వర్ధన్నపేట, మార్చి 31 : పల్లెలు సంపూర్ణ ప్రగతి సాధిస్తేనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని, అందుకే తెలంగాణ ప్రభుత్వం గ్రామాలను అభివృద్ధి చేస్తున్నదని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. మండలంలోని ల్యాబర్తి గ్రామంలో ఎమ్మెల్యే అరూరి రమేశ్‌తో కలిసి రూ.80లక్షల వ్యయంతో నిర్మించిన సీసీరోడ్లు, రూ.11.60లక్షలతో నిర్మించిన శ్మశానవాటిక, రూ.12లక్షలతో నిర్మించిన పల్లెప్రకృతివనాన్ని ప్రారంభించారు. రూ.20లక్షలతో నిర్మించనున్న గ్రామ పంచాయతీ భవనానికి గురువారం శంకుస్థాపన చేశారు. అనంతరం సర్పంచ్ పస్తం రాజు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా తెలంగాణలోని గ్రామాల్లో మౌలిక వసతులు కల్పిస్తున్నామని చెప్పారు. అంతర్గత సీసీరోడ్లు, శ్మశాన వాటికలు, పల్లెప్రకృతి వనాలు, డంపింగ్ యార్డులను నిర్మించామన్నారు. దీంతో గ్రామాల రూపురేఖలు మారిపోయాయన్నారు. వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్ అందిస్తున్న ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్యం, విద్యను అందిస్తున్నదని మంత్రి వివరించారు.
కేంద్రమే ధాన్యం కొనాలి.. నందనం సొసైటీ తీర్మానం : మంత్రి ఎర్రబెల్లి
నందనం సొసైటీని ములుకనూరు సొసైటీలాగా ఆదర్శంగా తీర్చిదిద్దాలని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. నందనం గ్రామంలో సొసైటీ నూతన భవనాన్ని టీఆర్ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్, డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్‌రావుతో కలిసి గురువారం ఆయన ప్రారంభించారు. అనంతరం సొసైటీ వైస్ చైర్మన్ తక్కళ్లపల్లి చందర్రావు అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 70 ఏళ్ల సమైక్య పాలనలో తెలంగాణలో అభివృద్ధి జరుగలేదు. కానీ, కేసీఆర్ ముఖ్యమంత్రి ఆయ్యాక అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. నందనం గ్రామంలో చెక్ డ్యామ్ కట్టించినా, కరెంట్ కోతలతో రైతులు ఆందోళన చేసే వారు.. ఇప్పుడు ప్రధాని మోటర్లకు మీటర్లు పెట్టాలని కుట్రపన్నారు. కానీ, కేసీఆర్ దానికి ఒప్పుకోలేదన్నారు.వర్షాకాలం లోగా ఐనవోలు మండలంలోని ప్రతి గ్రామానికి సాగు నీరు అందించేలా కృషి చేస్తున్నామని చెప్పారు. గతంలో నీళ్ల కోసం కొట్లాడి జైలుకు పోయిన.. సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా సాగునీరు, మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ తాగునీరు ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపారు. రైతుల రుణాలను మాఫీ చేసిన ఘనత ఎన్టీ రామారావుది అయితే, రైతుల రుణాలను మాఫీ చేసి, రైతుబంధు పథకం ద్వారా పెట్టుబడి ఇచ్చిన ఘనత మన ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందన్నారు.
రైతులను కేంద్రం ఓర్వడం లేదు..
రాష్ట్రంలో పంటలకు సరిపడా నీళ్లు, కరెంటు ఉన్నాయి. దీంతో రాష్ట్రంలో వరి పంట మెండుగా పండుతుంది. అందుకే కేంద్రం ఓర్వలేక యాసంగిలో పండిన పంటను కొనుగోలు చేయం అంటుంది. పంజాబ్‌లో ఎందుకు కొంటున్నారు. తెలంగాణలో ఎందుకు కొనడం లేదని సీఎం కేసీఆర్ గట్టిగ నిలదీసే సరికి నూక కాని బియ్యం కొంటాం అని కబుర్లు చెబుతుంది కేంద్రం. యాసంగిలో నూక కాకుండా బియ్యం ఉంటాయా అనే విషయం రైతులు అలోచించాలని ఆయన కోరారు. యాసంగి ధాన్యాన్ని కొనేదాకా పోరాటం చేస్తానని సీఎం కేసీఆర్ సంకల్పంతో ముందుకు సాగుతున్నారు. రైతులందరు ఆయనకు అండగా ఉండాలని సూచించారు.
నేటి నుంచే కొత్త పింఛన్లు..
రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం నుంచి 57 ఏళ్ల పై బడిన వయస్సు వారందరికీ కొత్త పింఛన్లు ఇస్తామని తెలిపారు. కరోనాతో రెండేళ్లు ఎవరికి కొత్త పింఛన్లు రాలేదన్నారు. ఐనవోలు 1200 మందికి కొత్త పింఛన్లు వస్తాయన్నారు. అదే విధంగా నందనం గ్రామంలో 200 మందికి కొత్త పింఛన్లు రాబోతున్నట్లు చెప్పారు.
నందనం అభివృద్ధికి రూ.2.10 కోట్లు..
నందనం గ్రామాభివృద్ధికి ఎమ్మెల్యే అరూరి రమేశ్ కోరి న విధంగా రూ.2.10 కోట్ల నిధుల మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ముందుగా చెక్కు డ్యాంపై బ్రిడ్జి నిర్మాణంలో కోసం రూ.1 కోటి 50 లక్షలు, జీపీ భవనం కోసం రూ.25 లక్షలు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. తర్వాత సీసీ రోడ్లుకు నిధులు కేటాయిస్తానని హామీ ఇచ్చారు. నందనం సొసైటీని ఆదర్శంగా తీర్చిదిద్దిన సమర్థుడు డీసీసీబీ చైర్మన్(నందనం సొసైటీ అధ్యక్షుడు) మార్నేని రవీందర్రావు అని కొనియాడారు. అనంతరం యాసంగి ధాన్యం కొనుగోలు చేయాలని తీర్మానం చేశారు.
కేంద్రానికి గుణపాఠం తప్పదు : అరూరి
ఆరుగాలం కష్టపడి పంటలు పండించే రైతులను కేంద్ర ప్రభుత్వం మోసం చేస్తే గుణపాఠం తప్పదని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యాసంగిలో తెలంగాణలో కేవలం దొడ్డురకం వరి మాత్రమే సాగవుతుందనే విషయం తెలిసినప్పటికీ కేంద్రంలోని బీజేపీ సర్కారు ధాన్యం కొనుగోలు చేసేందుకు ముందుకు రాకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఇప్పటికే పెట్రోల్, గ్యాస్ ధరలను విపరీతంగా పెంచిన కేంద్రం రైతులను మోసం చేస్తే ప్రజాగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. తెలంగాణ రైతులు కలిసికట్టుగా కేంద్ర ప్రభుత్వంపై పోరు సాగించాలన్నారు. రైతులకు అండగా తెలంగాణ ప్రభుత్వం, టీఆర్ఎస్ పార్టీ ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ అన్నమనేని అప్పారావు, జడ్పీటీసీ మార్గం భిక్షపతి, ఎంపీటీసీ అన్నమనేని ఉమాదేవి, ఉపసర్పంచ్ పిన్నింటి కళింగరావు తదితరులు పాల్గొన్నారు.