రాష్ట్ర బడ్జెట్లో ఉమ్మడి జిల్లాకు అన్యాయమే జరిగింది. అభివృద్ధి కోసం ప్రత్యేకంగా ఎలాంటి నిధులను కేటాయించకపోవడం నిరాశే మిగిల్చింది. వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్, జనగామ, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాలకు ప్రత్యేకంగా నిధులు మంజూరు చేయలేదు. కేసీఆర్ ప్రభుత్వం మొదలుపెట్టిన అభివృద్ధి పనులను పూర్తి చేసేందుకు అవసరమైన నిధుల కేటాయింపు ప్రస్తావన ఎక్కడా లేదు. సాగునీటి ప్రాజెక్టుల విషయంలో అరకొర నిధులు విదిల్చి కాంగ్రెస్ సర్కారు మరోసారి నిర్లక్ష్యంగా వ్యవహరించింది. అసెంబ్లీ ఎన్నికలప్పుడు హామీ ఇచ్చిన వాటికీ భట్టి పద్దులో చోటుదక్కకపోవడంపై అన్ని వర్గాలు పెదవి విరుస్తున్నాయి.
– వరంగల్, మార్చి 19 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
హనుమకొండ : రాష్ట్ర బడ్జెట్లో విద్య, వైద్యం, వ్యవసాయం, గృహనిర్మాణ రంగాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమానికి నిధుల కేటాయింపు పెంచాలి. లేకపోతే ఆందోళనలు, ఉద్యమాలు తప్పవు. ఎన్నికల ముందు కాంగ్రెస్ మ్యానిఫెస్టోకు, ప్రస్తుత ప్రతిపాదనలకు ఎలాంటి పొంతన లేదు. హైదరాబాద్ తరువాత రెండవ రాజధానిగా పేరొంటున్న వరంగల్, హనుమకొండ నగరాల అభివృద్ధికి ఎలాంటి నిధులు కేటాయించలేదు. నాలుగు రోజుల క్రితం స్టేషన్ ఘనపూర్‌లో జరిగిన సభలో సీఎం వరంగల్ నగరాభివృద్ధికి చిత్తశుద్ధితో ఉన్నామని చెప్పినా, బడ్జెట్ కేటాయింపుల్లో అది ప్రతిబింబించలేదు. నగరంలో అండర్ డ్రైనేజీ, మామునూరు ఎయిర్పోర్ట్ అభివృద్ధి నిధులపై స్పష్టత లేదు. వరంగల్-హైదరాబాద్ ఇండస్ట్రియల్ కారిడార్‌ను కూడా రాష్ట్ర ప్రభుత్వం విస్మరించింది. ఇండ్లు లేని కుటుంబాలు 30 లక్షలుంటే కేవలం 4.50 లక్షల మందికి మాత్రమే ఇవ్వడానికి ప్రతిపాదించారు. ఈ ఏడాది కూడా ఆరు గ్యారెంటీల అమలు జరిగే అవకాశం లేదు. కేవలం ప్రచారం కోసమే ఈ బడ్జెట్ ఉంది.
– జీ ప్రభాకర్‌రెడ్డి, సీపీఎం హనుమకొండ జిల్లా కార్యదర్శి
జనగామ చౌరస్తా : కాంగ్రెస్ తన మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలకు ఆమడ దూరంలో ప్రస్తుత బడ్జెట్ కేటాయింపులున్నాయి. విద్యాశాఖకు 15 శాతం నిధులు కేటాయిస్తామని చెప్పి గతేడాది కన్నా 0.20 శాతం తగ్గించింది. గతేడాది విద్యారంగానికి రూ. 21,292 కోట్లు (7.77 శాతం) కేటాయించగా ప్రస్తుతం రూ. 23,108 కోట్లు (7.57 శాతం) మాత్రమే కేటాయించింది. గత బడ్జెట్ రూ. 2,74,058 కోట్లు, ప్రస్తుతం రూ. 3,04,965 కోట్లతో సరిపోల్చితే అంకెల్లో రూ. 1,816 కోట్లు పెరిగినట్లుగా ఉన్నప్పటికీ శాతాల్లో మాత్రం గతేడాది కన్నా తగ్గింది. 26,067 ప్రభుత్వ పాఠశాలలను ప్రభుత్వం గాలికొదిలేసి, రెసిడెన్షియల్, యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్‌పై మాత్రమే మాట్లాడుతున్నది. గురుకులాల్లో చదివేది 5.5 లక్షల మంది విద్యార్థులే. ప్రభుత్వ, జిల్లా, మండల పరిషత్ పాఠశాలల్లో చదివే వారి సంఖ్య 16 లక్షలు. ఇందులో అత్యధికంగా బడుగు, బలహీన వర్గాల పిల్లలున్నారు. వీరికి నాణ్యమైన విద్య అందించేందుకు ఈ కేటాయింపులు సరిపోవు.
