దుగ్గొండి, మార్చి 31: వేసవిలో పుచ్చకాయలకు మంచి డిమాండ్ ఉంటుంది. పోషకాలతోపాటు నీటిశాతం అధికంగా ఉండడంతో ప్రజలు విరివిగా కొనుగోలు చేస్తారు. దీంతో రైతులు పుచ్చసాగుపై దృష్టి సారిస్తున్నారు. మండలంలోని రేఖంపల్లి, వెంకటాపురం, గిర్నిబావి, చలపర్తి, దుగ్గొండి, తిమ్మంపేట, మహ్మదాపురం గ్రామాల రైతులు ఏప్రిల్, మే నెలలో దిగుబడి వచ్చేలా గత ఫిబ్రవరి, మార్చిలో పుచ్చ విత్తనాలు నాటారు. ప్రస్తుతం పంట చేతికొస్తుండడంతో పుచ్చకాయలను వ్యాపారులు నేరుగా తోటల వద్దకే వచ్చి కొనుగోలు చేస్తున్నారు. మరికొంత మంది రైతులు తోటల వద్దే విక్రయిస్తున్నారు. ప్రధాన రహదారుల వెంట ఉన్న రైతులు తమ కుటుంబ సభ్యులతో కలిసి రోడ్ల పక్కనే పుచ్చకాయలను వాహనదారులకు అమ్ముతున్నారు. అధిక లాభాల కోసం మరికొంత మంది రైతులు సమీప పట్టణాలు, వారాంతపు సంతలకు తీసుకెళ్లి విక్రయిస్తున్నారు. గ్రామాల్లో సైతం రైతులు ఎడ్ల బండ్ల ద్వారా పుచ్చకాయలను తీసుకెళ్లి ప్రజలకు విక్రయిస్తున్నారు.
వేసవిలో భలే డిమాండ్..
ఏప్రిల్, మే మాసాల్లో అధిక ఉష్ణోగ్రతలు ఉంటాయి. దీంతో పుచ్చకాయలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటుంది. రోజురోజుకు ఎండలు అధికమవుతుండడంతో పిల్లల నుంచి పెద్దల వరకూ శరీరంలో నీటిశాతం పెంచుకునేందుకు పుచ్చకాయలను తీసుకుంటున్నారు. పుచ్చకాయ జ్యూస్కు గిరాకీ అధికంగా ఉండడంతో వ్యాపారులు దృష్టిసారించి పెద్ద ఎత్తున దిగుమతి చేసుకుంటున్నారు. దీంతో అటు రైతులకు ఇటు వ్యాపారులకు అధిక లాభాలు వస్తునాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.
పుచ్చలో బోలెడు పోషకాలు..
పుచ్చలో అధిక నీటిశాతం ఉండడంతో శరీరానికి కావాల్సిన పోషకాలు అంది ఆరోగ్యానికి దోహదం చేస్తాయి. మండే ఎండలో శరీరంలో ఉన్న నీరు చెమట రూపంలో బయటకు వెళ్లే అవకాశం ఉండడంతో పుచ్చకాయల్లోని నీరు భర్తీ చేస్తాయి. శరీరంలోని కణాలకు హాని కలిగించే ఫ్రీ ర్యాడికల్స్ అంతు చూసే యాంటీ ఆక్సిడెంట్లు పుచ్చకాయలో మెండుగా ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. దీర్ఘకాలిక వ్యాధులైన క్యాన్సర్ బారి నుంచి కాపాడే లైకోపీన్ పుచ్చలో ఉంటుంది. జీవక్రియలకు దోహదపడే సోడియం, పొటాషియం క్లోరైడ్లు పుచ్చలో ఉండడంతో వైద్యులతోపాటు పలువురు ఆరోగ్య సూచనలు ఇచ్చే నిపుణులు పుచ్చను ఎక్కువ తీసుకోవాలని సూచిస్తున్నారు. 90 శాతం నీరుండే పుచ్చకాయ ఆరోగ్యానికి ఎంతో మంచిదని చెబుతున్నారు.
ఎకరాకు లక్షన్నర ఆదాయం
నాకున్న నాలుగు ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఎకరంలో పుచ్చ సాగు చేసిన. పసుపులో అంతర పంటగా పుచ్చ తోట సాగు చేయగా, ఎకరాకు రూ. లక్షన్నర ఆదాయం వచ్చింది. వాణిజ్య పంటల పెట్టుబడితో పోల్చితే చాలా తక్కువ పెట్టుబడితో మంచి ఆదాయం వచ్చింది. తక్కువ కాలం, తక్కువ పెట్టుబడి, తక్కువ శ్రమతో అధిక ఆదాయం పుచ్చసాగుతో సాధ్యమైంది.
– ఆవుల నర్సింహారెడ్డి, రైతు, తొగర్రాయి