నమస్తే నెట్వర్క్: నవరాత్రులు విశేష పూజలు అందుకున్న విఘ్నేశ్వరుడిని శుక్రవారం గంగమ్మ ఒడికి చేర్చారు. ఈ సందర్భంగా మేళతాళాలు, నృత్యాల నడుమ ఆదిదేవుడిని ఘనంగా సాగనంపారు. బైబై గణేశా.. మళ్లీ రా.. విఘ్నేశా.. అంటూ భక్తులు విగ్రహాలను నిమజ్జనం చేశారు. ఇందులో నర్సంపేట పట్టణం సర్వాపురం శివారు దామెర చెరువులో వినాయక నిమజ్జనోత్సవాన్ని కలెక్టర్ గోపి, జిల్లా అదనపు కలెక్టర్లు శ్రీవత్సవ, హరిసింగ్, జడ్పీ వైస్ చైర్మన్ ఆకుల శ్రీనివాస్, ఆర్డీవో పవన్‌కుమార్, ఏసీపీ సంపత్‌రావుతో కలిసి ప్రారంభించారు. నర్సంపేట పట్టణంలో అంగరంగా వైభవంగా శోభాయమానంగా వినాయక విగ్రహాల ఊరేగింపు జరిగింది. అనంతరం నిమజ్జనం చేశారు.
నర్సంపేట ఏసీపీ సంపత్‌కుమార్, సీఐలు పులి రమేశ్‌గౌడ్, సూర్యప్రసాద్, ఎస్సై రవీందర్ బందోబస్తు నిర్వహించారు. సంగెం మండలంలో జైబోలో గణేశ్ మహరాజ్‌కి జై.. బొజ్జ గణపయ్యకు జై.. బైబై గణేశా.. వంటి నినాదాలతో యువతీ యువకులు డ్యాన్స్‌లతో సందడి చేశారు. మొండ్రాయి, ముమ్మిడివరం, ఎల్గూర్‌రంగంపేట, నార్లవాయి, నల్లబెల్లి, పల్లార్గూడ, గొల్లపల్లి నుంచి తీసుకొచ్చిన వినాయక విగ్రహాలను ఎల్గూర్ చెరువులో నిమజ్జనం చేశారు. చెన్నారావుపేటలోని సిద్ధార్థ హైస్కూల్ విద్యార్థులు కోలాటాల నడుమ గణపయ్యను సాగనంపారు. చైర్మన్ కంది గోపాల్‌రెడ్డి, ప్రిన్సిపాల్ కరుణాకర్‌రెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. దుగ్గొండి మండలంలో వినాయక నిమజ్జనోత్సవం వైభవంగా జరిగింది. ఎస్సై నవీన్‌కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. శివాజీనగర్‌లో వినాయకుడికి జర్మనీ దేశస్తులు పూజలు చేశారు. వర్ధన్నపేట పట్టణంలో నిమజ్జనం పూర్తి చేశారు. భజనలు, నృత్యాలు చేస్తూ యువకులు, నిర్వాహకులు స్వామివారు ఎదటు శోభాయాత్ర నిర్వహించారు. వర్ధన్నపేట పట్టణంలోని కోనారెడ్డి చెరువులో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో చేపట్టిన నిమజ్జన కార్యక్రమంలో ఎమ్మెల్యే అరూరి రమేశ్ పాల్గొని గణనాథుల విగ్రహాలను చెరువులో నిమజ్జనం చేశారు.
సీఐ సదన్‌కుమార్, ఎస్సై రామారావు పర్యవేక్షించారు. నర్సంపేట-కొత్తగూడ ప్రధాన రహదారిలోని దామెర చెరువులో భక్తులు విగ్రహాలను నిమజ్జనం చేశారు. మున్సిపల్ సిబ్బంది బారికేడ్లు, తెప్ప, సీసీ కెమెరాలు, లైటింగ్స్ ఏర్పాటు చేశారు. సాయంత్రం కొంత మందకొడిగా సాగినా రాత్రి తర్వాత విగ్రహాల తాకిడి పెరిగింది. మాదన్నపేట పెద్ద చెరువులో కూడా వినాయక విగ్రహాలను నిమజ్జనం చేశారు. సర్వాపురం శివారు దామెర చెరువు, మాదన్నపేట పెద్ద చెరువు నిమజ్జన కార్యక్రమాన్ని ఆర్డీవో పవన్‌కుమార్, ఏసీపీ సంపత్‌రావు, సీఐలు పులి రమేశ్‌గౌడ్, సూర్యప్రసాద్, హథీరాం, మున్సిపల్ చైర్పర్సన్ గుంటి రజినీకిషన్, తహసీల్దార్ వాసం రామ్మూర్తి, మున్సిపల్ కమిషనర్ వెంకటస్వామి, ఎస్సైలు బొజ్జ రవీందర్, తిరుపతి, రాజారాం, కౌన్సిలర్లు పర్యవేక్షించారు. గీసుగొండ మండలంతోపాటు గ్రేటర్ వరంగల్‌లోని 15, 16వ డివిజన్లో భక్తులు వినాయక విగ్రహాలను ట్రాక్టర్లు, ఆటోల్లో తరలించి చెరువుల్లో నిమజ్జనం చేశారు. గీసుగొండ సీఐ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆర్డీవో మహేందర్‌జీ పరిశీలించారు. కట్టమల్లన్న చెరువు వద్ద మామునూరు ఏసీపీ నరేశ్‌కుమార్, తహసీల్దార్ విశ్వనారాయణ, ఎంపీడీవో రమేశ్, కార్పొరేటర్ సుంకరి మనీషా శివకుమార్ పాల్గొన్నారు.
