ఖిలావరంగల్, ఫిబ్రవరి 28: అమృత్ భారత్ పథకం కింద వరంగల్ రైల్వేస్టేషన్లో అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. స్టేషన్ అభివృద్ధి కోసం కేంద్ర రైల్వే శాఖ రూ. 25.41 కోట్లు కేటాయించింది. ఇందులో భాగంగా ఇప్పటికే 50 శాతం పనులు పూర్తయినట్లు దక్షిణమధ్య రైల్వే అధికారులు తెలిపారు. మిగతా పనులు త్వరలోనే పూర్తి చేస్తామని ప్రకటించారు. అమృత్ భారత్ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా 40 స్టేషన్లలో అభివృద్ధి పనులు చేపట్టినట్టు తెలిపారు. వరంగల్ రైల్వే స్టేషన్లో ముఖద్వారం, ఫుట్ ఓవర్ బ్రిడ్జి, లిఫ్టులు, ఎస్కలేటర్లు, పైకప్పు, మరుగుదొడ్లు, వెయిటింగ్ హాల్, పార్కింగ్, పచ్చదనం తదితర పనులు చేపడుతున్నట్లు చెప్పారు. ఈ రైల్వే స్టేషన్ నుంచి రోజుకు సగటున 31,887 మంది ప్రయాణిస్తారని, వార్షిక ఆదాయం రూ. 41.09 కోట్లు వస్తుందని తెలిపారు.