కాశీబుగ్గ, జూలై 11 : సమష్టిగా మొక్కలు నాటి వన మహోత్సవంలో వరంగల్ జిల్లాను అగ్రగామిగా నిలబెట్టాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖల మంత్రి కొండా సురేఖ పిలుపునిచ్చారు. గురువారం నగరంలోని 18వ డివిజన్లోని ఈఎస్ఐ ఆస్పత్రి ప్రాంగణంలో మేయర్ గుండు సుధారాణి, కలెక్టర్ డాక్టర్ సత్య శారద, కమిషనర్ అశ్విని తానాజీ వాకడే, డీఎఫ్‌వో అనూజ్ అగర్వాల్‌తో కలిసి మంత్రి మొక్కలు నాటి పంపిణీ చేశారు. జీడబ్ల్యూఎంసీ, అటవీశాఖ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతు 75 ఏళ్ల క్రితం అప్పటి కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి కేఎం మున్షీ వన మహోత్సవాన్ని ప్రారంభించారన్నారు. గత నెల 29న సీఎం రేవెంత్‌రెడ్డి వజ్రోత్సవ లోగో ఆవిష్కరించి ఇక్కడి నుంచే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా 20 కోట్ల మొక్కలు నాటడం లక్ష్యం కాగా, జిల్లాకు 24 లక్షలు కేటాయించినట్లు చెప్పారు.
ప్రస్తుతం మొక్కలు నాటడంలో జిల్లా రెండో స్థానంలో నిలిచిందని, మొదటి స్థానానికి చేరేందుకు కృషి చేయాలన్నారు. ఆలోచన బాగున్నా ఆచరణ లేకపోతే ఫలితాలు దక్కవని, నాటిన ప్రతి మొక్కను సంరక్షించేందుకు ప్రణాళికా బద్ధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. కోతులు అడవులకు పోవాలంటే పండ్ల మొక్కలు నాటాలని అటవీ శాఖ అధికారులను సూచించారు. ప్లాస్టిక్ వినియోగం వల్ల పర్యావరణంతో పాటు మానవాళికి ముప్పు వాటిల్లుతుందన్నారు. వివిధ దుకాణాల యజమానులతో సమావేశమై ప్లాస్టిక్ నియంత్రణపై అవగాహన కల్పించాలన్నారు. తొందర్లోనే గ్రేటర్ వరంగల్‌లో పెద్ద ఎత్తున అన్ని వర్గాల సహకారంతో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్లు, తహసీల్దార్లు, నాయకులు పాల్గొన్నారు.