ఏటూరునాగారం, సెప్టెంబర్ 12 : మేడిగడ్డ నుంచి భధ్రాచలం వరకు ముంపు ప్రాంతాలను రక్షించడంలో భాగంగా గోదావరికి కరకట్టను నిర్మించేందుకు రూ.450కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేయడం జరిగిందని జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్వర్ తెలిపారు. మండలంలోని రామన్నగూడెం పుష్కరఘాట్‌కు సమీపంలోని గోదావరి కరకట్ట వద్ద చేపడుతున్న మరమ్మతు పనులను సోమవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మరమ్మతు పనులు నాణ్యతతో చేపట్టాలని అధికారులను ఆదేశించారు. స్థానిక ప్రజాప్రతినిధులు పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు. సీఎంవో ఆదేశాల మేరకే కరకట్ట పనులను పరిశీలించేందుకు వచ్చినట్లు పేర్కొన్నారు.
గత జూలైలో వచ్చిన వరదలను దృష్టిలో పెట్టుకుని మేడిగడ్డ నుంచి భద్రాచలం వరకు గోదావరి తీరం వెంట ఉన్న ముంపు ప్రాంతాల్లో గోదావరి కరకట్ట నిర్మాణం కోసం సర్వే చేయించినట్లు తెలిపారు. సమస్య శాశ్వత పరిష్కారం కోసం రూ.450 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేశామని, త్వరలోనే టెండర్ల ప్రక్రియ పూర్తయి పనులు ప్రారంభించనున్నట్లు చెప్పారు. గోదావరి వరద పెరుగుతున్నందున ప్రమాదం ఏర్పడకుండా పటిష్టంగా మరమ్మతు పనులు చేపట్టాలని నీటిపారుదలశాఖ డీఈఈ ప్రవీణ్‌ను ఆదేశించారు. సమస్య పునరావృతం కాకుం డా చూడాలన్నారు. ఆయన వెంట జడ్పీ కోఆప్షన్ సభ్యురాలు వలియాబీ, నాయకులు గడదాసు సునీల్‌కుమార్, అల్లి శ్రీనివాస్, కోటయ్య, దన్నపునేని కిరణ్, గద్దల జయకృష్ణ, దన్నపునేని కిరణ్, సర్పంచ్ దొడ్డ కృష్ణ, ఉన్నారు.