హనుమకొండ, ఫిబ్రవరి 26 : శివతత్వానికి ఓరుగల్లు ప్రతీక అని.. వరంగల్‌కు మహాశివరాత్రి పండుగకు అనుబంధం ఉన్నదని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు అన్నారు. హిందుధర్మ పరిరక్షణకు పాటుపడుతున్న చిలుకూరు ప్రధాన అర్చకుడు సీఎస్ రంగరాజన్‌పై దాడిని ప్రతి హిందువు ఖండించాలన్నారు. ఇండస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో హనుమకొండ హయగ్రీవాచారి మైదానంలో బుధవారం నిర్వహించిన మహాశివరాత్రి ఆధ్యాత్మిక సాంస్కృతిక సమ్మేళనానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ ఓరుగల్లును పాలించిన కాకతీయులు శివున్ని పూజించేవారని ఆయన పేర్కొన్నారు.
నగరంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం శివతత్వాన్ని మరింత పెంపొందిస్తుందని చెప్పారు. శివరాత్రి అంటే చెంబెడు నీళ్లు.. బిల్వ పత్రం ఉంటే చాలని అన్నారు. పొద్దంతా ఉపవాసం.. రాత్రంతా జాగరణతో ప్రజలు ఉండటం పండగ ప్రత్యేక అని పేర్కొన్నారు. ఈ పండుగ రోజున గతంలో రాత్రి వేళల్లో పాత సినిమాలు వేసేవారని, ప్రస్తుత రోజుల్లో ఆలయాలకు, ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని తెలిపారు. దేవున్ని నిండు మనుసు, ఏకాగ్రతతో వేడుకొంటే వచ్చే ఉల్లాసం, ప్రశాంతత ఏ పదవిలో, సంపదలో దొరకవని చెప్పారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉన్నదని హరీశ్‌రావు అన్నారు. ఇంత గొప్ప కార్యక్రమం ఏర్పాటుచేసిన ఇండస్ ఫౌండర్ ఏనుగుల రాకేశ్‌రెడ్డి, ఫౌండేషన్ సభ్యులకు మాజీ మంత్రి అభినందనలు తెలిపారు.
శివతత్వాన్ని కల్గి ఉన్న వరంగల్ గడ్డపై పుట్టడం తన అదృష్టమని మాజీమంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు. భారతదేశంలోనే వరంగల్‌కు గొప్ప చరిత్ర ఉన్నదన్నారు. రామాయణం రాసిన వాల్మికి, భాగవతాన్ని రాసిన బమ్మెర పోతనలు ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన వారేనన్నారు. అలాగే కాకతీయ రాజులు సైతం రామప్ప, వేయిస్తంభాల ఆలయం లాంటి శైవక్షేత్రాలను నిర్మించారన్నారు. ఇదొక అద్భుత కార్యక్రమమని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో వరంగల్‌కు ప్రత్యేకమైన విశిష్టత ఉందన్నారు. కాకతీయుల కాలంలో నిర్మించిన గొలుసుకట్టు చెరువులకు కేసీఆర్ నాయకత్వంలో హరీశ్‌రావు పూర్వవైభవం తీసుకొచ్చారని కొనియాడారు.
ఓరుగల్లు విశిష్టత, శివతత్వాన్ని, ఔన్నత్యాన్ని భావితరాలకు అందించాలనే సంకల్పంతో ఐదేళ్లుగా నిర్వహిస్తున్న మహాశివరాత్రి ఆధ్యాత్మిక సాంస్కృతిక సమ్మేళన కార్యక్రమానికి ఓరుగల్లు ప్రజలు ఆదరిస్తున్నారని ఇండస్ ఫౌండేషన్ చైర్మన్ ఏనుగుల రాకేశ్‌రెడ్డి తెలిపారు. ఈ సందర్బంగా కాకతీయ పురస్కార అవార్డులను అతిథుల చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన ప్రవచనాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, జానపద పాటలు ఎంతో ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో మాజీ మంత్రి సత్యవతిరాథోడ్, మాజీ ఎమ్మెల్యేలు తాటికొండ రాజయ్య, నన్నపునేని నరేందర్, ఒడితెల సతీశ్‌కుమార్, కార్పొరేషన్ మాజీ చైర్మన్ నాగుర్ల వెంకన్న, సీఎస్ రంగరాజన్, గడ్డం సమ్మయ్య, జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు బాలసముద్రంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యక్రమానికి చేరుకోగా జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్‌భాస్కర్, మాజీ ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ మాజీ చైర్మెన్లు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు.