వరంగల్, మార్చి 31(నమస్తేతెలంగాణ)/వరంగల్ చౌరస్తా : వరంగల్ ఎంజీఎం దవాఖానలో రోగిని రెండుసార్లు ఎలుకలు కొరికిన ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉత్తర తెలంగాణకు పెద్దదిక్కుగా ఉన్న ఎంజీఎం వైద్యశాలలో అధికారులు, శానిటేషన్ కాంట్రాక్టు సంస్థపై కఠిన చర్యలకు మంత్రి హరీశ్‌రావు ఆదేశాలు జారీ చేయడంతో ప్రస్తుతం సూపరింటెండెంట్‌గా ఉన్న డాక్టర్ శ్రీనివాసరావును విధుల నుంచి తప్పిస్తూ గురువారం రాత్రి సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో సూపరింటెండెంట్‌గా పనిచేసి, ప్రస్తుతం జనరల్ మెడిసిన్ విభాగాధిపతిగా విధులు నిర్వర్తిస్తున్న డాక్టర్ వీ చంద్రశేఖర్‌కే ఎంజీఎం సూపరింటెండెంట్‌గా పూర్తిస్థాయి బాధ్యతలను అప్పగించింది. ఘటనపై విచారణ జరిపిన అదనపు కలెక్టర్, నివేదికను ప్రభుత్వానికి అప్పగించగా దీని ఆధారంగా ఉన్నతాధికారులు సూపరింటెండెంట్‌తో పాటు రెండుసార్లు ఘటనలు జరిగిన రోజుల్లో ఆర్ఐసీయూలో డ్యూటీలో ఉన్న ఇద్దరు వైద్యులు యాకూబ్ నాయక్, హబీదిని సస్పెండ్ చేశారు. దీంతో ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడంలో ప్రభుత్వం తన చిత్తశుద్ధిని మరోసారి విస్పష్టంగా తెలియజేసినట్లయింది.
సిబ్బంది నిర్లక్ష్యం.. రోగులకు శాపం..
ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం దవాఖానలను బలోపేతం చేస్తున్నది. ప్రతి సర్కారు వైద్యశాలలో సౌకర్యాలు కల్పిస్తున్నది. ఆధునిక వైద్య పరికరాలను సమకూరుస్తున్నది. సరిపడా వైద్యులు, సిబ్బందిని నియమిస్తున్నది. ముఖ్యంగా వరంగల్‌ను హెల్త్ సిటీగా మార్చేందుకు వడివడిగా చర్యలు చేపడుతున్నది. ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించాలని ప్రభుత్వం ఇంతలా తపిస్తుంటే కొందరు వైద్యాధికారులు, సిబ్బంది నిర్లక్ష్య ధోరణి కారణంగా రోగులకు ఇబ్బందులు తప్పడం లేదు. వరంగల్ ఎంజీఎం హాస్పిటల్లో ఓ రోగిని ఎలుకలు కొరికిన ఘటనతో దవాఖాన సిబ్బంది నిర్లక్ష్యపు రోగం మరోసారి తెరపైకి వచ్చింది.
గతంలోనూ ఫిర్యాదులు
బాధితుడు కాడర్ల శ్రీనివాస్ కోమాలో ఉండడం వల్ల ఎలుకలు కొరికినా స్పందన లేకపోవడం, తెల్లవారే వరకు రక్తం కారి ఉండడంతో కుటుంబసభ్యులు గమనించి వైద్యులకు తెలిపారు. దీనిపై అదనపు కలెక్టర్ విచారణ చేసిన సందర్భంగా పలువురు అటెండెంట్లు మాట్లాడుతూ ఎంజీఎంలోని వార్డులు, ఇతర ప్రాంతాల్లో పేషెంట్లు, అటెండెంట్లు, వైద్య సిబ్బంది మధ్యే ఎలుకలు తిరుగుతున్నాయని, గతంలోనూ వీటి సంచారంపై ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోలేదని చెప్పారు. ఉన్నతాధికారులు కాంట్రాక్ట్ సంస్థకు చెప్పడం తర్వాత అందరూ లైట్ తీసుకోవడం సాధారణమైందన్నారు. వైద్యశాలలో అతి సున్నితమైన ‘రెస్పిరేటరీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఆర్ఐసీయూ)లో ఆక్సిజన్ డెలివరీ పైప్లైన్లను ఎలుకలు కొరికితే విషమంగా ఉన్న రోగుల పరిస్థితి ఏమిటని స్థానికులు చర్చించుకోవడం కనిపించింది.
