వరంగల్, సెప్టెంబర్ 14: గ్రేటర్ కార్పొరేషన్ పరిధిలో పురోగతిలో ఉన్న అభివృద్ధి పనుల్లో వేగం పెంచి త్వరితగతిన పూర్తి చేయాలని మేయర్ గుండు సుధారాణి అధికారులను ఆదేశించారు. కార్పొరేషన్ కౌన్సిల్ హాల్లో కమిషనర్ ప్రావీణ్యతో కలిసి ఆమె స్మార్ట్సిటీతోపాటు జనరల్, సీఎం హామీ, ఎస్సీ సబ్‌ప్లాన్ నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులపై సమీక్షించారు. గతంలో అనేకసార్లు కాంట్రాక్టర్లకు ఆదేశాలు ఇచ్చినా పట్టించుకోకపోవడంతో ప్రాణ నష్టం జరిగిందని మేయర్ అన్నారు. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు జరుగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి డివిజన్‌కు రూ. 50 లక్షల నిధులతో అభివృద్ధి పనులకు సంబంధించిన ప్రతిపాదనలను కార్పొరేటర్ల నుంచి స్వీకరించి పనులు చేపట్టాలన్నారు. సమీక్షలో ఎస్ఈ ప్రవీణచంద్ర, ఈఈ రాజయ్య, స్మార్ట్‌సిటీ పీఎంసీ ఆనంద్ వోలేటి, ఇన్చార్జి ఈఈలు సంజయ్‌కుమార్, రవికుమార్, డీఈలు సంతోష్‌బాబు, రవికిరణ్, సారంగం, ఏఈలు పాల్గొన్నారు.
రక్తదాన శిబిరం ఏర్పాటు అభినందనీయం
మిలాద్ ఉల్ నబీ పర్వదినం సందర్భంగా అంజుమన్-ఈ-హైదర్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమని మేయర్ గుండు సుధారాణి అన్నారు. కార్పొరేషన్ కౌన్సిల్ హాల్లో కమిషనర్ ప్రావీణ్యతో కలిసి ఆమె ఈ నెల 30న నిర్వహించనున్న రక్తదాన శిబిరం పోస్టర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో కల్పలత సూపర్‌బజార్ ఉపాధ్యక్షుడు మహ్మద్ షఫీ, సొసైటీ అధ్యక్షుడు మహ్మద్ ఒమర్ పాషా, ప్రధాన కార్యదర్శి మహ్మద్ అన్సారీ షాఖాద్రీ, ఉపాధ్యక్షుడు మహ్మద్ తౌసిఫ్, రఫీయొద్దీన్, హర్మానీ, సాదీర్ పాషా తదితరులు పాల్గొన్నారు.
ఇంటింటికీ మాత్రలు పంపిణీ చేయాలి
జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకొని 1 నుంచి 19 ఏళ్లలోపు వయసు ఉన్న పిల్లలకు అల్బెండజోల్ మాత్రలను ఇంటింటికీ వెళ్లి పంపిణీ చేయాలని సీడీఎంఏ డాక్టర్ సత్యనారాయణ అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ నుంచి ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి కమిషనర్లకు ఆదేశాలు జారీ చేశారు. గురువారం నుంచి 18 వరకు నిర్వహించనున్న తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను పురస్కరించుకొని ప్రభుత్వ కార్యాలయాలను రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో కమిషనర్ ప్రావీణ్య, సీహెచ్‌వో శ్రీనివాసరావు, కార్యదర్శి విజయలక్ష్మి, హెచ్‌వో ప్రిసిల్లా, ఎంహెచ్వో డాక్టర్ రాజేశ్, డీసీపీ ప్రకాశ్‌రెడ్డి, ఈఈ సంజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.