నవరాత్రులు విశేష పూజలందుకున్న వినాయకుడికి బుధవారం ‘గణ’ వీడ్కోలు పలికారు. ‘గణపతి బప్పా మోరియా’.. ‘జై బోలో గణేశ్ మహరాజ్‌కీ.. జై’ అంటూ భక్తులు జయజయధ్వానాలతో హోరెత్తించారు. ఈ సందర్భంగా విద్యుద్దీపాలతో ప్రత్యేకంగా అలంకరించిన వాహనాల్లో విగ్రహాలను ఊరేగిస్తూ కన్నుల పండువగా శోభాయాత్రలు నిర్వహించారు. దారి పొడవునా మహిళలు మంగళహారతులతో గణనాథుడికి స్వాగతం పలుకగా, డప్పుచప్పుళ్లు, కోలాటాలతో చిన్నాపెద్దా నృత్యాలు చేస్తూ ముందుకుసాగారు. అనంతరం సమీపంలోని చెరువులు, కుంటల్లో నిమజ్జనం చేసి ‘గణపయ్యా.. సెలవయ్యా’ అంటూ సాగనంపారు. ఇలా ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పోలీసుల పర్యవేక్షణలో గణేశ్ నిమజ్జన వేడుకలు ప్రశాంతంగా ముగిశాయి.
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా గణేశ్ నిమజ్జన ఉత్సవాలను బుధవారం ఘనంగా నిర్వహించారు. నవరాత్రులపాటు భక్తుల పూజలందుకున్న గణనాథుడిని గంగమ్మ ఒడికి సాగనంపారు. ప్రత్యేకంగా అలంకరించిన వాహనాల్లో విగ్రహాలను డప్పుచప్పుళ్లు, ఆటపాటల నడుమ వీధులగుండా వైభవంగా శోభాయత్రగా తీసుకెళ్లారు. ఈ సందర్భంగా చిన్నాపెద్ద అందరూ ఉత్సాహంగా నృత్యం చేశారు. ఇండ్లతో పాటు మండపాల్లో ప్రతిష్ఠించిన వినాయకులను సమీప చెరువులు, కుంటల్లో వదిలి ‘గణపయ్యా.. మళ్లీ రావయ్యా..!’ అంటూ వీడ్కోలు పలికారు. నిమజ్జన ప్రాంతాల వద్ద భారీ క్రేన్లు, ట్రాలీలతో పాటు రెస్క్యూ సిబ్బందిని అందుబాటులో ఉంచగా పోలీసుల భారీ బందోబస్తు నడుమ నిమజ్జన వేడుకలు ప్రశాంతంగా ముగిశాయి.
శోభాయాత్రతో వరంగల్ నగరం సహా జిల్లాకేంద్రాలన్నీ భక్తజనంతో కోలాహలంగా మారాయి. శోభాయాత్రతో దారులన్నీ కిక్కిరిసిపోగా, డప్పుచప్పుళ్ల నడుమ యువత నృత్యాలతో వాడలన్నీ హోరెత్తాయి. హనుమకొండలోని విగ్రహాలను పద్మాక్షిగుండం, వడ్డెపల్లి చెరువు, కాజీపేట సోమిడి చెరువు, బంధం చెరువు, వరంగల్‌లోని కోటచెరువులో నిమజ్జనం చేశారు. కాగా ఉర్సుగుట్ట వద్ద మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, చిన్నవడ్డెపల్లి చెరువు వద్ద నిమజ్జన వేడుకల్లో ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ దంపుతులు, మేయర్ గుండు సుధారాణి, మహబూబాబాద్ జిల్లాకేంద్రంలో నిజాం చెరువు వద్ద నిమజ్జన కార్యక్రమంలో ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్, భూపాలపల్లిలో నిమజ్జన ఉత్సవాల్లో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పాల్గొన్నారు. భూపాలపల్లి జిల్లాకేంద్రంలోని విగ్రహాలను కాళేశ్వరంలో, ములుగులోని విగ్రహాలను తోపుకుంట కట్టలో, జనగామలోని విగ్రహాలను నెల్లుట్ల చెరువులో, మహబూబాబాద్‌లో నిజాంచెరువులో నిమజ్జనం చేశారు. నిమజ్జనం బందోబస్తు విధుల్లో వరంగల్ కమిషనరేట్ నుంచి వెయ్యి మంది పోలీసులు పాల్గొన్నారు.
– నమస్తే నెట్వర్క్, సెప్టెంబర్ 27