ఏం జరిగిందంటే..
హనుమకొండ జిల్లా భీమారానికి చెందిన కాడర్ల శ్రీనివాస్ (38) కిడ్నీ, శ్వాసకోశ సంబంధిత సమస్యలతో కోమాలోకి వెళ్లాడు. ప్రైవేట్‌లో చికిత్స అందించినా ఫలితం లేక కుటుంబసభ్యులు ఈనెల 26న ఎంజీఎం దవాఖానలో చేర్చారు. పరీక్షించిన వైద్యులు ఆర్ఐసీయూలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. 27న రాత్రి సమయంలో బాధితుడి కుడిచేతి వేళ్ల ప్రాంతంలో ఎలుకలు కొరికినట్లు గుర్తించి కుటుంబ సభ్యులు వైద్యులకు తెలుపగా చికిత్స చేశారు. తిరిగి 30న రాత్రి ఎడమ చేతి వేళ్ల ప్రాంతంతో పాటు కాలి మడిమె ప్రాంతాల్లో ఎలుకలు కొరుకడంతో తీవ్ర రక్తస్రావం అ యింది. గురువారం తెల్లవారు జామున గుర్తించిన కుటుంబ సభ్యులు వైద్యులకు విషయం చెప్పగా చికిత్స చేశారు. కాగా బాధితుడి కుటుంబసభ్యులు ఎంజీఎం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి ఆందోళన చేయడంతో విషయం బయటకు వచ్చింది.
మంత్రి హరీశ్ ఆగ్రహం.. అదనపు కలెక్టర్ విచారణ
ఎంజీఎంలో రోగిని ఎలుకలు కొరికాయన్న విషయం తెలిసి వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి పూర్తి విచారణ జరుపాలని కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేశారు. దీంతో అదనపు కలెక్టర్ శ్రీవత్స కోట విచారణాధికారిగా ఎంజీఎంను పరిశీలించారు. బాధితుడి కుటుంబసభ్యులతో మాట్లాడి వివరాలు నమోదు చేసుకున్నారు. విధులు నిర్వహించిన వైద్యులు, సిబ్బంది హాజరు పట్టికను, వార్డు ఇరువైపులా ఉన్న ప్రాంతాన్ని పరిశీలించారు. ఆర్ఐసీయూలోకి ఎలుకలు ఎలా వచ్చాయని ఆరా తీశారు. ఎలా వస్తున్నాయోగాని, ఆర్ఐసీయూలో తిరుగుతున్నాయని, పేషెంట్ల వద్ద ఉండే ఆహార పదార్థాలను తింటున్నాయని, టాయిలెట్స్ వద్ద ఎక్కువగా కనబడుతున్నాయని పలువురు అటెండెంట్లు వివరించారు. ప్రధాన ద్వారం నుంచి కూడా వస్తున్నాయని చెప్పడంతో సిబ్బంది పనితీరు చర్చనీయాంశమైంది. శానిటేషన్ కాంట్రాక్ట్ సంస్థ నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన జరిగిందని ప్రాథమికంగా గుర్తించి ఉన్నతాధికారులకు నివేదిక పంపగా గురువారం రాత్రి వరకు ప్రభుత్వం బాధ్యులపై చర్యలు తీసుకుంటూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రజలకు వైద్య సేవలు అందించే విషయంలో నిర్లక్ష్యం వహిస్తే ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని మంత్రి హరీశ్‌రావు హెచ్చరించారు.