వరంగల్ చౌరస్తా : మే 20న దేశ వ్యాప్తంగా నిర్వహించతలపెట్టిన సార్వత్రిక సమ్మెలో భాగంగా హైదరా బాద్లోని ఇందిరా పార్క్ వద్ద ఏఐటియూసి ఆధ్వర్యంలో ఉద్యోగుల హక్కుల సాధన కై నిర్వహించే మహాధర్నా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఎన్హెచ్ఎం కాంట్రాక్ట్ అండ్ ఔట్ సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేష్ ఖన్నా పిలుపునిచ్చారు. సోమవారం జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి డా. సాంబశివరావుకు సమ్మె నోటీసును అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేషనల్ హెల్త్ మిషన్(ఎన్. హెచ్ ఎం) లో 78 రకాల క్యాడర్స్ లో పని చేస్తున్న 17 వేల 541 మందికి ఉద్యోగ భద్రత, హెల్త్ కార్డులు, నాలుగవ తరగతి సిబ్బందికి కనీస వేతనం 26 వేలు చేయాలని డిమాండ్ చేశారు. కార్మిక, ఉద్యోగుల సమస్యల పైన శాశ్వత పరిష్కారం కొరకు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో జాతీయ ఆరోగ్య మిషన్ ఉద్యోగులందరూ పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా ఏఐటియుసి జిల్లా కమిటీ ప్రతినిధులు, జాతీయ ఆరోగ్య మిషన్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.