మంచిర్యాల, ఆగస్టు 3, నమస్తే తెలంగాణ : సింగరేణి జూనియర్ అసిస్టెంట్ (ఎక్స్టర్నల్) రాత పరీక్షకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. తెలంగాణలోని ఎనిమిది జిల్లాల్లో 187 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించనున్నారు. ఇందులో మంచిర్యాల జిల్లాలో 28 కేంద్రాలున్నాయి. ఆదివారం ఉదయం 10 నుంచి 12 గంటల వరకు పరీక్ష ఉంటుంది. పరీక్షల నిర్వహణ పర్యవేక్షణకు ప్రతి రీజియన్‌కు ఒక్కో చీఫ్ కో ఆర్డినేటర్‌ను నియమించామని, ప్రతి కేంద్రానికీ పర్యవేక్షకులు ఉంటారని నిర్వాహకులు పేర్కొన్నారు.
177 పోస్టుల కోసం సింగరేణి నోటిఫికేషన్ జారీ చేసింది. దీనికోసం 1.02 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. కాగా, అర్హతలున్న 98,882 మంది అభ్యర్థులు తమ హాల్ టికెట్లను సంబంధిత వెబ్ లింక్‌ను ఓపెన్ చేసి డౌన్ లోడ్ చేసుకున్నారు. అభ్యర్థి అప్లికేషన్ నంబర్ కానీ, రిజిస్టర్డ్ మొబైల్ నంబర్, పు ట్టిన తేదీ వివరాలను ఎంటర్ చేసి వారికి సంబంధించిన హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాలని అధికారులు ఇప్పటికే సూచించారు. 4వ తేదీ ఉదయం 10 నుంచి 12 గంటల పరీక్ష నిర్వహించనున్నారు. పరీక్షలో నెగెటివ్ మార్కింగ్ కూడా ఉంటుందని, అభ్యర్థులు ఈ విషయాన్ని గమనించాలని, హాల్ టికెట్లో ఇచ్చిన సూచనలు తప్పనిసరిగా పాటించాలని పేర్కొన్నారు.
జూనియర్ అసిస్టెంట్ పోస్టుల కోసం భారీ సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. దీంతో తెలంగాణలోని 8 జిల్లాల్లో 187 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు డైరెక్టర్ ఎస్.చంద్రశేఖర్ తెలిపారు. హైదరాబాద్-1, 2, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మంచిర్యాల, ఆదిలాబాద్ జిల్లాల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. పరీక్షల నిర్వహణ పర్యవేక్షణకు ప్రతి రీజియన్‌కు ఒక్కో చీఫ్ కో ఆర్డినేటర్‌ను నియమించామని, ప్రతి కేంద్రానికీ పర్యవేక్షకులు ఉంటారని ఆయన పేర్కొన్నారు.
సీసీసీ నస్పూర్, సెప్టెంబర్ 3 : సింగరేణిలో ఆదివారం నిర్వహించే జూనియర్ అసిస్టెంట్ ఎక్స్టర్నల్ పరీక్షలకు సింగరేణి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇందుకోసం మంచిర్యాల జిల్లాలో 28 కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 8,886 మంది అభ్యర్ధులు పరీక్షలకు హాజరుకానున్నారు. సీసీసీ నస్పూర్‌లోని పరీక్షా కేంద్రాలను శ్రీరాంపూర్ జనరల్ మేనేజర్ సంజీవరెడ్డి శనివారం పరిశీలించారు. ఏర్పాట్లపై ఆయన సెంటర్ల కోఆర్డినేటర్లను అడిగి తెలుసుకున్నారు.
అభ్యర్ధులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించారు. నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రానికి అనుమతించబోమని స్పష్టం చేశారు. అభ్యర్ధులు పరీక్ష అనంతరం ప్రశ్నపత్రం, హాల్ టికెట్లు తీసుకెళ్లేందుకు అనుమతి ఇచ్చారని తెలిపారు. ఇన్విజిలేటర్ సంతకం ఉన్న హాల్ టికెట్లను అభ్యర్ధులు భద్రపరుచుకోవాలని సూచించారు. ఎలాంటి భయాందోళనకు గురికాకుండా అభ్యర్థులు ప్రశాంతంగా పరీక్షలు రాయాలని కోరారు. జీఎం వెంట శ్రీరాంపూర్ ఏరియా డీజీఎం పర్సనల్ గోవిందరాజు, తదితరులున్నారు.