సుబేదారి, సెప్టెంబర్ 9 : ప్రజాకవి కాళోజీ నారాయణరావు ఆశయాలకనుగుణంగా రాష్ట్రంలో సీఎం కేసీఆర్ పాలన కొనసాగుతున్నదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. కాళోజీ జయంతి సందర్భంగా శుక్రవారం కేంద్ర సాహిత్య అవార్డు గ్రహీత అంపశయ్య నవీన్, ఎంపీ పసునూరి దయాకర్, మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్సీ బండా ప్రకాశ్, ఎమ్మెల్యే ఒడితల సతీశ్‌కుమార్, డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్రావు, కుడా చైర్మన్ సుందర్రాజ్, వరంగల్, హనుమకొండ జిల్లాల కలెక్టర్లు, ఉద్యోగ సంఘాల నాయకులు, కవులు, రచయితలతో కలిసి ఆయన హనుమకొండ అదాలత్ జంక్షన్‌లోని కాళోజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ.. ప్రజాకవి కాళోజీ నారాయణరావు కాళోజీగా, కాళన్నగా తెలంగాణ ప్రజలకు సుపరిచితులని, నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా పోరాడిన మహనీయుడు, తెలంగాణ వైతాళికుడని కొనియాడారు. 25 ఏళ్ల వయసులోనే సత్యాగ్రహోద్యమంలో పాల్గొని జైలుకు వెళ్లాడని, విద్యార్థి దశలోనే నిజాం ప్రభుత్వ నిషేధాజ్ఞలను ఎదిరించి వరంగల్‌లో గణేశ్ ఉత్సవాలు నిర్వహించినట్లు తెలిపారు. నిజాం ప్రభుత్వ ఆగడాలపై కాళోజీ ప్రదర్శించిన ధైర్య సాహసాలు మరువలేనివని, జీవితమంతా తెలంగాణ కోసమే అంకితం చేశారని అన్నారు.
కాళోజీ జయంతిని కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణ భాషా దినోత్సవంగా నిర్వహిస్తూ గౌరవిస్తున్నదన్నారు. కాళోజీ, జయశంకర్ సార్ వరంగల్ బిడ్డలు కావడం ఇక్కడి ప్రజల అదృష్టమన్నారు. కాళోజీ పేరుతో తెలంగాణ ప్రభుత్వం వరంగల్‌లో కాళోజీ కళాక్షేత్రం, హెల్త్ యూనివర్సిటీ ఏర్పాటు చేసిందని గుర్తుచేశారు. ఆ మహనీయుడి స్ఫూర్తితోనే తాను రాజకీయంగా ఎదిగినట్లు తెలిపారు.
కాళోజీ నారాయణరావు తెలంగాణ మాండలికానికి నిలువెత్తు నిదర్శనమని ప్రభుత్వ చీఫ్‌విప్ దాస్యం వినయ్‌భాస్కర్ అన్నారు. హనుమకొండ అదాలత్ జంక్షన్లో కాళోజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజా కవి కాళోజీ ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలు, అవమానాలపై తన అక్షరాలు, గొంతుకతో పాలకులను ప్రశ్నించి తెలంగాణ ఉద్యమానికి బీజం వేశారని అన్నారు.
ఆ మహనీయుడి స్ఫూర్తితోనే సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ర్టాన్ని సాధించినట్లు తెలిపారు. కేసీఆర్‌కు కాళోజీ నారాయణరావుపై ఎనలేని గౌరవం ఉందని, అందుకే ఆయన పుట్టిన రోజును తెలంగాణ భాషా దినోత్సవంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కాళోజీ ఆశయాలను భావితరాలకు అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర సర్కారు కాళోజీ కళాక్షేత్రాన్ని నిర్మిస్తున్నదన్నారు. ఈ కార్యక్రమంలో పీర్టీయూ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీపాల్‌రెడ్డి పాల్గొన్నారు.