పూలను పూజించే బతుకమ్మ పండుగ అంటే ఆడబిడ్డలకు కొండంత సంబురం.. తొమ్మిది రోజులపాటు తీరొక్క పూలతో అంగరంగ వైభవంగా జరుపుకునే ఈ ఉత్సవాలకు రాష్ట్ర సర్కారు అన్ని ఏర్పాట్లు చేయడంతోపాటు బతుకమ్మ చీరెలతో ఆడబిడ్డలను గౌరవిస్తున్నది. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ యేడు కూడా చీరెలు పంపిణీ చేసేందుకు కసరత్తు చేస్తున్నది. ఇప్పటికే తీరొక్క రంగుల్లో, వివిధ డిజైన్లలో తయారు చేసిన చీరెలను జిల్లా కేంద్రాలకు తరలిస్తున్నారు. జిల్లాలో 2,97,662 మంది అర్హులున్నట్లు గుర్తించిన అధికారులు వీరందరికీ చీరెలు అందించనున్నారు. ఇప్పటికే 90వేల చీరెలు జిల్లాకేంద్రానికి చేరగా కలెక్టరేట్ సమీపంలోని గిరిజన భవన్లో భద్రపరిచారు. మరోనాలుగైదు రోజుల్లో మిగిలినవి రాగానే,ఈ నెలాఖరు నుంచి పంపిణీ చేయనున్నారు.
మహబూబాబాద్, సెప్టెంబర్12 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ రాష్ట్ర సర్కారు ఏటా బతుకమ్మ పండుగ సందర్భంగా ఆడబిడ్డలకు చీరెలు అందిస్తూ సముచితంగా గౌరవిస్తున్నది. ఈ ఏడాది కూడా ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్న ప్రభుత్వం బతుకమ్మ చీరెల పంపిణీకి అన్ని ఏర్పాట్లు చేస్తున్నది. ఆహార భద్రత కార్డు కలిగి ఉండి, 18 ఏళ్లు నిండిన ప్రతి ఆడబిడ్డకు బతుకమ్మ చీరెను అందజేయనున్నది. జిల్లాలో 2,97,662 మంది అర్హులుండగా, వీరందరికీ త్వరలోనే చీరెలను పంపిణీ చేయనున్నారు. కాగా, జిల్లాకు ఇప్పటికే 90వేల చీరెలు చేరగా, కలెక్టరేట్ సమీపంలో గిరిజన భవనంలో భద్రపరిచారు.
స్వరాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రంజాన్, క్రిస్మస్, బతుకమ్మ పండుగలను రాష్ట్ర సర్కారు ఘనంగా నిర్వహిస్తున్నది. రంజాన్ పండుగకు నిరుపేద ముస్లిం కుటుంబాలకు కానుకలు, క్రిస్మస్ పండుగకు క్రిస్టియన్లకు గిఫ్ట్ ప్యాక్ అందిస్తున్నది. అదేవిధంగా బతుకమ్మ పండుగ సందర్భంగా సర్కారు సారెగా ఆడబిడ్డలందరికీ చీరెలను పంపిణీ చేస్తున్నది. చీరెలన్నీ జిల్లా కేంద్రానికి చేరిన తర్వాత మండలాలకు పంపించనున్నారు.
అక్కడి నుంచి గ్రామాల వారీగా చీరెలను పంపించనున్నారు. ఇందుకోసం గ్రామాల వారిగా పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేసేలా అధికారులు ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఈ ఏడాది బతుకమ్మ చీరెలను ఎక్కువ డిజైన్లతోపాటు అనేక రంగుల్లో రూపొందిస్తున్నారు. ఇప్పటికే అధికారులు జిల్లాలో అర్హులైన ఆడబిడ్డల జాబితాను రూపొందించి జిల్లా గ్రామీణాభివృద్ధి కార్యాలయానికి పంపించారు. దాని ఆధారంగా మండలాలు, గ్రామాల వారీగా చీరెలను పంపిణీ చేయనున్నారు. గతేడాది 2,95,328 మంది మహిళలకు చీరెలను పంపిణీ చేయగా, ఈ ఏడాది 2,97,667మందిని అర్హులుగా గుర్తించారు. గతేడాది కంటే ఈ ఏడాది 2,339మందికి అదనంగా చీరెలు అందించనున్నారు. బతుకమ్మ చీరెలు జిల్లాకు చేరు తుండడంతో ఆడబిడ్డలు సంబురపడుతున్నారు.
జిల్లాలో 16 మండలాలుండగా, వీటి పరిధిలో మొ త్తం 2,97,667మందిని అర్హులుగా గుర్తించారు. బయ్యారం మండలంలో 17,667మంది, చిన్నగూడూరు మండలంలో 6,064మంది, దంతాలపల్లిలో 12,349, డోర్నకల్‌లో 20,125, గంగారంలో 4,242, గార్లలో 13,820, గూడూరులో 21,985, కేసముద్రంలో 27,801, కొత్తగూడలో 10,730, కురవిలో 25,682, మహబూబాబాద్‌లో 39,914, మరిపెడలో 26,193, నర్సింహులపేటలో 11,156, నెల్లికుదురులో 21,143, పెద్దవంగరలో 11,358, తొర్రూరులో 27,438 మంది మొత్తం 2,97,667 మందికి బతుకమ్మ చీరెలు పంపిణీ చేయనున్నారు. ఇప్పటికే జిల్లాకు 90వేల చీరెలు చేరుకోగా, మిగిలినవి త్వరలోనే రానున్నాయి.
జిల్లాలో 2,97,667మంది మహిళలను అర్హులుగా గుర్తించారు. ఇప్పటి వరకు 90వేల చీరెలు జిల్లాకు చేరగా, గిరిజన భవనంలో భద్రపరిచాం. నాలుగైదు రోజుల్లో మొత్తం చీరెలు వచ్చిన తర్వాత మండలాల వారీగా పంపిణీ చేస్తాం. మండల కేంద్రాల నుంచి గ్రామాల్లోని పంపిణీ కేంద్రాలకు చేరవేస్తాం. ఈ నెల చివరి నాటికి పంపిణీ చేసే విధంగా ఏర్పాట్లు చేస్తున్నాం. ముందుగా చీరెలను జిల్లా కేంద్రం నుంచి తహసీల్దార్లకు అప్పగిస్తాం. అక్కడి నుంచి తహసీల్దార్లు పంపిణీ కేంద్రాలకు పంపిస్తారు. అనంతరం లబ్ధిదారులు పంపిణీ కేంద్రాలకు వెళ్లి చీరెలు తీసుకోవాలి.
– గ్రామీణాభివృద్ధి శాఖ జిల్లా అధికారి, సన్యాసయ్య