సుబేదారి, సెప్టెంబర్ 12 : తాళం వేసిన ఇండ్లు, దేవాలయాల్లో చోరీలు చేస్తున్న దొంగను గీసుగొండ పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలను హనుమకొండలోని పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో సోమవారం సీపీ డాక్టర్ తరుణ్‌జోషి వెల్లడించారు. సీపీ కథనం ప్రకారం వరంగల్ కాశీబుగ్గ ఎస్ఆర్ నగర్‌కు చెందిన మహ్మద్ యాకూబ్ పాషా, ఈరెల్లి రఘుతో కలిసి జల్సాలకు అలవాటుపడి చోరీలు చేస్తున్నారు. ద్విచక్ర వాహనానికి డాక్టర్, ప్రెస్ అని స్టిక్కర్ పెట్టుకొని, నంబర్ ప్లేట్లు మార్చుతూ రాత్రి వేళల్లో తాళం వేసిన ఇండ్లు, దేవాలయాల్లో చోరీలకు పాల్పడ్డారు.
వరంగల్ పోలీసు కమిషనరేట్ పరిధిలో ఇంతేజార్గంజ్, గీసుగొండ, సుబేదారి, కేయూసీ పోలీసు స్టేషన్ల పరిధిలో మొత్తం 12 చోరీలు చేశారు. ఈస్ట్ జోన్ డీసీపీ వెంకటలక్ష్మి నేతృత్వంలో పోలీసులు, నిందితుల కదలికపై నిఘా పెట్టారు. గీసుగొండ సీఐ వెంకటేశ్వర్లు, సిబ్బందితో వాహనాలు తనిఖీ చేస్తుండగా బైక్‌పై వచ్చిన యాకూబ్‌పాషా పట్టుబడ్డాడు. నిందితుడిని విచారించగా చోరీలకు పాల్పడినట్లు అంగీకరించాడు. అతడి ఇంట్లో తనిఖీలో చేసి రూ. 6 లక్షల విలువైన వంద గ్రాముల బంగారు అభరణాలు, కారు, బైక్, ల్యాప్‌టాప్, పదిహేను వేల నగదు, ఎల్ఈడీ టీవీ, మూడు సెల్ఫోన్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరో నిందితుడు రఘు పరారీలో ఉన్నాడు. నిందితుడిని పట్టుకున్న మామునూరు ఏసీపీ నరేశ్‌కుమార్, గీసుగొండ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు, సీసీఎస్ ఇన్స్పెక్టర్ రమేశ్‌కుమార్, గీసుగొండ ఎస్సై వెంకన్న, సిబ్బందిని సీపీ అభినందించారు.