షైన్ 8వ రాష్ట్ర యూత్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ పోటీల్లో మనోళ్లు సత్తాచాటారు. జేఎన్ఎస్ వేదికగా రెండు రోజులుగా జరుగుతున్న ఈ పోటీలు శనివారం ముగియగా ఓవరాల్ చాంపియన్‌గా ఖమ్మం జిల్లా నిలువగా బాయ్స్‌లో హనుమకొండ, గర్ల్స్ సంయుక్తంగా నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్ అథ్లెట్లు ప్రతిభచాటారు. హార్డిల్స్‌లో హనుమకొండకు చెందిన శివకుమార్, స్టీపుల్‌ఛేజ్, 1500 మీటర్ల పరుగులో జనగామ అథ్లెట్ కీర్తన, 800 మీటర్ల పరుగులో జయశంకర్ భూపాలపల్లికి చెందిన బీ వినోద్‌కుమార్ బంగారు పతాకాలు సాధించారు. అలాగే భోపాల్‌లో ఈ నెల 17న జరిగే నేషనల్ అథ్లెటిక్స్‌కు రాష్ట్రవ్యాప్తంగా 20మంది ఎంపికగా వారిలో డీ రాజు (హనుమకొండ), బీ వినోద్‌కుమార్(జయశంకర్ భూపాలపల్లి)కు చోటు దక్కింది.
హనుమకొండ చౌరస్తా, సెప్టెంబర్ 3: హనుమకొండ జేఎన్ఎస్లో ‘షైన్ 8వ తెలంగాణ రాష్ట్ర యూత్ అథ్లెటిక్స్ పోటీలు’ శనివారం ముగిశాయి. రాష్ట్రంలోని 33 జిల్లాల నుంచి అండర్-18 బాయ్స్ అండ్ గర్ల్స్ సుమారు 450 మంది అథ్లెట్లు పాల్గొన్నారు. పోటీల్లో భాగంగా మొత్తం 42 ఈవెంట్లు నిర్వహించగా రెండోరోజు 15 నిర్వ హిం చారు. సింథటిక్ ట్రాక్‌పై అథ్లెట్లు నువ్వా-నైనా అన్నట్లుగా పోటీపడ్డారు. మెరు పులా దూసుకెళ్తూ గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ మెడల్స్ పతకాలు సాధించారు. ముగింపు కార్యక్రమానికి టాస్క్‌ఫోర్స్ ఏసీపీ జితేందర్‌రెడ్డి, పరకాల సీఐ పుల్యాల కిషన్ ముఖ్యఅతిథులుగా హాజరై క్రీడాకారులకు మెడల్స్ అందజే శారు. కార్యక్రమంలో తెలంగాణ అథ్లెటిక్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు జాన్స్, ప్రధాన కార్యదర్శి సారంగపాణి, వరంగల్ అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎం.కుమార్‌యాదవ్, ఉమ్మడి వరంగల్ జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ కార్యదర్శి రమేశ్‌రెడ్డి, ములుగు జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ కార్యదర్శి పగడాల వెంకటేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు.
జేఎన్ఎస్లో రెండోరోజు పోటీలు హోరాహోరీగా జరిగాయి. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఉత్కంఠగా కొనసాగాయి. ఉదయం 6 గంటలకు గర్ల్స్, బాయ్స్ 1500 మీటర్స్, గర్ల్స్, బాయ్స్ 400 మీటర్స్ హార్డిల్స్, బాయ్స్ లాంగ్‌జంప్(ఫైనల్స్), 800, 200 మీటర్స్ బాయ్స్ అండ్ గర్ల్స్(హీట్స్), బాయ్స్ హ్యామ్మర్త్రో(5.000కేజీ), గర్ల్స్ హ్యామ్మర్త్రో(3.000కేజీ, ఫైనల్స్), లాంగ్‌జంప్ గర్ల్స్(హెప్టా-5), బాయ్స్ జావెలిన్‌త్రో(700జీ, ఫైనల్స్), గర్ల్స్ లాంగ్‌జంప్, బాయ్స్, గర్ల్స్ 2000 మీటర్స్ స్టీపుల్ ఛేజ్(0.838ఎం), గర్ల్స్ జావెలిన్‌త్రో(500 జీ, ఫైనల్స్), గర్ల్స్ జావెలిన్ త్రో(హెప్టా-6), 200 మీటర్స్ బాయ్స్,గర్ల్స్ సెమిఫైనల్, 800 మీటర్స్ గర్స్ హెప్టా-7, లంచ్ విరామం తర్వాత 200 మీటర్స్ గర్ల్స్, బాయ్స్, 800 మీటర్స్ బాయ్స్, గర్ల్స్ ఫైనల్స్ పోటీలు నిర్వహించగా ప్రతిభ చూపి పతకాలు పొందారు.
భోపాల్‌లో ఈ నెల 17 నుంచి జరిగే నేషనల్ యూత్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే 20 మంది అథ్లెట్లను ఎంపిక చేసినట్లు తెలంగాణ అథ్లెటిక్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సారంగపాణి తెలిపారు. వీరిలో ధర్మవీర్ సింగ్(టీఏఏ, 10వేల మీటర్ల రేస్‌వాక్), సుమిత్‌కుమార్(టీఏఏ, 1500 మీటర్స్), అల్లూరి గౌతమ్(ఖమ్మం, 100, 200 మీటర్స్), ఎస్.హర్షవర్ధన్(100 మీటర్స్, హైదరాబాద్), డి.సాయిసంగీత్(200, 400, మహబూబ్‌నగర్), డి.రాజు(హనుమకొండ, స్టీపుల్ ఛేజ్, బి.వినోద్‌కుమార్(800, జయశంకర్ భూపాలపల్లి), రాథోడ్ సెహ్వగ్(400, కామారెడ్డి), కొత్తూరి ప్రణయ్(లాంగ్‌జంప్, ట్రిపుల్ జంప్, మంచిర్యాల), ఏ.ప్రణతి లలిత్య(మెడ్చల్, 100, 100 హార్డిల్స్), కాట్రవత్ శ్రీను(నాగర్ కర్నూల్ 800), ఏ.గణేశ్(నాగర్‌కర్నూల్, 200), దాసరి సత్య(నాగర్‌కర్నూల్, లాంగ్‌జంప్), ఎం.రమేశ్(నల్గొండ, 400), ఎన్.ప్రవళిక(నల్గొండ, 100, 200), ఎల్.నవ్య(నల్గొండ, లాంగజంప్), ఏ.సాయికిరణ్(రంగారెడ్డి, షార్ట్‌పుట్), బానోత్ చంద్రశేఖర ప్రసాద్(యాద్రాద్రి భువనగిరి, 1500, 2000 స్టీపుల్ ఛేజ్), ఎం.మల్లిక(యాద్రాద్రి భువనగిరి, 1500, 3000) ఎంపిక చేసినట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ఎంపికైన క్రీడాకారులను వారు అభినందించి తెలంగాణకు పతకాలు తీసుకురావాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
నేను హార్డిల్స్‌లో గోల్డ్‌మెడల్ సాధించా. నేషనల్స్‌లో పాల్గొని పతకాలు సాధించడమే నా టార్గెట్. అందుకోసం కసరత్తు చేస్తున్నా. ఉదయం, సాయంత్రం బాగా ప్రాక్టీస్ చేస్తున్నా. వరంగల్ ఖ్యాతిని ప్రపంచానికి చాటుతా.
– శివకుమార్, హనుమకొండ
హనుమకొండ జేఎన్ఎస్లో ‘షైన్ 8వ తెలంగాణ రాష్ట్ర యూత్ అథ్లెటిక్స్ పోటీలు’ విజయవంతంగా నిర్వహించాం. 33 జిల్లాల నుంచి 450 మంది అథ్లెట్లు పోటీపడ్డారు. బాయ్స్ అండ్ గర్ల్స్ విభాగాల్లో 42 ఈవెంట్లలో అథ్లెట్లు అత్యంత ప్రతిభచూపి బంగారు, సిల్వర్, బ్రాంజ్ మెడల్స్ సాధించారు. ఇందులో సత్తాచాటిన క్రీడాకారులు ఈ నెల 17 నుంచి భోపాల్‌లో జరిగే నేషనల్ అథ్లెటిక్స్‌లో పాల్గొంటారు.
– ఎం.కుమార్‌యాదవ్, తెలంగాణ అథ్లెటిక్స్ అసోసియేషన్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు, షైన్ విద్యాసంస్థల చైర్మన్