చిన్నగూడూరు, సెప్టెంబర్ 12: రెండు నుంచి 19 ఏళ్లలోపు పిల్లలకు తప్పనిసరిగా నులిపురుగుల నివారణ మాత్రలు అందించాలని ఎంపీపీ వల్లూరి పద్మావెంకటరెడ్డి అన్నారు. సోమవారం పీహెచ్సీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎంపీడీవో కార్యాలయంలో ఆల్బెండాజోల్ మాత్రల వినియోగంపై ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, అంగన్వాడీ, పంచాయతీ సిబ్బందికి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ.. ఈనెల 15 నుంచి 22వ తేదీ వరకు 19 ఏళ్లలోపు పిల్లలందరికీ ఆల్బెండాజోల్ మాత్రలు అందించేందుకు వైద్యశాఖ అధ్వర్యంలో ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. గ్రామాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు విస్తృత ప్రచారం చేయాలన్నారు. కార్యక్రమంలో వైద్యాధికారి కరుణాకర్, ప్రజాప్రతినిధులు అంగన్వాడీ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
కురవి: జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం(ఎన్డీడీ) కార్యక్రమంపై మండల కేంద్రంలోని రైతువేదికలో సోమవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వైద్యులు గోపి, ప్రసాద్ మాట్లాడుతూ.. నులిపురుగు రహిత రాష్ట్రంగా మార్చడమే లక్ష్యంగా ప్రభుత్వం అమలు చేస్తున్న ఎన్డీడీ ప్రోగ్రాంను విజయవంతం చేయాలన్నారు. అంగన్వాడీ సెంటర్లు, పాఠశాలలు, కళాశాలల్లో ఈనెల 15న ఆల్బెండాజోల్ మాత్రలను 2 నుం చి 19 సంవత్సరాలలోపు పిల్లలకు అందిస్తారన్నారు. 15, 16 తేదీల్లో మాత్రలు వేసుకోని వారు 22న తీసుకోవాలని సూచించారు. వ్యక్తిగత పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. అనంతరం హెల్తీ పంచాయతీపై ఎంపీడీవో సరస్వతి ఆరోగ్య సిబ్బంది, ఐకేపీ, పంచాయతీ కార్యదర్శులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. కేంద్రం అందిం చే ఉత్తమ పంచాయతీ డాటాను ఎలా ఎంట్రీ చేయాలో వివరించారు. కార్యక్రమాల్లో హెచ్ఈవో సత్యనారాయణ, గౌసొద్దీన్, సూపర్వైజర్ కృష్ణకుమార్, ఎంఈవో పద్మ, పంచాయతీ సెక్రటరీలు, ఏఎన్ఎంలు పాల్గొన్నారు.