కరీమాబాద్, ఏప్రిల్ 2 : తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యా విధానంలో సమూల మార్పులు తీసుకువస్తున్నారు. అందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి ప్రభుత్వ గురుకులాలు. తల్లి లాంటి శిక్షణ.. తండ్రిలా రక్షణతో పేద విద్యార్థులకు ఉత్తమ విద్యను అందిస్తూ ఉన్నతాధికారుల ప్రశంసలు పొందుతోంది జక్కలొద్దిలోని తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ బాలుర పాఠశాల. విశాలమైన క్రీడా మైదానం… ఆహ్లాదకరమైన వాతావరణంలో సకల వసతులతో కార్పొరేటర్ పాఠశాలలను తలదన్నేలా నిలుస్తున్నది. ఇక్కడ 450 మంది విద్యార్థులకు ఇంగ్లిష్ మీడియంలో విద్యాబోధన చేయడంతో పాటు పోటీ పరీక్షలు, క్రీడల్లోనూ రాణించేలా 60 మంది సిబ్బంది శిక్షణ ఇస్తున్నారు. విద్యార్థుల కోసం ప్రత్యేక వసతులతో కూడిన భోజనశాల ఉంది. మిషన్ భగీరథ ద్వారా నిర్మించిన వాటర్ట్యాంకుతో పాటు సొంత భూమిలో సేంద్రియ పద్ధతులతో పండించిన పలు రకాల కూరగాయలను మధ్యాహ్న భోజనంలో వినియోగిస్తున్నారు. ఐఐటీ, పాలీసెట్, ఎంసెట్ పరీక్షల్లోనూ ఇక్కడి విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. ఎస్కే ఫిరోజ్ సౌతాఫ్రికాలో రాక్ ైక్లెంబింగ్లో ప్రతిభ కనబరిచాడు. దాదాపు 23 మంది విద్యార్థులు బాక్సింగ్, జూడో, రెజ్లింగ్, కబడ్డీ, టెన్నీకాయిట్, కరాటే, హాకీ తదితర ఆటల్లో జాతీయ స్థాయిలో రాణించారు. రాష్ట్రస్థాయిలో సుమారు 80 మంది విద్యార్థులు 31 మెడల్స్ సాధించారు.
ప్రభుత్వ సహకారంతోనే.. గన్నెబోయిన భిక్షపతి, ప్రిన్సిపాల్
తెలంగాణ ప్రభుత్వ సహకారంతో విద్యార్థులు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్ అందించేందుకు నిరంతరం కృషి చేస్తున్నాం. ఉత్తమ విద్యాబోధనతో పాటు క్రీడల్లోనూ శిక్షణ ఇస్తున్నాం. బడిలో అన్ని వసతులు ఉన్నాయి. సిబ్బంది సహకారంతో ఉన్నతాధికారుల మన్ననలు పొందుతున్నాం. విద్యార్థులు రాష్ట్రంలో నిర్వహించిన పలు పోటీ పరీక్షలతో పాటు జాతీయస్థాయి క్రీడల్లో ప్రతిభను చూపుతున్నారు.