-పీ చంద్రశేఖర్‌రావు, టీపీటీఎఫ్ జనగామ జిల్లా అధ్యక్షుడు
మహబూబాబాద్ (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రూ. 3,04,965 కోట్ల మొత్తం బడ్జెట్లో రూ. 23,108 కోట్లు విద్యాశాఖకు కేటాయించింది. అయితే ఈ శాఖకు మరిన్ని నిధులు కేటాయిస్తే మరింత అభివృద్ధి చెందుతుంది. అలాగే ప్రభుత్వ ఉద్యోగులకు బడ్జెట్ నిరాశాజనకంగా ఉంది. ఐదు పెండింగ్ డీఏలు, పీఆర్సీ ఊసే లేకపోవడం బాధాకరం. కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగులకు మొండిచేయి చూపింది. ఇప్పటికైనా పునరాలోచించి పెండింగ్‌లో ఉన్న డీఏలు, పీఆర్సీ విడుదల చేయడంతో పాటు ఫీజు రీయింబర్స్మెంట్ సమస్యను పరిష్కరించాలి.
– పులి దేవేందర్ ముదిరాజ్, టీపీఆర్టీయూ రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి
పరకాల : మల్లు భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్ బడా మోసంగా కన్పిస్తున్నది. అసలు బడ్జెట్లో ఆదాయ, వ్యయాలకు పొంతన లేదు. సీఎం రేవంత్‌రెడ్డి మాటలలాగే భట్టి బడ్జెట్ ప్రసంగం కూడా అబద్ధాలతో నిండింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేందుకు ఇచ్చిన హామీలను అమలు చేసే చిత్తశుద్ధి ప్రభుత్వానికి, మంత్రులకు ఉన్నట్లు కనిపించడం లేదు. బడ్జెట్లో ఒక్క హామీకి పూర్తి స్థాయిలో నిధులు కేటాయించలేదు. అసలు కొన్ని పథకాల అమలు ప్రస్తావనే తీసుకురాకపోవడం వారి పనితీరుకు అద్దంపడుతున్నది. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అందిస్తామన్న కాంగ్రెస్ పెద్దలు తమ పూర్తి కాలంలో కూడా వాటిని అమలు చేసే పరిస్థితి లేదు. మొత్తంగా కాంగ్రెస్ రెండో బడ్జెట్ కూడా వారి పాలన లాగానే అస్తవ్యస్తంగా ఉంది. వరంగల్ ఉమ్మడి జిల్లాకు తలమానికమైన కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు అభివృద్ధి కోసం బడ్జెట్లో ఎలాంటి నిధులు కేటాయించలేదు.
– చల్లా ధర్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే, పరకాల
నర్సంపేట : కాంగ్రెస్ ప్రభుత్వం బుధవారం ప్రవేశపెట్టింది ప్రజా, రైతు వ్యతిరేక బడ్జెట్. మొత్తంగా రైతులకు మొండిచేయి చూపింది. ఈ బడ్జెట్‌తో 6 గ్యారెంటీలు అమలు చేయడం అసాధ్యమనేది స్పష్టమవుతున్నది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హయాంలో 2020-21లోనే రూ. 25,305 కోట్లు, 2021-22లో రూ. 26,822 కోట్లు వ్యవసాయానికి కేటాయించారు. ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయానికి రూ. 24,439 కోట్లే కేటాయించింది. దీంతో రైతు భరోసా అమలు చేయడం కష్టం. ఈ బడ్జెట్ వ్యవసాయానికి పూర్తి వ్యతిరేకం. మహిళలకు ఇస్తామన్న రూ. 2500ల పథకానికి నిధులు కేటాయించకపోవడం దారుణం. ఈ ఏడాది మహిళా, చేయూత పథకం ఎగవేస్తారు. నిరుద్యోగ భృతి ఊసేలేదు. తులం బంగారం ముచ్చట తీయనేలేదు. కాంగ్రెస్ తామిచ్చిన ఆరు గ్యారెంటీలకు ఎగనామం పెట్టేదే ఈ బడ్జెట్.
– పెద్ది సుదర్శన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే, నర్సంపేట