తొమ్మిది రోజుల పాటు విశేష పూజలందుకున్న గణనాయకుడికి జిల్లావాసులు శుక్రవారం ఘనంగా వీడ్కోలు పలికారు. ప్రత్యేకంగా అలంకరించిన వాహనాల్లో వినాయక విగ్రహాలను ఉంచి కనుల పండువలా శోభాయాత్రలు తీశారు. దారి పొడువునా డప్పు చప్పుళ్లు, నృత్యాలు, విన్యాసాలతో చిన్నాపెద్దా కేరింతలు కొట్టారు. వేడుకలకు మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు వర్షం కొంత ఆటంకం కలిగించినా రాత్రి 8 గంటల తర్వాత నిరాటంకంగా గణేశుడి ప్రతిమలను నిమజ్జనానికి తరలించారు. ‘జై బోలో గణేశ్ మహరాజ్‌కీ.. గణపతి బొప్పా మోరియా..’ అంటూ నినదిస్తూ గంగమ్మ ఒడికి సాగనంపారు.
నవరాత్రోత్సవాల్లో భాగంగా ధూపదీప నైవేద్యాలతో విశేష పూజలందుకున్న గణనాథులను జిల్లావాసులు శుక్రవారం ఘనంగా నిమజ్జనం చేశారు. కోలాటాలు, డప్పు చప్పుళ్లతో నృత్యాలు, భజనలతో శోభాయాత్రలను ఉత్సాహంగా నిర్వహించారు. మధ్యాహ్నం నుంచి వర్షం ఎడతెరిపి లేకుండా పడడంతో వేడుకలకు ఆటంకం కలిగింది.
హనుమకొండలోని సిద్ధేశ్వర గుండం, బంధం చెరువు, వరంగల్‌లోని ఉర్సు, చిన్న వడ్డేపల్లి, కోట చెరువు, భూపాలపల్లిలోని కాళేశ్వరం, గణపసముద్రం, ములుగులోని మినీ ట్యాంక్ బండ్, ఏటూరునాగరంలో గోదావరి నది, మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని నిజాం చెరువు, తొర్రూరు, మరిపెడ, కేసముద్రం, కురవి మండల కేంద్రాల్లో, జనగామలోని నెల్లుట్ల చెరువు, పలు మండలాల్లోని జల వనరుల్లో నిమజ్జన వేడుకలు వైభవంగా జరిగాయి. గణనాథులకు ఉత్సవ సమితి నిర్వాహకులు ప్రత్యేక పూజలు చేశారు.
వాడవాడలా ప్రతిష్ఠించిన ప్రతిమలను అందంగా అలంకరించిన వాహనాల్లో నిమజ్జనానికి తరలించారు. పలుచోట్ల మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, చీఫ్‌విప్ దాస్యం వినయ్ భాస్కర్, మేయర్ గుండు సుధారాణి, కమిషనర్ ప్రావీణ్య, ఎమ్మెల్యే అరూరి రమేశ్ తదితరులు వినాయక నిమజ్జన వేడుకల్లో పాల్గొన్నారు.
– నమస్తే తెలంగాణ నెట్వర్క్, సెప్టెంబర్ 9