనగామ, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లోని ప్రతి మండల కేంద్రంలో వడ్ల కొనుగోలు కోసం దీక్షలు చేయనుండగా ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించేలా శ్రేణులు సన్నద్ధమయ్యాయి.
పెద్ద ఎత్తున తరలిరావాలి : మంత్రి ఎర్రబెల్లి
సోమవారం అన్ని మండలకేంద్రాల్లో ధర్నాలు, ఆందోళన కార్యక్రమాలకు రైతులు, టీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున తరలిరావాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పిలుపునిచ్చారు. ఈమేరకు ఆరు జిల్లాల ముఖ్య నేతలతో ఆదివారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. గిరిజన సంక్షేమం మంత్రి సత్యవతి రాథోడ్, జిల్లా పరిషత్ చైర్మన్లు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు, పలువురు ముఖ్యనేతలు పాల్గొన్నారు. యాసంగి వడ్లను కొనుగోలు చేసేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు టీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. ఉద్యమ కార్యాచరణ రూపొందించారని, దీన్ని విజయవంతం చేయాలని కోరారు. సోమవారం అన్ని మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు ఉంటాయని పేర్కొన్నారు.
6న రాస్తారోకోలు..
ఈ నెల 6న రాష్ట్రంలోని నాలుగు జాతీయ రహదారులపై రాస్తారోకోలు ఉంటాయని కేటీఆర్ పేర్కొన్నారని.. అయితే ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో ఆ రోజు ఈ కార్యక్రమం ఉండదని స్పష్టంచేశారు. ఈ నెల 7న అన్ని జిల్లాకేంద్రాల్లో నిరసన దీక్షలు.. 8న గ్రామాల్లో నిరసన ప్రదర్శనలు, ప్రతి రైతు ఇంటిపై నల్లజెండాలు ఎగురవేయడం, మున్సిపాలిటీల్లో బైక్ ర్యాలీలు నిర్వహించాలని కోరారు. రైతులకు న్యాయం జరగాలనే డిమాండ్‌తో ఈ నెల 11న టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఢిల్లీలో నిరసన దీక్ష ఉంటుందని పేర్కొన్నారు. సోమవారం ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు నిరసనలు చేపట్టి కార్యక్రమాలను విజయవంతం చేయాలని ఎర్రబెల్లి పిలుపునిచ్చారు. ఇందుకోసం పార్టీ సీనియర్ నాయకులను, ప్రజాప్రతినిధులను మండలాల వారీగా ఇన్చార్జిలుగా నియమించాలని సూచించారు. ప్రతి రైతును భాగస్వామ్యం చేసేలా సమన్వయం చేయాలని అన్నారు. వరి సాగు, వడ్ల కొనుగోలుపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఆ పార్టీ ఇతర నేతల మాటలను ప్రజలకు వివరించాలని సూచించారు. తెలంగాణ రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వం ప్రదర్శిస్తున్న వివక్షను, వరి రైతులకు కేంద్రం చేస్తున్న అన్యాయాన్ని అందరికీ తెలియజెప్పాలని అన్నారు. ఎండల తీవ్రత ఉన్నందున, ఎవరికీ ఇబ్బంది కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు.