సంక్షేమం, అభివృద్ధిని రెండు కళ్లుగా చేసుకుని ప్రజలకు సుపరిపాలన అందిస్తున్న టీఆర్ఎస్ పార్టీకి మాత్రమే వచ్చే ఎన్నికల్లో ఓటు అడిగే హక్కు ఉందని డోర్నకల్ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్ అన్నారు. శనివారం ఆయన కురవి మండలం తాళ్లసంకీస, సీరోలు గ్రామాల్లో నూతన ఆసరా లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్, ఐడీ కార్డులు అందజేశారు. ఉచితాలు ఎందుకని బీరాలు పలుకుతున్న ప్రధాని మోదీ అపరకుబేరులు అదానీ, అంబానీలకు రూ.లక్షల కోట్ల రుణాలు ఎలా మాఫీ చేశారని రెడ్యా మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో ప్రపంచానికే రోల్ మోడల్‌గా నిలిచిందని, గుజరాత్‌ను మోడల్ రాష్ట్రంగా తీర్చిదిద్దుతానని గద్దెనెక్కిన మోదీ అక్క చేసింది శూన్యమన్నారు. కాగా, సీరోలు మండల ప్రకటన తర్వాత తొలిసారి గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యేకు గ్రామస్తులు అపూర్వ స్వాగతం పలికి ఘనంగా సత్కరించారు.
కురవి, సెప్టెంబర్ 3: సంక్షేమం, అభివృద్ధిని రెండు కళ్లుగా చేసుకొని సుపరిపాలన అందిస్తున్న టీఆర్ఎస్ పార్టీకి మాత్రమే తెలంగాణ రాష్ట్రంలో ఓటు అడిగే హ క్కు ఉందని డోర్నకల్ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్ అన్నారు. పండుగలు, పబ్బాలకు వచ్చి అవాకులు, చెవాకులు పేలే నాయకులను నమ్మొద్దన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంపన్నులకు రూ.12 లక్షల కోట్ల రు ణాలు మాఫీ చేసి, ఆసరా పింఛన్లు, రైతుబంధు, బీమా వంటి పథకాలు ఎందుకని ప్రశ్నించడం హాస్యాస్పదమన్నారు.
శనివారం కురవి మండలంలోని తాళ్లసంకీస, సీరోలు గ్రామాల్లో ఎంపీపీ గుగులోత్ పద్మావతి అధ్యక్షతన నిర్వహించిన సమావేశాల్లో నూతన లబ్ధిదారులకు పింఛన్ మంజూరు పత్రాలు, ఐడీ కార్డులు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆసరా పింఛన్ల పంపిణీతో సీఎం కేసీఆర్ ప్రతి ఇంటికి పెద్దకొడుకులా మారాడన్నారు. దేశంలోని అన్ని రాష్ర్టాలకు దీటు గా తెలంగాణ అభివృద్ధిలో ముందంజలో ఉన్నదన్నారు. ప్రధానమంత్రి మోదీ ఉచితాలు ఎందుకు అని కొత్త పాట పాడుతున్నారని, అపరకుబేరులు అదానీ, అంబా నీ, నీరజ్మోదీలకు రూ.12 లక్షల కోట్ల రుణాలు ఎలా మాఫీ చేశాడని మండిపడ్డారు. ముసలోళ్ల బాధలు బ్రహ్మచారిలకు ఏం తెలుసునని, రూ.2వేల ఆసరాతో వారు మనోధైర్యంతో బతుకుతున్నారని అన్నారు. తన రాజకీయ జీవితంలో పేదల కోసం ఆలోచించే ఏకైక సీఎం కేసీఆర్ ఒక్కరేనని అన్నారు.
ఆయన మరో పదేళ్లపాటు తెలంగాణకు ముఖ్యమంత్రిగా ఉండాలని ప్రజలు కోరుకుంటున్నట్లు తెలిపారు. సేవ చేసేవారికే పట్టం కట్టాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. డోర్నకల్ నియోజకవర్గంలో 9వేలకు పైచిలుకు పింఛన్లు మంజూరయ్యాయని, కురవి మండలంలోనే 2,111 మందికి కొత్త పింఛన్లు రానున్నాయని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వ పాలన ప్రపంచానికే రోల్‌మోడల్ అన్నారు. గుజరాత్‌ను మోడల్ రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని గద్దెనెక్కిన మోదీ తన పాలనలో చేసింది శూన్యమన్నారు. అక్కడ పింఛన్ కేవలం రూ.600 మాత్రమే ఇస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఇస్తున్న కొత పింఛన్లు ఎప్పుడోరావాల్సి ఉండగా, కరోనా మహమ్మారి వల్ల ఆలస్యమైందన్నారు.
మాట ఇస్తే తప్పని కేసీఆర్ వంటి నాయకుడు మరోసారి ఎన్నికల్లో గెలిస్తేనే సంక్షేమ పథకాలు కొనసాగుతాయన్నారు. లేనిపక్షంలో పథకాలు అన్ని ఆగిపోతాయన్నారు. ఈ కార్యక్రమాల్లో మహబూబాబాద్ మార్కెట్ చైర్మన్ బజ్జూరి ఉమ, మరిపెడ డివిజన్ ఆత్మచైర్మన్ తోట లాలయ్య, జిల్లా నాయకులు బజ్జూరి పిచ్చిరెడ్డి, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు సుధాకర్‌రెడ్డి, సొసైటీ చైర్మన్లు కొండపల్లి శ్రీదేవీ, గోవర్ధన్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, ఆర్బీఎస్ మండల కోఆర్డినేటర్ రమేశ్, వైస్‌ఎంపీపీ నర్సయ్య, మాజీ వైస్‌ఎంపీపీ పెద్దివెంకన్న, రాంచంద్రయ్య, పెద్ది అనిల్‌గౌడ్, ఎంపీటీసీలు దేవేందర్, భోజ్యానాయక్, బాలుచౌహాన్, సర్పంచ్‌లు రంగమ్మ, గంగాధర్‌రెడ్డి, తిరుపతిరెడ్డి, తోట శోభారాణి, రమేశ్, హరేందర్‌రెడ్డి, వడ్డూరి మహేశ్, దుస్స పూలమ్మ, కవిత, సుగుణమ్మ, రాజు, గాడిపల్లి రాములు, మక్కల వెంకన్న, లక్ష్మీశంకర్, వీరన్న, వెంకన్న, తిరుపతి, శ్రీశైలం, దేవేందర్‌రెడ్డి, భిక్షమయ్య పాల్గొన్నారు.
సీరోలును మండలంగా ప్రకటిస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత తొలిసారిగా ఆసరా పింఛన్ల పంపిణీ కోసం గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యే రెడ్యానాయక్‌కు ప్రజలు, ప్రజాప్రతినిధులు అపూర్వ స్వాగతం పలికారు. శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సీరోలు మండల ప్రకటన కోసం పలుమార్లు సీఎం కేసీఆర్ వద్దకు వెళ్లినట్లు తెలిపారు.
తనతోపాటు ఎంపీ కవితకు కూడా చాలా కష్టపడినట్లు చెప్పారు. గత ఎంపీటీసీ ఎన్నికల్లో ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నానన్నారు. ప్రభుత్వం అతిత్వరలో పూర్తి గెజిట్ విడుదల చేస్తుందని, అప్పుడు ప్రజలంతా కలిసి సంబురాలు చేసుకోవాలన్నారు. సీరోలు మండలాన్ని ప్రకటించేందుకు కృషి చేసిన ఎమ్మెల్యే రెడ్యానాయక్‌ను మాజీ ఎమ్మెల్సీ వెడెల్లి వెంకట్‌రెడ్డి శాలువతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. వెంకట్‌రెడ్డి సతీమణి వెంకటమ్మ అనారోగ్యంతో బాధపడుతుండగా ఎమ్మెల్యే పరామర్శించారు.