రాయపర్తి, సెప్టెంబర్8: విద్యార్థులు విలువులతో కూడిన విద్యను అభ్యసించడం మూలంగా ఉజ్వల భవిష్యత్‌ను సొంతం చేసుకునే అవకాశం ఉంటుందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్డబ్ల్యూఎస్ శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. గురువారం వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలోని కిష్టాపురం క్రాస్ రోడ్డులోని వీఆర్ గార్డెన్స్‌లో ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ సారథ్యంలో సామాజిక సేవా కార్యకర్త గూడెల్లి శివప్రసాద్ రూపకల్పనలో తయారు చేసిన ‘నైతిక వృత్తి మార్గదర్శకత్వం’ ప్రారంభోత్సవం, మండల స్థాయి గురుపూజోత్సవ కార్యక్రమాలను నిర్వహించారు. ముఖ్య అతిథులుగా ఎర్రబెల్లితోపాటు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ హాజరాయ్యరు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సమాజంలోని తల్లిదండ్రులంతా తమ పిల్లలకు చిన్నతనం నుంచే విలువలతో కూడిన విద్యను నేర్పించేందుకు కృషి చేయాలన్నారు. సమాజాన్ని సంస్కరించే గురుతర బాధ్యత ఉపాధ్యాయులదేనని, తన విద్యార్థులను జాతి గర్వించే బిడ్డలుగా రూపొందించేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేయాల్సిందిగా కోరారు. వేదాల కాలం నుంచి సమాజం తల్లిదండ్రుల తర్వాత అంతటి గొప్ప స్థానాన్ని కేవలం గురువులకు మాత్రమే ఇచ్చిందని, సమాజంలో అత్యంత విలువైనది ఉపాధ్యాయ వృత్తేనని వారు పేర్కొన్నారు.
అందరికీ ఆది గురువు అమ్మేనని, తల్లిదండ్రుల ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిందిగా వారు కోరారు. దేశ భవిష్యత్‌ను నిర్ణయించడంతోపాటు నిర్ధారించే అద్భుత శక్తి కేవలం ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉందని వారు వివరించారు. సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ రాష్ట్ర మంత్రిగా సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన ఎర్రబెల్లి దయాకర్‌రావు అందిస్తున్న సేవలు చిరస్మరణీయమైనవని అన్నారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావులో గొప్ప సామాజిక సేవా కార్యకర్త, సంక్షేమ కాముకుడు దాగి ఉన్నారని పేర్కొన్నారు. విద్యార్థులు కష్టపడి చదువుకుని భవిష్యత్‌లో మండల కీర్తిని ఇనుమడింపజేసేందుకు కృషి చేయాలని కోరారు.
ఘనంగా గురుపూజోత్సవం.. విజేతలకు బహుమతుల ప్రదానం
ఉత్తమ ఉపాధ్యాయులను పూలమాలలు, శాలువాలు, మెమెంటోలతో ఘనంగా సన్మానించారు. అనంతరం స్వాతంత్య్ర భారత వజ్రోత్సవ వేడుకలు, ఫ్రీడం క్రీడా పోటీలు, ఫ్రీడం రన్, ఫ్రీడం ర్యాలీలలో విజేతలుగా నిలిచిన వారికి బహుమతులను అతిథుల సమక్షంలో అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.
ఈ కార్యక్రమాల్లో జిల్లా అదనపు కలెక్టర్ బానోత్ హరిసింగ్, కేయూ విశ్రాంత ప్రొఫెసర్ పోలారం, యశోరాం సాఫ్ట్వేర్ కంపెనీ సీఈవో శ్రీధర్, మోటివేటర్ దిలీప్, ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి, జడ్పీటీసీ రంగు కుమార్, రైతుబంధు సమితి మండల కోఆర్డినేటర్ ఆకుల సురేందర్‌రావు, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మునావత్ నర్సింహానాయక్, తహసీల్దార్ కుసుమ సత్యనారాయణ, ఎంపీడీవో గుగులోత్ కిషన్‌నాయక్, ఎంపీవో తుల రామ్మోహన్, ఏవో గుమ్మడి వీరభద్రం, ఏపీవో దొణికెల కుమార్‌గౌడ్, ఏపీఎం పులుసు అశోక్‌కుమార్, పలు సంస్థలు, సంఘాల ప్రతినిధులు పూస మధు, కల్పన, గారె నర్సయ్య, రెంటాల గోవర్ధన్‌రెడ్డి, కోదాటి దయాకర్‌రావు, అయిత రాంచందర్, నోముల రంగయ్య, గారె కృష్ణమూర్తి, బుర్ర కవిత, పుట్ట సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.