నర్సంపేట, ఏప్రిల్ 3: 18 ఏళ్ల కిత్రం 25 మంది పిల్లలు, ఇద్దరు ఉపాధ్యాయులతో ప్రారంభమైన ఈ పాఠశాలలో ఇప్పుడు ఏటా ‘నో అడ్మిషన్’ బోర్డే కనిపిస్తున్నది. ఇక్కడ అందుతున్న ఆంగ్ల మాధ్యమ బోధన కారణంగా ప్రతి తరగతి గది 50 నుంచి 60 మంది విద్యార్థులతో కళకళలాడుతున్నది. నర్సంపేటలో మొత్తం 395 మంది పిల్లలతో నడుస్తున్న హనుమాన్ దేవల్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, ఇప్పుడు ‘మన బస్తీ-మన బడి’తో మరింత బలోపేతం కానున్నది.
నర్సంపేటలోని హనుమాన్ దేవల్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు ఖానాపురం, నర్సంపేట పట్టణం, నర్సంపేట రూరల్, దుగ్గొండి, చెన్నారావుపేట మండలాల పరిధి గ్రామాల నుంచి విద్యార్థులు వచ్చి చదువుకుంటున్నారు. 1నుంచి 5వ తరగతి వరకు ఉండగా ప్రస్తుతం 11 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. ఇందులో ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు, ఖానాపురం కళాశాలలో పనిచేస్తున్న లెక్చరర్, కేసముద్రం, నర్సంపేట, ఇతర ప్రాంతాల్లో పనిచేసే టీచర్ల పిల్లలు కూడా చదువుతున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు, ఎస్ఎంసీ చైర్మన్, సభ్యులు పాఠశాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుండగా ఉపాధ్యాయులు అంకితభావంతో బోధిస్తున్నారు. ఇక్కడి విద్యార్థులు ఏటా నవోదయ సీట్లు సాధిస్తున్నారు. నవోదయ, గురుకులాలకు ఎంతో మంది ఎంపికయ్యారు. కరోనా సమయంలో ప్రైవేట్ పాఠశాలల నుంచి తల్లిదండ్రులు తమ పిల్లలను తీసుకొచ్చి ఇందులో చేర్పించారు.
కార్పొరేట్ తరహా సౌకర్యాలు
పాఠశాలలో తెలంగాణ ప్రభుత్వం కేటాయించిన నిధులతో కార్పొరేట్ తరహా సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఏటా వస్తున్న నిధులతో పాటు, ఇతర నిధులను కలిపి పాఠశాలలో పది తరగతి గదులు నిర్మించారు. మొదట అయిదు గదులు ఉండగా, పైఅంతస్తులో మరో అయిదు గదులు నిర్మించారు. మరుగుదొడ్లు, మూత్రశాలలు కూడా అందుబాటులో ఉన్నాయి. నీటి వసతి కోసం మోటర్తో పాటు చేతిపంపును ఏర్పాటు చేశారు. విద్యార్థులకు పోషకాలతో కూడిన ఆహారాన్ని మధ్యాహ్నం వడ్డిస్తున్నారు. గోడల మీద ఆకట్టుకునేలా.. ఆలోచింపజేసేలా చిత్రాలు గీయించారు. తరగతి గదుల్లో ఫ్యాన్లు, డెస్క్‌లు ఉన్నాయి. గదులను ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు.
టీచర్లు నిత్యం శ్రమిస్తున్నారు
పాఠశాల ఉపాధ్యాయులు నిత్యం శ్రమిస్తున్నారు. కార్పొరేట్లో చదివే పిల్లలతో పోటీ పడేలా ఇక్కడి విద్యార్థులను తయారు చేస్తున్నారు. తమ పిల్లలను ఇందులో చేర్పించేందుకు ఎక్కువ మంది వస్తున్నారు. తరగతుల వారీగా ఏర్పడిన ఖాళీల ప్రకారమే తీసుకుంటున్నాం. తర్వాత నో అడ్మిషన్ బోర్డు పెట్టాల్సి వస్తున్నది.
-ఎస్. రాజమౌళి, ప్రధానోపాధ్యాయుడు
మా పిల్లలు ఇక్కడే
నేను కొంత కాలం నుంచి ఈ పాఠశాలలోనే పనిచేస్తున్నా. మా ఇద్దరు పిల్లలను కూడా ఇందులోనే చదివిస్తున్నా. చాలామంది ఉపాధ్యాయులు, లెక్చరర్లు, ఇతర ఉద్యోగుల పిల్లలు కూడా ఇక్కడే చదువుతున్నారు. ప్రైవేట్ కన్నా, ప్రభుత్వ పాఠశాలల్లో క్వాలిఫైడ్ టీచర్లు ఉంటారు. పేదలు తమ కలలకు తగ్గట్లుగా తమ పిల్లలను ఇంగ్లిష్ మీడియంలో చదివించాలనే కోరికను ఈ పాఠశాల నెరవేర్చుతున్నది.
– సరిత, ఉపాధ్యాయురాలు
ఇంగ్లిష్ మీడియం హర్షణీయం
తెలంగాణ ప్రభుత్వం అన్ని పాఠశాల్లో ఎనిమిదో తరగతి దాకా ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టడం హర్షణీయం. ఎంతో మంది పేద, మధ్య తరగతి ప్రజలు తమ పిల్లలను ఇంగ్లిష్ మీడియంలో చదివించాలని కోరుకుంటున్నారు. ప్రైవేట్ స్కూల్స్‌కు పంపాలంటే వేలాది రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తున్నది. ఇక నుంచి తెలంగాణ ప్రభుత్వం సర్కారు బడుల్లోనే ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టడం వల్ల పిల్లలంతా ప్రభుత్వ పాఠశాలల్లోకే వస్తారు. మన బస్తీ, మన బడి కార్యక్రమానికి మా పాఠశాల ఎంపికైంది. దీనిద్వారా మరిన్ని సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయి.
– రాజేందర్, ఎస్ఎంసీ చైర్మన్, హనుమాన్ దేవల్
ప్రభుత్వ పాఠశాల బోధన బాగుంది
ప్రభుత్వ పాఠశాలలోనే మా పిల్లలు చదువుతున్నారు. ఇంగ్లిష్ మీడియంలో బోధన బాగుంది. ప్రభుత్వమే పుస్తకాలు, స్కూల్ డ్రెస్సులు అందిస్తున్నది. సౌకర్యాలు బాగున్నయ్. ఇక్కడ ఇంగ్లిష్ మీడియం వల్ల ఎంతో మంది పేద పిల్లలకు ఆర్థికంగా మేలు కలుగుతున్నది. సీఎం కేసీఆర్ వచ్చే విద్యా సంవత్సరం నుంచి అన్ని పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టడం శుభపరిణామం.
– ఎలిజబెత్ రాణి, గృహిణి