‘రాష్ట్రంలో వర్షాలు దంచి కొడుతున్నాయి. అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి. తక్షణమే ముంపు ప్రాంతాలపై దృష్టి సారించాలి. పునరావాస ఏర్పాట్లు యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలి. ప్రజలు కూడా అధికారులకు సహకరించి అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు మానుకోవాలి. రోడ్ల పైనుంచి వరద నీరు ప్రవహిస్తే వెంటనే రాకపోకలు బంద్ చేయాలి. గత అనుభవాల దృష్ట్యా జాగ్రత్తగా ఉండాలి. ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం సంభవించకుండా చూసుకోవాలి.’ అని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అధికారులను ఆదేశించారు. భారీ వర్షాలపై ఉమ్మడి జిల్లా ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఉమ్మడి జిల్లా కలెక్టర్లు, సీపీ, ఎస్పీలు, అధికారులతో ఆయన టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. వరద నష్టాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుని నివారణ చర్యలు చేపట్టడానికి కలెక్టరేట్లు, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో టోల్ ఫ్రీ నంబర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
వరంగల్, సెప్టెంబర్ 12(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో ప్రాణ, ఆస్తి నష్టం జరుగకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అధికారులను ఆదేశించారు. దంచికొడుతున్న వానలతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయని, ఇంకా కొన్ని రోజులు భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉన్నదని వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న నేపథ్యంలో ముంపు ప్రాంతాలపై దృష్టి సారించాలన్నారు. ప్రత్యేకించి ములుగు, భూపాలపల్లి, వరంగల్, హనుమకొండ, కాజీపేట, జనగామ ప్రాంతాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఉమ్మడి వరంగల్ జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, కలెక్టర్లు, వరంగల్ సీపీ, ఎస్పీలు, పంచాయతీరాజ్ అధికారులతో మంత్రి దయాకర్‌రావు సోమవారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా, కమిషనర్ హనుమంతరావును అప్రమత్తం చేశారు. ఉమ్మడి జిల్లాలో భారీ వర్షాలపై మంత్రి ఆరా తీశారు. కలెక్టర్లతో మాట్లాడారు. ప్రాణ, ఆస్తి నష్టం జరుగకుండా తీసుకోవాల్సిన ముందు జాగ్రత్త చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.
ములుగు జిల్లాలో గోదావరి పరీవాహక ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలన్నారు. గోదావరి ప్రవాహం పెరిగే అవకాశం ఉన్నందున ఎలాంటి ఆస్తినష్టం జరుగకుండా చూడాలని ములుగు జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. గత ఏడాది వరంగల్‌లో భారీ వర్షాల వల్ల వరద ప్రవాహం పెరిగి నష్టం జరిగిందని, ఈ సారి ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. అధికారులు సమన్వయంతో పని చేసి చెరువులు, రోడ్లు తెగిపోకుండా చూడాలన్నారు. ఒక అంగుళం కంటే ఎకువ ఎత్తుతో నీరు ప్రవహించినా రోడ్డును తాతాలికంగా బ్లాక్ చేయాలని మంత్రి సూచించారు.
కరంటు స్తంభాలకు నష్టం వాటిల్లకుండా చూడాలన్నారు. వానలు ఎక్కువగా ఉన్న ప్రాంతంలో కరంట్‌ను నిలిపి వేసి నష్టాన్ని నివారించాలని చెప్పారు. వరద నష్టాలను ఎప్పటికప్పుడు తెలుసుకుని నివారణ చర్యలు చేపట్టడానికి కలెక్టరేట్లు, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో టోల్ ఫ్రీ నంబర్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మిషన్ భగీరథ మంచినీటి సరఫరాకు ఆటంకాలు రాకుండా చూడాలని, ఎక్కడైనా సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరించాలని చెప్పారు.
వరద నీటితో రోడ్లు కోతకు గురై ప్రజల రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని, పంచాయతీరాజ్ రోడ్లను పరిరక్షించేలా చర్యలు తీసుకోవాలన్నారు. కోతకు గురైన రోడ్ల వివరాలు, నష్టం అంచనా రూపొందించి, వాటి పునరుద్ధరణ, మరమ్మతుల పనులు చేపట్టాలని ఆదేశించారు. పారిశుధ్య నిర్వహణ పక్కగా చేపట్టాలని సూచించారు. సీజనల్ వ్యాధుల నివారణకు చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే, జిల్లా పరిషత్ సీఈవోలు, ఎంపీడీవోలు, ఎంపీవోలు, గ్రామ కార్యదర్శులను అప్రమత్తం చేయాలని కలెక్టర్లను మంత్రి ఆదేశించారు.