వరంగల్, సెప్టెంబర్ 5(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి వరంగల్ జిల్లా పురావస్తు శాఖ మ్యూజియం నీళ్ల మడుగులో ఉన్నది. కాం గ్రెస్ ప్రభుత్వ తీరుతో మ్యూజియం మూతపడిన పరిస్థితి వచ్చింది. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్(జీడబ్ల్యూఎంసీ) అడ్మినిష్ర్టేషన్ కొత్త భవన నిర్మాణం కోసం తీసిన గుంత చెరువును తలపిస్తున్నది. పు రావస్తు శాఖ మ్యూజియం ముందే ఈ నీటి మడుగు ఉండడంతో అది మూతపడే పరిస్థితి వచ్చింది. మ్యూజియంలో పనిచేసే సిబ్బంది సైతం లోపలికి వెళ్లేందుకు దారి లేదు.
అధికారికంగా మ్యూజియం నడుస్తున్నా విజిటర్లు రాకపోవడంతో మూతపడినట్లే ఉన్నది. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయం ఆఫీసు ఆవరణలో ఇండోర్ స్టేడియం ముందు కొత్త పరిపాలన భవనం నిర్మాణం కోసం హడావిడిగా జరిపిన తవ్వకంతో అక్కడ పెద్ద గుంతలా మారింది. చెట్ల పొదల మధ్య ఉన్న చిన్న కాలిబాట నుంచి ఉద్యోగులు, సిబ్బంది వెళ్లా ల్సి వస్తున్నది.
అడుగు పక్కకు పడితే తాటిచెట్టంత లోతున్న గుంతలో పడే ప్రమాదం ఉంది. ప్రస్తుతం వర్షపు నీటితో నిండి ఉన్న ఈ గుంతలో కుక్కలు, పందులు పడి దుర్వాసన వస్తున్నది. నీటి గుంతలో పడిపోతామనే భయంతో ఇండోర్ స్టేడియంలో షటిల్ ఆడుకోవానికి, జిమ్ చేయడానికి, వివిధ క్రీడల్లో శిక్షణ పొందే వారు రావడంలేదు. గుంత చుట్టూ ఎలాంటి కంచె లేకపోవడంతో ఇండోర్ స్టేడియం సైతం మూతపడే దుస్థితి నెలకొన్నది.
మ్యూజియం నిర్మాణం కోసం 1985 మార్చి 29న అప్పటి గవర్నర్ శంకర్దయాల్ శర్మ శంకుస్థాపన చేశారు. 1987లో భవన నిర్మాణం పూర్తయ్యింది. ప్రాచీన వస్తువులు, కళాఖండాలను ప్రదర్శనలో ఉంచడానికి ఈ భవనంలో పెద్దహాల్, మూడు గదులు, ఎన్క్లోజ్డ్ గ్యాలరీ ఏర్పాటు చేశారు. ఉమ్మడి జిల్లాలోని కాకతీయుల కాలం నాటి శిల్పా లు, విగ్రహాలు, రాజులు వినియోగించిన యుద్ధ సామగ్రితో పాటు నంది విగ్రహాలు, రాతి ఫిరంగులు మ్యూజియంలో ఏర్పాటు చేశారు.
ఉమ్మడి జిల్లాలోని చారిత్రక, వారసత్వ సంపద ఎక్కడ దొరికినా ఇందు లోనే పెడతారు. దీని పక్కనే నక్షత్రశాల, కాకతీయ మ్యూజికల్ గార్డెన్ కూడా ఉండడంతో విజిటర్లతో ఈ ప్రాంతం రద్దీగా ఉండేది. అవి రెం డూ మూతపడటం.. నీటి గుంత ఉండడంతో మ్యూజియానికి కూడా ఇదే పరిస్థితి వచ్చింది. శిథిలావస్థకు చేరిన మ్యూజియంను ఖిలా వరంగల్లో కొత్తగా నిర్మించిన భవనంలోకి మార్చాలని పురవాస్తు శాఖ జిల్లా అధికారులు పలుమార్లు ఉన్నతాధికారులను కోరినా ఫలితం లేదు.
పురావస్తు శాఖ మ్యూజియంను వరంగల్ కోటలోని భవనంలోకి తరలించే ప్రక్రియలో జాప్యం జరుగుతున్నది. కోట సమీపంలో మ్యూజియం కోసం అన్ని హంగులతో విశాలమైన, అధునాతన భవనాన్ని నిర్మిసుండగా, ఆ పనులు సైతం నిలిచిపోయాయి. మ్యూజియంను అకడికి తరలిస్తే, కోటను సందర్శించేందుకు వచ్చిన వారు చూసేందుకు వీలువుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా మ్యూజియానికి ప్రచారం కల్పిస్తే చారిత్రక అంశాలపై నేటి తరానికి అవగాహన కల్పించే అవకాశం ఉంటుంది.