గోదావరి నది పరవళ్లు తొక్కుతున్నది. రెండు రోజులు కురిసిన వానలకు తోడు మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ర్టాల నుంచి నదికి వరద పోటెత్తుతున్నది. మంగపేట మండలం ఇన్‌టేక్ వెల్ వద్ద 83.5 మీటర్ల ఎతులో ప్రవహిస్తున్నది. వాజేడు మండలం పేరూరు వద్ద సోమవారం సాయంత్రం ఐదు గంటలకు 45 అడుగులకు చేరుకొని క్రమ క్రమంగా పెరుగుతున్నది. ఏటూరునాగారం మండలం రామన్నగూడెం పుష్కరఘాట్ వద్ద మధ్యాహ్నం మొదటి ప్రమాద హెచ్చరిక (14.830) దాటింది. కాగా, సాయంత్రం ఆరు గంటలకు 15.500 మీటర్లకు చేరుకుంది. కాళేశ్వరం వద్ద 12.5 మీటర్ల ఎత్తులో పారడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. కన్నాయిగూడెం మండల పరిధి సమ్మక్క బరాజ్ వద్ద గోదావరి ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నది. దీంతో గేట్లన్నీ ఎత్తి నీటిని దిగువకు వదిలారు.
మంగపేట/ వాజేడు/ ఏటూరునాగారం/ కన్నాయిగూడెం/ కాళేశ్వరం, మహాముత్తారం, సెప్టెంబర్ 12 : మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ర్టాలతో పాటు రెండు రోజులు కురిసిన వర్షాలకు గోదావరి నది పరవళ్లు తొక్కుతున్నది. దీంతో మంగపేట మండలం కమలాపురం ఇన్‌టేక్ వెల్ వద్ద సముద్రమట్టానికి 83.5 మీటర్ల ఎత్తులో ప్రవహిస్తున్నది. బోరునర్సాపురం, కమలాపురం, అకినేపల్లిమల్లారం గ్రామాల లోతట్టు ప్రాంతాల్లోకి నది బ్యాక్ వాటర్ కమ్ముకోవడంతో పంట పొలాలు నీట మునిగాయి. బోరునర్సాపురం వద్ద కరకట్ట షట్టరు తూము నుంచి బ్యాక్ వాటర్ కమ్ముకొని శ్మశాన వాటిక, సమీప పొలాలు నీట మునిగాయి. గౌరారం వాగుకు గోదావరి బ్యాక్ వాటర్ కమ్ముకొని పొదుమూరు గ్రామ సమీపానికి రావడంతో సోమవారం సాయంత్రం మండల ప్రత్యేక అధికారి తులరవి, తహసీల్దార్ శ్రీనివాసులు, ఎంపీడీవో శ్రీధర్ ఆ ప్రాంత వాసులతో మాట్లాడారు. రాత్రికి వరద పెరిగితే సురక్షిత ప్రాంతానికి వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని సూచించడంతో పాటు, స్థానిక పంచాయతీ సిబ్బందిని అప్రమత్తం చేశారు.
వాజేడు మండలంలోని పేరూరు వద్ద సోమవారం సాయంత్రం ఐదుగంటలకు 14.530 మీటర్లు(45)అడుగులకు చేరుకొని గోదావరి పెరుగుతున్నట్లు సీడబ్ల్యూసీ అధికారు తెలిపారు. దీంతో పేరూరు, వాజేడు, పూసూరు బ్రిడ్జి వద్ద నది పరవళ్లుతొక్కుతూ ప్రవహిస్తుంది. టేకులగూడెం గ్రామ శివారులో 163 జాతీయ రహదారి నీట మునగడంతో ఛత్తీస్‌గఢ్, తెలంగాణ అంతర్రాష్ట్ర రవాణా సౌకర్యం నిలిచిపోయింది. జాతీయ రహదారిపై ప్రమాదం ఉన్న నేపథ్యంలో అధికారులు చెక్‌పోస్టు ఏర్పాటు చేశారు. నాగారం బీసీ కాలనీ శివారులోకి వరదనీరు చేరి గుమ్మడిదొడ్డి, వాజేడు ప్రధాన రహదారిపై ఉన్న కొంగాల వాగు చప్టా నీటమునిగి రాకపోకలు నిలిచిపోయాయి. రాత్రి వరకు గోదావరి మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.
ఏటూరునాగారం మండలం రామన్నగూడెం పుష్కరఘాట్ వద్ద మధ్యాహ్నం మొదటి ప్రమాద హెచ్చరిక 14.830 దాటింది. కాగా, సాయంత్రం ఆరు గంటలకు 15.500 మీటర్లకు చేరుకుంది. దీంతో పుష్కరఘాట్ వద్ద మెట్లు కొంత మేరకు మునిగిపోయాయి. ప్రవాహ తాకిడికి పుష్కరఘాట్‌కు ఎగువ ప్రాంతంలోని కొద్ది దూరంలో ఒడ్డు ఉర్లిపోతున్నది.
కన్నాయిగూడెం మండలం సమ్మక్క బరాజ్ (తుపాకులగూడెం) వద్ద గోదావరి తీవ్రరూపం దాల్చి ప్రమాదస్థాయిలో ప్రవహిస్తుంది. ప్రస్తుత నీటిమట్టం 84.7 మీటర్లుగా నమోదైంది. ఎగువ నుంచి బరాజ్‌కు 10.45 లక్షల కూసెక్కుల వరద వస్తుండగా గేట్లన్నీ ఎత్తి అంతేస్థాయిలో నీటిని దిగువకు వదులుతున్నట్లు అధికారులు తెలిపారు. నెలరోజుల్లో రెండోసారి నది ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో వాగులు, ఒర్రెల నుంచి బ్యాక్ వాటర్ పంటపొలాల్లోకి చేరుతుంది.
మహదేవపూర్ మండలం కాళేశ్వరం వద్ద గోదావరి 12.5 మీటర్ల ఎత్తులో పారడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. పుష్కర ఘాట్ వద్ద ఉన్న ప్రజలు, కింది గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు. పుష్కరఘాట్ వద్ద 10.50 లక్షల క్యూసెక్కులుగా పారుతూ లక్ష్మీ బరాజ్ వైపు పరుగులు తీస్తుంది.
మహాముత్తారం మండల వ్యాప్తంగా కురిసిన వర్షాలకు రహదారులు, పంట పొలాలు దెబ్బతిన్నాయి. మండలకేంద్రం నుంచి వజినేపల్లి వెళ్లే రహదారి గత వర్షాలతో పాటు ప్రస్తుత వానలకు మరింత దెబ్బతిన్నది. పలు గ్రామాల్లోని వరి, పత్తి పంటలన్ని నీట మునగడంతో తీవ్ర నష్టం వాటిల్లింది. పంటలను వ్యవసాయ అధికారులు పరిశీలించారు.