వరంగల్, సెప్టెంబర్ 8 (నమస్తేతెలంగాణ): గణేశ్ నిమజ్జనానికి జిల్లా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశా రు. 9 రోజులపాటు పూజలందుకున్న గణనాథుడు శుక్రవారం గంగమ్మ ఒడికి చేరనున్నాడు. ఈ నేపథ్యం లో వినాయక నిమజ్జనం కోసం అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేశారు. నిమజ్జన ప్రదేశాలకు చేరుకునే రహదారులను మరమ్మతు చేశారు. ప్రతి నిమజ్జన ప్రదే శం వద్ద క్రేన్లను ఏర్పాటు చేశారు.
భారీ పోలీసు బందోబస్తు నిర్వహణకు ప్రణాళిక రూపొందించారు. వినాయక నిమజ్జనం ప్రశాంతంగా జరిగేందుకు జిల్లా కలెక్టర్ బీ గోపి నిమజ్జన ప్రదేశాల వద్ద జిల్లా స్థాయి అధికారులను పర్యవేక్షణ అధికారులుగా నియమించారు. శుక్రవారం జిల్లాలో 19 ప్రదేశాల్లో నిమజ్జనం జరుగనుంది. వీటిలో వరంగల్‌లోని కోట చెరువు, చిన్నవడ్డేపల్లి చెరువు, కట్టమల్లన్న చెరువు, ఖిలావరంగల్‌లోని అగర్త చెరువు, ఉర్సు గుట్ట చెరువు, నాయుడు బంక్ సమీపంలోని బెస్తం చెరువు, మా మునూరులోని పెద్ద చెరువుతో పాటు నర్సంపేటలో దామెర చెరువు, దామెర విలేజ్ పాండ్, దామెర పాండ్, దుగ్గొండి చెరువు, పాకాల చెరువు, చెన్నారావుపేటలోని ఊర చెరువు, గురిజాల పెద్ద చెరువు, నల్లబెల్లిలోని పెద్ద చెరువు, రంగరాయచెరువు (ఎర్రచెరువు), నెక్కొండ చెరువు, చంద్రుగొండకుంట, వర్దన్నపేటలోని కోనారెడ్డి చెరువు ఉన్నాయి.
కోట చెరువు, చిన్నవడ్డేపల్లి చెరువు, కట్టమల్లన్న చెరువు, ఖిలావరంగల్ అగర్త చెరువు, ఉర్సు గుట్ట చెరువు, బెస్తం చెరువు, మామునూరు పెద్ద చెరువు జీడబ్ల్యూఎంసీ పరిధిలోనివి. కొద్ది రోజుల నుంచి జీడబ్ల్యూఎంసీ పరిధిలోని ఏడు నిమజ్జన ప్రదేశాలను వరంగల్ పోలీసు కమిషనర్ తరుణ్‌జోషి, కలెక్టర్ బీ గోపి, జీడబ్ల్యూఎంసీ కమిషనరు ప్రావీణ్యతో పాటు వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు సందర్శించారు. ఇక్కడ నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించి స్థానిక అధికారులు, సిబ్బందికి సూచనలు చేశారు. జీడబ్ల్యూఎంసీ పరిధిలోని వరంగల్, ఖిలావరంగల్ మండలాల నుంచి గణేశ్ విగ్రహాలు ఈ ఏడు నిమజ్జన ప్రదేశాలకు చేరుకుంటాయని అధికారులు భా విస్తున్నారు.
ఈ నేపథ్యంలో కోట చెరువు, చిన్నవడ్డేపల్లి, కట్టమల్లన్న చెరు వు, ఖిలావరంగల్ అగర్త చెరువు, ఉర్సు గుట్ట చెరువు, బెస్తం చెరువు, మామునూరు పెద్ద చెరువు వద్ద గణేశ్ నిమజ్జనానికి భారీ ఏర్పాట్లు చేశారు. వాహనాల్లో తరలివచ్చే వినాయక విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు క్రేన్లను సిద్ధ్దం చేశారు. రాత్రి బాగా పొద్దుపోయేవరకూ నిమజ్జనం కొనసాగనున్నందున నిమజ్జన ప్రదేశాలకు చేరుకునే దారుల పొడవున, నిమజ్జన ప్రదేశంలో విద్యుత్ లైట్లు అమర్చారు. నర్సంపేట, వర్దన్నపేట ము న్సిపాలిటీలు, ఇతర గ్రామ పంచాయతీల పరిధిలోని నిమజ్జన ప్రదేశాలను మున్సిపల్, పంచాయతీ, రెవె న్యూ, పోలీసు, ఇరిగేషన్, ఎన్పీడీసీఎల్, ఆర్అండ్బీ, పంచాయతీరాజ్ తదితర శాఖల అధికారులు సందర్శించారు.
వినాయక నిమజ్జనం సజావుగా జరిగేందు కు సకల సౌలత్లు కల్పించారు. జిల్లాలోని గణేశ్ నిమజ్జన ప్రదేశాల్లో గజ ఈతగాళ్లు కూడా అందుబాటులో ఉండేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. నిమజ్జనం బందోబస్తుపై ఈస్ట్‌జోన్ డీసీపీ వెంకటలక్ష్మి జిల్లాలోని ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు, ఎస్సైలతో సమావేశమై సూచనలు చేశారు. గణనాధుని నిమజ్జనాన్ని పురస్కరించుకుని పోలీసులు వరంగల్ లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. శుక్రవారం మధ్యా హ్నం 2 నుంచి శనివారం ఉదయం 10 గంటల వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని వరంగల్ పోలీసు కమిషనరు తరుణ్‌జోషి ప్రకటించారు.
పర్యవేక్షణ అధికారుల నియామకం..
జిల్లాలో గణేష్ నిమజ్జనం ప్రశాంతంగా జరిగేందుకు కలెక్టర్ బీ గోపి జిల్లా స్థాయి అధికారులను పర్యవేక్షణ అధికారులుగా నియమించారు. ప్రతి నిమజ్జన ప్రదేశానికి ఒకరిని పర్యవేక్షణ అధికారిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. నిమజ్జనం ప్రారంభమైనప్పటి నుంచి ముగిసే వరకు వివిధ ప్రభుత్వ శాఖల అధికారులను సమన్వయ పరుస్తూ ఈ పర్యవేక్షణ అధికారులు విధులు నిర్వహిస్తారు. జిల్లాలో ప్రశాంతంగా జరిగేలా ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నట్లు జిల్లా అదనపు కలెక్టర్ బీ హరిసింగ్ చెప్పారు.