ఏటూరునాగారం, సెప్టెంబర్ 12 : త్వరలో నిర్వహించనున్న గిరిజన క్రీడోత్సవాల్లో సత్తాచాటే విధంగా క్రీడాకారులను తీర్చిదిద్దాలని ఐటీడీఏ పీవో అంకిత్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన ఐటీడీఏ కార్యాలయంలో రాష్ట్రస్థాయి గిరిజన క్రీడోత్సవాలపై ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని పిజికల్ డైరెక్టర్లు, పీఈటీలతో ప్రత్యేక సమావేశం నిర్వహించి, క్రీడల నిర్వహణ తేదీలను ఖరారు చేశారు.
ఈ సందర్భంగా పీవో మాట్లాడుతూ.. పెద్దఎత్తున నిర్వహించే క్రీడల్లో ప్రతిభ కలిగిన క్రీడాకారులను ప్రోత్సహించాలన్నారు. వరంగల్ జిల్లాలో 1700మంది క్రీడాకారులను ఎంపిక చేసి, ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని పీడీ, పీఈటీలకు సూచించారు. ఈ నెల 13,14వ తేదీల్లో డివిజన్‌స్థాయి క్రీడలను చిన్నబోయినపల్లి, మేడారం, పేరూరులో నిర్వహించాలన్నారు. కబడ్డీ, వాలీబాల్, ఖోఖో టెన్నికాయిట్, చెస్, క్యారమ్స్, అథ్లెటిక్ పోటీల్లో 6 నుంచి 8వ తరగతి వరకు విద్యార్థులు అండర్ -14 విభాగంలో, 9,10 తరగతి విద్యార్థులు అండర్ -17 విభాగంలో పాల్గొంటారని వెల్లడించారు.
క్రీడల నిర్వహణపై అవసరమైన సలహా లు, సూచనలు తీసుకున్నారు. 21 నుంచి 23వ తేదీ వరకు జోనల్ స్థాయి పోటీలను ఏటూరునాగారంలోని కుమ్రం భీం స్టేడియంలో,అదేవిధంగా వచ్చే నెల 18 నుంచి 20వ తేదీ వరకు రాష్ట్రస్థాయి క్రీడలు కూడా ఇక్కడే నిర్వహిస్తామన్నారు. ఇందులో 33 జిల్లాల క్రీడాకారులు పాల్గొంటారని, అవసరమైన ఏర్పాట్లు అధికారులను ఆదేశించారు. రాష్ట్రస్థాయిలో ఏటూరునాగారం క్రీడాకారులు ఎక్కువ పతకాలు సాధించే విధంగా పీడీలు, పీఈటీలు కృషి చేయాలని కోరారు. సమావేశంలో డీడీ పోచం, ఏటీడీవో దేశీరాం నాయక్, స్పోర్ట్స్ అధికారులు శ్యామలత, వజ్జ నారాయణ, కిష్టు, మోహన్, ఆదినారాయణ పాల్గొన్నారు.