హనుమకొండ, సెప్టెంబర్ 9 : సింగరేణిని సీఎం కేసీఆర్ లాభాల బాట పట్టిస్తే బీజేపీ సర్కారు దానిని ప్రైవేట్ పరం చేయాలని చూస్తోందని టీఆర్ఎస్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం సాయంత్రం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో జరిగిన టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుల సమావేశంలో ఉమ్మడి జిల్లా నుంచి దాస్యం వినయ్‌భాస్కర్, అరూరి రమేశ్, మాలోత్ కవిత, గండ్ర జ్యోతి, పాగాల సంపత్‌రెడ్డి పాల్గొన్నారు.
ఈ సమావేశంలో గండ్ర జ్యోతి మాట్లాడుతూ సింగరేణి లాంటి సంస్థలు బలోపేతం కావాలంటే కేసీఆర్ నాయకత్వం దేశానికి అవసరముందన్నారు. కేసీఆర్‌లాంటి అన్ని సుగుణాలు ఉన్న నేత జాతీయ రాజకీయాల్లోకి వస్తేనే దేశం బాగుపడుతుందన్నారు. సింగరేణి బంగారు సిరులు జాతి సిగలో మెరవాలంటే సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాలని స్పష్టం చేశారు. దేశంలోని సహజ సంపదను జాతి ప్రయోజనం కోసం వినియోగించే సత్తా కేసీఆర్‌కే ఉందని చెప్పారు. సింగరేణి, కోల్ ఇండియా సంస్థలను సీఎం కేసీఆర్ మాత్రమే రక్షించగలరని కుండబద్దలు కొట్టారు.