వర్ధన్నపేట, సెప్టెంబర్ 9: తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యుత్ రంగంలో తీసుకొచ్చిన నూతన సంస్కరణలతోనే వ్యవసాయం పురోగతి సాధిస్తున్నదని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే అరూ రి రమేశ్ అన్నారు. వర్ధన్నపేట పట్టణ సమీపంలోని కోనారెడ్డి చెరువు కట్ట వద్ద ఏర్పాటు చేసిన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను శుక్రవారం ఎమ్మెల్యే ప్రారంభించి మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సహకరించకపోయినా, కేంద్రం ఇబ్బందులకు గురిచేసినా సీఎం కేసీఆర్ ముందుచూపుతో రైతులకు 24 గంటల మెరుగైన విద్యుత్ అందిస్తున్నారని తెలిపారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కేవలం 5 గంటలకు మించి సరఫరా జరుగకపోవడంతో తెలంగాణలో పంటలు ఎండిపోయేవని తెలిపారు. వేసవిలో రోజుల తరబడి సరఫరా నిలిచిపోతే వేల ఎకరాల్లో పంటలు ఎండిపోయి రైతులు ఆత్మహత్యలు చేసుకునేవారని గుర్తుచేశారు. కానీ, టీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ అందిస్తుండడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. కూటీర పరిశ్రమలకు కూడా విద్యుత్ సరఫరా మెరుగుపడడంతో అన్ని వర్గాల ప్రజలు ఆర్థికంగా ప్రగతి సాధిస్తున్నారని వివరించారు.
అనంతరం అరూరి దమ్మన్నపేటకు చెందిన రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు జన్నపురెడ్డి విజయేందర్‌రెడ్డి తల్లి సరోజనమ్మ మృతి చెందగా, బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. అలాగే, వర్ధన్నపేట పట్టణ పరిధిలోని 7వ వార్డుకు చెందిన భూమ వెంకటయ్య ఇటీవల మృతి చెందగా, ఆయన కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే ఓదార్చారు. జడ్పీటీసీ మార్గం భిక్షపతి, ఏఎంసీ చైర్మన్ స్వామిరాయుడు, టీఆర్ఎస్ నాయకులు పులి శ్రీనివాస్, పూజారి రఘు, ఎండీ రహీమొద్ద్దీన్, తిరుపతి, సురేశ్, సారంగపాణి పాల్గొన్నారు.