హనుమకొండ రస్తా, అక్టోబర్ 10 : వరంగల్ నిట్ 67వ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భం 1959లో భారత తొలి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ భారతదేశంలోని తొలి ప్రాంతీయ ఇంజినీరింగ్ కాలేజీ (ఆర్ఈసీ)కి శంకుస్థాపన చేసిన చారిత్రక దినోత్సవాన్ని వారు స్మరించుకున్నారు. అనంతరం జాతీయ ప్రాముఖ్యత కలిగిన సంస్థగా నిట్‌గా అభివృద్ధి చెందింది. ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా భారత లోహ పరిశోధన సంస్థ (ఐఐఎం) గౌరవ సభ్యుడు, స్టీల్ రీసెర్చ్ అండ్ టెక్నాలజీ మిషన్ ఆఫ్ ఇండియా గవర్నింగ్ బోర్డు సభ్యుడు, రూర్కెలా స్టీల్ ప్లాంట్ మాజీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సనక్మిశ్రా హాజరయ్యారు.
‘ది హైపోతిసిస్ ఆఫ్ ది హైయరార్కీ ఆఫ్ నాలెడ్జ్’ అనే అంశంపై ఫౌండేషన్ డే ఉపన్యాసం ఇచ్చారు. నిట్ డైరెక్టర్ ప్రొఫెసర్ బిద్యాధర్ సుబుధి మూడు అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌లతో ప్రారంభమైన ఈ సంస్థ నేడు భారతదేశంలో అగ్రగామి సాంకేతిక విశ్వవిద్యాలయాలలో ఒకటిగా ఎదిగిందని తెలిపారు.
ప్రస్తుతం నిట్‌లో 11 బి.టెక్, 26 ఎం.టెక్, 5 ఎం.ఎస్.సి., ఎం.సి.ఎ., ఎం.బి.ఏ., బి.ఎస్ .సి-బి.ఎడ్, సమగ్ర ఎం.ఎస్ .సి. కోర్సులు బోధించబడుతున్నాయని, తాజాగా పునర్విమర్శించిన పాఠ్యక్రమం స్వయంఅభ్యాసం, ఆవిష్కరణ, పరిశ్రమ అవసరాలకు తగిన నైపుణ్యాలపై దృష్టి సారిస్తోందని చెప్పారు. నిట్‌లో 8 వేల మంది విద్యార్థులు, 700 మంది అధ్యాపకులు, సిబ్బంది, 42,600 మందికిపైగా పూర్వవిద్యార్థుల బలమైన నెట్వర్క్ ఉందని, 2024-25 విద్యా సంవత్సరంలో అధ్యాపకులు 884 జర్నల్ పేపర్లు, 350 కాన్ఫరెన్స్ పేపర్లు, 127 పుస్తక అధ్యాయాలు ప్రచురించి, 95 జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు అందుకున్నట్లు, అలాగే 25 పేటెంట్లు సాధించారన్నారు.
సంస్థకు మొత్తం 45.65 కోట్లు విలువైన పరిశోధనా నిధులు లభించాయన్నారు. 81.3 శాతం ప్లేస్మెంట్ రేటు సాధించిందని, అత్యధిక వార్షిక ప్యాకేజీ రూ.64 లక్షలుగా నమోదైందన్నారు. డాక్టర్ ఆర్.విజయ్ (డైరెక్టర్, డీఎస్టీ-ఏఆర్‌సీఐ, హైదరాబాద్), ప్రొ. మాధవీలత గాలి (ఐఐఎస్సీ , బెంగళూరు), డాక్టర్ నవీన్ మంజూరన్ (చైర్మన్, సాల్వ్ గ్రూప్, యూఎస్ఏ), సునీత నదంపల్లి (అమెజాన్ వెబ్ సర్వీసెస్), శ్రీకృష్ణ ప్రసాద్ కేఎస్(ఆస్టర్ మారినీ కార్గో ఎల్ఎల్సీ, దుబాయ్), విపిన్ జైన్ (ఏఎండీ, యూఎస్ఏ), డాక్టర్ దీపక్‌రెడ్డి పుల్లగురం (అసిస్టెంట్ ప్రొఫెసర్, ఐఐటీ ఖరగ్‌పూర్) ఉన్నారు. అనంతరం విద్యార్థుల అకాడెమిక్ ప్రతిభను గుర్తించి ప్రోత్సహించేందుకు పీ.వి.ఆర్. మోహన్ మెమోరియల్ మెరిటోరియస్ అవార్డు ప్రదానం చేశారు.