వాడవాడలా విశేష పూజలందుకున్న గణపయ్యలు ఉర్సు రంగసముద్రం చెరువు, బెస్తం చెరువులో నిమజ్జనమయ్యాయి. శుక్రవారం భక్తులు ఆనందోత్సాహాల మధ్య తరలివచ్చి ఉర్సు చెరువులో విగ్రహాలను నిమజ్జనం చేశారు. ఉర్సు చెరువు వద్ద మిల్స్‌కాలనీ సీఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో సిబ్బంది బందోబస్తు చేపట్టారు. బెస్తం చెరువు వద్ద మామునూరు సీఐ క్రాంతికుమార్ ఆధ్వర్యంలో పర్యవేక్షించారు. కాగా, అండర్‌రైల్వేగేట్ ప్రాంతంలోని పలు గణపతి మండపాల్లో నిర్వాహకులు లడ్డూలకు వేలం వేయగా భక్తులు అధిక ధరలకు కొనుగోలు చేశారు. ఓరుగల్లు కోటలోని విఘ్నేశ్వరుడి నిమజ్జనోత్సవం వైభవంగా కొనసాగింది. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా భక్తులు గణనాథుడిని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వీధుల్లో ఊరిగేంచి మంగళహారతులతో మహాగణపతిని తీసుకెళ్లి మధ్యకోటలోని ఏకశిల చెరువులో నిమజ్జనం చేశారు. పోచమ్మమైదాన్ జంక్షన్లో విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో గణనాథులకు ఘన స్వాగతం పలికారు.
వరంగల్ బ్యాంక్‌కాలనీ-2 శ్రీవరద వేంకటేవ్వరస్వామి కాలనీ ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. లడ్డూను వేలం వేయగా కాలనీకి చెందిన డాక్టర్ కందుల సుధాకర్‌రావు, అరుంధతి దంపతులు రూ. లక్షా 11 వేలకు కొనుగోలు చేశారు. అలాగే, కలశాన్ని రూ. 30.11 వేలకు సింగిరికొండ సురేశ్‌కుమార్, అనురాధ దంపతులు దక్కించుకున్నారు. స్వామి వారి వస్ర్తాలను వేలం వేయగా రూ. 20,999కు కాలనీవాసులు దక్కించుకున్నారు. దేశాయిపేటలోని చిన్నవడ్డేపల్లి చెరువు, డాక్టర్ కాలనీలోని కోటి చెరువులో గణనాథులను నిమజ్జనం చేశారు. మేయర్ గుండు సుధారాణి, కమిషనర్ ప్రావీణ్య, సీపీ తరుణ్‌జోషి, ఆర్డీవో మహేందర్‌జీ, ఏసీపీ కలకోట గిరికుమార్ పర్యవేక్షించారు.
కాశీబుగ్గ వర్తక సంఘం ఆధ్వర్యంలో లడ్డూను వేలం వేయగా రూ. 51,116కు టీఆర్ఎస్ నాయకుడు భూక్యా మోతీలాల్‌నాయక్ కొనుగోలు చేశాడు. వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ పరిధిలోని శ్రీలక్ష్మీగణపతి సహిత అభయాంజనేయస్వామి ఆలయంలో ఏర్పాటు చేసిన విఘ్నేశ్వర విగ్రహాన్ని చిన్నవడ్డెపల్లి చెరువులో చాంబర్ పాలకవర్గ సభ్యులు నిమజ్జనం చేశారు. వరంగల్ 29, 11వ డివిజన్లలో మట్టితో తయారు చేసిన వినాయక విగ్రహాలను ఏర్పాటు చేసిన మండపాల కమిటీలను కల్పలత సూపర్‌బజార్ వైస్ చైర్మన్ ఎండీ షఫి సన్మానించారు. వరంగల్ పాపయ్యపేటలోని విజయ గణపతి నవరాత్రుల ఉత్సవ కమిటీకి విశ్వహిందూ పరిషత్ గణపతి ఉత్సవ సమితి వారు కన్సోలేషన్ బహుమతి ఇచ్చారు. మిత్రబృందం ఆధ్వర్యంలో దాతల సహకారంతో మట్టి వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేసి పూజలు అందించినట్లు కమిటీ ప్రతినిధులు తెలిపారు.