వరంగల్, అక్టోబర్ 29(నమస్తేతెలంగాణ) : వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి రాగం వినిపిస్తున్నది. తమ పార్టీ అధిష్టానం ఇక్కడి నుంచి మాజీ మంత్రి కొండా సురేఖ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయడంపై అసంతృప్తి వెలిబుచ్చుతున్నారు. స్థానికురాలు కాని సురేఖకు పోటీ చేసే అవకాశం కల్పించడాన్ని వ్యతిరేకిస్తున్నారు. తూర్పు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిత్వాన్ని పలువురు నేతలు ఆశించారు. తమకు టికెట్ కేటాయించాలని అధిష్ఠానానికి దరఖాస్తు చేశారు. వీరిలో సురేఖతో పాటు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు, మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ, మాజీ డిప్యూటీ మేయర్ ఎంబాడి రవీందర్ తదితరులు ఉన్నారు. ఎవరికి వారే పార్టీలోని తమ గాడ్ఫాదర్ల ద్వారా కాంగ్రెస్ అభ్యర్థిత్వం కోసం ప్రయత్నించారు. ఎలాగైనా టికెట్ దక్కించుకోవాలని తమకు ఉన్న పలుకుబడిని ఉపయోగించారు. పోటీ ఉండడం వల్ల కాంగ్రెస్ అధిష్ఠానం తొలి విడుత 55 మంది అభ్యర్థులతో ఇటీవల విడుదల చేసిన జాబితాలో తూర్పు నుంచి ఎవరికీ చోటు కల్పించలేదు.
తాజాగా శుక్రవారం మరో 45 మంది అభ్యర్థులతో రెండో జాబితా విడుదల చేసింది. ఇందులో కొండా సురేఖ పేరు ప్రకటించింది. దీంతో ఈ నియోజకవర్గంలోని కాంగ్రెస్ నేతలు కొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా పొరుగు నియోజకవర్గానికి చెందిన సురేఖకు ఇక్కడ టికెట్ ఇవ్వడాన్ని తప్పు పడుతున్నారు. ఎంబాడి రవీందర్ ఆధ్వర్యంలో ఆ పార్టీ నేతలు కొందరు శనివారం రాత్రి వరంగల్ ఎల్బీనగర్లో సమావేశమయ్యారు. వీరిలో ఓ మాజీ కార్పొరేటర్‌తో పాటు ఈ నియోజకవర్గ ఎన్నికల కో ఆర్డినేటర్ ఒకరు ఉన్నట్లు తెలిసింది. తూర్పు అభ్యర్థినిగా సురేఖను ప్రకటించడంపైనే ప్రధాన చర్చ జరిగినట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిత్వాన్ని ఆశించిన స్థానికులను పక్కనపెట్టి వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో ఉండే సురేఖకు టికెట్ ఇవ్వడంపై పార్టీ నేతలు నిరసన వెలిబుచ్చినట్లు తెలిసింది. ఆమె స్థానంలో స్థానికులైన మరొకరిని బరిలో నిలపాలని, లేకుంటే స్థానికుల్లో ఒకరిని స్వతంత్ర అభ్యర్థిగా పోటీకి దింపాలని సమావేశంలో నిర్ణయించినట్లు సమాచారం. పార్టీ అధిష్టానం స్పందన చూశాక మరోసారి సమావేశం కావాలనే ఆలోచనలో వీరు ఉన్నట్లు తెలిసింది. ఈ పరిణామాలు తూర్పులో రాజకీయంగా ఆసక్తి రేపుతున్నాయి.