హనుమకొండ, సెప్టెంబర్ 10: ఇప్పటివరకు హైదరాబాద్‌లాంటి పెద్ద నగరాలకే పరిమితమైన చెన్నయ్ షాపింగ్ మాల్ ఇప్పుడు వరంగల్ త్రినగరి వాసులకు అందుబాటులోకి వచ్చింది. హనుమకొండ నక్కలగుట్టలో ఏర్పాటు చేసిన చెన్నయ్ షాపింగ్ మాల్‌ను శనివారం రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌కుమార్, ప్రభుత్వ చీఫ్‌విప్ దాస్యం వినయ్‌భాస్కర్ శనివారం జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. వైభవోపేతంగా ప్రారంభమైన ఈ షాపింగ్ మాల్లో సినీ నటి కృతిశెట్టి సందడి చేసింది. నెల రోజులుగా షాపింగ్ మాల్ ప్రారంభం గురించి నిర్వాహకులు పెద్ద ఎత్తున ప్రచారం చేపట్టడంతోపాటు కృతిశెట్టి వస్తున్నదని తెలిసి త్రినగరి వాసులు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో తరలి రావడంతో ఆ ప్రాంతమంతా కిక్కిరిసిపోయింది. ప్రారంభ కార్యక్రమం సందర్భంగా షాపింగ్ మాల్ నిర్వాహకులు హెలీకాప్టర్‌తో పూలవర్షం కురిపించారు.
కృతిశెట్టిని చూసేందుకు జనం ఎగబడ్డారు. నాలుగు అంతస్తుల్లో షాపింగ్ మాల్ ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. మహిళలకు, పురుషులకు, బాలబాలికలకు వేర్వేరు విభాగాల్లో ఆధునిక వస్ర్తాలను అందుబాటులో ఉంచామని చెప్పారు. హాల్‌మార్క్ కలిగిన జ్యూవెలరీ, డైమండ్, వెండి ఆభరణాలను సామాన్యులకు సైతం అందుబాటు ధరల్లో ఉండే ఏర్పాట్లు చేశామన్నారు. షాపింగ్‌మాల్‌లో సుమారు 1200 మందికి పైగా ప్రత్యక్ష ఉపాధి కల్పిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమానికి పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రారంభోత్సవం అనంతరం కృతిశెట్టి ‘కమాన్ బేబీ’ అనే పాటకు డ్యాన్స్ చేసి ఫ్యాన్స్‌ను అలరించింది. తనకు వరంగల్ నగరం అంటే ఎంతో ఇష్టమని, ఇక్కడికి రావడం రెండోసారి అని చెప్పింది. తాను సినిమాల్లో సైతం చెన్నయ్ షాపింగ్ మాల్ వస్ర్తాలనే ఉపయోగిస్తానని వెల్లడించింది. ఈ కార్యక్రమంలో మేయర్ గుండు సుధారాణి, కుడా చైర్మన్ సుందర్రాజు యాదవ్, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు, కార్పొరేటర్లు పాల్గొన్నారు.