భీమదేవరపల్లి, ఆగస్టు 12: ఉమ్మడి కరీంనగర్, వరంగల్ జిల్లాల పరిధిలో వ్యవసాయ పొలాల వద్ద ఉన్న ట్రాన్స్ఫార్మర్లలోని కాపర్‌వైరును (Copper Wire) అపహరిస్తున్న ఇద్దరు అన్నదమ్ములతోపాటు వారి నుంచి విక్రయించిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ముల్కనూరు ఠాణాలో ఎల్కతుర్తి సీఐ పులి రమేశ్, ఎల్కతుర్తి, ముల్కనూరు ఎస్సైలు ప్రవీణ్‌కుమార్, సాయిబాబుతో కలిసి కాజీపేట ఏసీపీ పింగిళి ప్రశాంత్‌రెడ్డి నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండల కేంద్రానికి చెందిన బండి కుమార్, బండి సతీశ్‌లు గత 13 ఏండ్లుగా ట్రాన్స్ఫార్మర్లలోని కాపర్‌వైరును దొంగతనం చేయడం వృత్తిగా ఎంచుకున్నారన్నారు. గతంలో కరీంనగర్ జిల్లా కేశవపట్నం, రామగుండం మండలాల పరిధిలో కాపర్‌వైరు దొంగతనం కేసులో జైలు జీవితం గడిపి బయటకు వచ్చినా వారి తీరు మారలేదని చెప్పారు. ముల్కనూరు ఠాణా పరిధిలోని భీమదేవరపల్లి క్రాసింగ్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా టీవీఎస్ ఎక్స్ఎల్ వాహనంపై వస్తున్న బండి కుమార్, బండి సతీశ్‌లు ఆగకుండా వెళ్లిపోయారు. వారిపై అనుమానం వచ్చిన ముల్కనూరు ఎస్ఐ సాయిబాబు అతని సిబ్బందితో కలిసి వెంబడించి వారిని పట్టుకోగా వారి వాహనంలో రెండు ఖాళీ సంచులు, స్క్రూడ్రైవర్, పానాలు, ఇనుపరాడ్లు లభించాయి.
వాహనంలో కాపర్‌వైరు వాసన రావడంతో వెంటనే వారిద్దరిని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారణ చేపట్టినట్లు తెలిపారు. దీంతో తాము ఉమ్మడి కరీంనగర్, వరంగల్ జిల్లాల్లోని హుజురాబాద్, కేశవపట్నం, భీమదేవరపల్లి, ఎల్కతుర్తి, వేలేరు, ధర్మసాగర్, చిల్పూరు, అక్కన్నపేట మండలాల్లో 27 ట్రాన్స్ఫార్మర్లలో కాపర్‌వైర్లు దొంగలించామని అంగీకరించినట్లు పేర్కొన్నారు. ఇటీవల వీరిపై 21 కేసులు వీరిపై నమోదు కాగా అంతకుముందు 32 కేసులు నమోదయ్యాయని మొత్తంగా 53 కేసులు నమోదైనట్లు తెలిపారు. వీరు దొంగలించిన సుమారు 250 కేజీల కాపర్‌వైరును ముల్కనూరులోని రుద్రాక్ష తిరుపతి విక్రయించాడని తెలిపారు. నిందితుల నుంచి రూ.2.50లక్షల విలువైన కాపర్‌వైరు, కరెంటు మోటార్, టీవీఎస్ ఎక్స్ఎల్ వాహనం, చేతి గ్లౌజులు, పానాలు, స్క్రూడ్రైవర్, ఇనుపరాడ్డులు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.
రైతులు తమ పంటలను కోతులు, అడవి జంతువుల నుంచి రక్షించుకున్నట్లు గానే ట్రాన్స్ఫార్మర్లపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. వ్యవసాయ క్షేత్రాల వద్ద ఎవరైనా అనుమానంగా తారసపడితే 100కు డయల్ చేయాలన్నారు. కాపర్‌వైరు చోరీ చేస్తున్న బండి కుమార్, సతీశ్‌లతోపాటు విక్రయించిన రుద్రాక్ష తిరుపతిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరుస్తామని తెలిపారు. గత కొంతకాలంగా కాపర్‌వైరు చోరీ చేస్తున్న వారిని చాకచక్యంగా పట్టుకున్న ముల్కనూరు ఎస్ఐ నండ్రు సాయిబాబు, పోలీసు సిబ్బంది మోహన్‌బాబు, రమేశ్, కలీం, సదానందం, నాగేశ్వర్‌రావులను అభినందించారు.