వరంగల్, సెప్టెంబర్ 13: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అన్ని ప్రాంతాలకు అభివృద్ధిని వికేంద్రీకరించేందకు చర్యలు తీసుకుంటున్నారు. సమగ్రాభివృద్ధికి అధికారులు పక్కా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. స్మార్ట్‌సిటీతో పాటు అన్ని పట్టణ ప్రగతి, జనరల్ ఫండ్, సీఎంఈవై నిధులతో అభివృద్ధి వెలుగులు నింపుతున్నారు. స్మార్ట్‌సిటీ నిధులతో నగరంలోని ప్రధాన రహదారులు శరవేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. ఎస్టీపీలు, పార్కుల అభివృద్ధి పురోగతిలో ఉన్నాయి. గ్రంథాలయాల నవీకరణ పనులు పూర్తయ్యాయి. మరో వైపు పట్టణ ప్రగతి, జనరల్ ఫండ్, సీఎం హామీ నిధులతో విలీన గ్రామాలతోపాటు గ్రేటర్‌లోని అన్ని డివిజన్లలో అభివృద్ధి పనులు చేస్తున్నారు. వరంగల్ తూర్పు, పశ్చిమ నియోజకవర్గాలతోపాటు వర్ధన్నపేట, పరకాల, స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గాల పరిధిలోని 42 విలీన గ్రామాల్లో సమాంతరంగా అభివృద్ధి జరుగుతోంది. రూ.198.56 కోట్ల పట్టణ ప్రగతి, రూ.759.11 కోట్లు జనరల్ ఫండ్, రూ. 580.70 కోట్ల సీఎం హామీ నిధులతో పనులు చేపడుతున్నారు. రూ.948 కోట్లతో స్మార్ట్‌సిటీ పనులు పురోగతిలో ఉన్నాయి. విలీన గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు సమగ్ర ప్రణాళికలు చేశారు. రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థను పటిష్ట పరిచేలా పనులు చేపట్టారు.
స్మార్ట్‌గా నగరం
రాబోయే రోజుల్లో నగరం స్మార్ట్‌గా కనిపించనుంది. పెద్ద ఎత్తున స్మార్ట్‌సిటీ నిధులతో అభివృద్ధి పనులను చేపట్టారు. దశాబ్దాల కాలం నాటి రహదారులకు స్మార్ట్‌సిటీ నిధులతో కొత్త రూపం ఇస్తున్నారు. విశాలమైన రోడ్లు, పక్కన సైకిల్ ట్రాక్, అందమైన పూల చెట్లు ఇలా నగరంలోని ప్రధాన రహదారులను స్మార్ట్‌గా తీర్చిదిద్దుతున్నారు. ఇప్పటికే నగరంలోని కొన్ని రహదారుల పనులు తుది దశకు చేరుకోగా మరికొన్ని రహదారుల పనులు శరవేగంగా సాగుతున్నాయి. నగర పరిధిలో తూర్పు, పశ్చిమ నియోజవర్గాల్లో ఉన్న ప్రధాన రహదారులను స్మార్ట్ రోడ్లుగా అభివృద్ధి చేస్తున్నారు. ఇప్పటికే పశ్చిమ నియోజకవర్గం పరిధిలోని నాలుగు స్మార్ట్‌రోడ్ల పనులు పూర్తి కావొచ్చాయి. మరో వైపు తూర్పు నియోజవర్గంలోని 14 ప్రధాన ప్రధాన రహదారులను స్మార్ట్ రోడ్లుగా అభివృద్ధి చేస్తున్నారు. తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల పరిధిలో రూ.948.55 కోట్ల నిధులతో 62 పనులు చేపట్టారు. అందులో రూ.23.86 కోట్ల నిధులతో చేపట్టిన 21 పనులు పూర్తి చేశారు. రూ. 924.69 కోట్ల నిధులతో చేపట్టిన పనులు పురోగతిలో ఉన్నాయి. మిగిలినవి వేగంగా ముందుకు సాగుతున్నాయి. అదేవిధంగా పార్కులు, సమీకృత మార్కెట్లను అదేస్థాయిలో అభివృద్ధి చేస్తున్నారు.
పట్టణ ప్రగతి నిధులతో..
పట్టణ ప్రగతి నిధులతో గ్రేటర్ అంతా అభివృద్ధి జరుగుతోంది. నాలుగు విడుతల పట్టణ ప్రగతి కార్యక్రమం ద్వారా నగరంలోని అన్ని డివిజన్లలో ప్రజాప్రతినిధులు, అధికారులు పర్యటించి సమస్యలను గుర్తించారు. ప్రాధాన్యతా క్రమంలో డివిజన్లలో రూ.198.56 కోట్ల పట్టణ ప్రగతి నిధులతో 523 అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. తూర్పు నియోజకవర్గం పరిధిలో రూ.46.56 కోట్లతో 120 అభివృద్ధి పనులు, పశ్చిమ నియోజకవర్గం పరిధిలో రూ.24.72 కోట్లతో 173 పనులు, వర్ధన్నపేట నియోజవర్గం పరిధిలో రూ.32.70 కోట్లతో 118 అభివృద్ధి పనులు, పరకాల నియోజకవర్గంలో రూ.30.02 కోట్లతో 15 పనులు, స్టేషన్‌ఘన్‌పూర్ నియోజవర్గం పరిధిలో రూ.3.23 కోట్లతో ఒక అభివృద్ధి పని చేపడుతున్నారు. ఇప్పటికే రూ. 124.76 కోట్లతో చేపట్టిన 369 అభివృద్ధి పనులు పూర్తయ్యాయి. మిగిలిన అభివృద్ధి పనులు పురోగతిలో ఉన్నాయి. పట్టణ ప్రగతి నిధులతో విలీన గ్రామాల్లోని రోడ్లు, డ్రైనేజీలు, పైపులైన్ వ్యవస్థ, శ్మశానవాటికలు, పార్కులు అభివృద్ధి చేస్తున్నారు.
సాధారణ నిధులతో..
జనరల్ ఫండ్‌తో గ్రేటర్లో సమాంతరంగా అభివృద్ధి చేస్తున్నారు. నగరాభివృద్ధే లక్ష్యంగా గ్రేటర్ పాలకవర్గం ముందుకుపోతున్నది. రూ.759.11 కోట్ల జనరల్ ఫండ్ నిధులతో 7,908 అభివృద్ధి పనులు చేపట్టారు. అందులో రూ.417.18 కోట్లతో చేపట్టిన 6,288 అభివృద్ధి పనులు పూర్తయ్యాయి. మిగిలిన పనులు పురోగతిలో ఉన్నాయి. తూర్పు నియోజవర్గంలో రూ.162.15 కోట్లు, పశ్చిమ నియోజకవర్గంలో రూ.225.57 కోట్లు, వర్ధన్నపేట నియోజకవర్గంలో రూ.191.15 కోట్లు, పరకాల నియోజకవర్గంలో రూ.91.40 కోట్లు, స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గంలో రూ.2.31 కోట్లు కేటాయించి పనులు చేస్తున్నారు. వీటితోపాటు జనరల్ ఫండ్ నుంచి మరో రూ. 58.15 కోట్లు కేటాయించి గ్రేటర్‌లోని 66 డివిజన్లలో అభివృద్ధి పనులు చేపట్టారు.
సీఎం హామీ నిధులతో..
సీఎం హామీ నిధులతో గ్రేటర్లో పెద్ద ఎత్తున అభివృద్ధి జరుగుతోంది. నగరాభివృద్ధిపై ప్రత్యేక దృష్టిసారిస్తున్న సీఎం కేసీఆర్ నగరానికి నిధుల వరద పారిస్తున్నారు. సీఎం హామీ నిధులతో గ్రేటర్ పరిధిలో రూ.580.70 కోట్లతో 1,404 అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. వీటిలో రూ. 247.39 కోట్లతో చేపట్టిన 494 పనులు పూర్తయ్యాయి. రూ.175 కోట్లతో చేపట్టిన 31 పనులు పురోగతిలో ఉన్నాయి. మరో 315.84 కోట్లతో చేపట్టాల్సిన 879 పనులకు టెండర్ ప్రక్రియ పూర్తయ్యింది. త్వరలోనే పనులు ప్రారంభిస్తామని గ్రేటర్ అధికారులు చెబుతున్నారు.