గంటమొ చేతిలోది ములుగఱ్ఱయొ?
నిల్కడ యింటిలోననొ పంటపొలానొ?
చేయునది పద్యమొ సేద్యమొ?
మంచమందుగూర్చుంటివొ మంచయందొ?
కవివో గడిదేరిన కర్షకుండవో?
రెంటికి చాలియుంటివి సరే కలమా హలమా ప్రియంబగున్!
ఇలా పోతనను ఓ కవి అత్యంత ప్రేమాభిమానాలతో ‘అయ్యా పోతనా.. నువ్వు కవివా.. కర్షకుడివా? మీకు పద్యమిష్టమా లేక సేద్యమా? అని ఓ పద్యం ద్వారా ప్రశ్నించాడు.
పలికెడిది భాగవతమట!
పలికించెడివాడు రామభద్రుండట!
నే పలికిన భవహరమగునట!
పలికెద వేరొండు గాథ పలుకగనేలా!!
..అంటూ లోకానికి అచ్చతెలుగులో భాగవతాన్ని అందించిన మహాకవి బమ్మెర పోతన జయంతి నేడు. తెలుగు సాహిత్యరంగంలో అగ్రగణ్యుడైన పోతన ఓ వైపు సాధారణ రైతులా సేద్యం చేసుకుంటూనే.. మరోవైపు తెలుగు వరి మడిలో అక్షర సేద్యాన్ని చేసి విష్ణు కథలు పండించాడు. ‘సత్కవుల్ హాలికులైననేమి?’ అని గర్వంగా చాటాడు. పండిత, పామరులను ఇద్దరినీ మెప్పించేలా రచనలు చేశాడు.
వేదవ్యాసుడు రంచించిన అష్టాదశ పురాణాల్లో ఐదోదిగా పేరుగాంచిన భాగవతాన్నితెలుగులోకి అనువదించి తెలుగువారిని ధన్యులను చేశాడు. సరళంగా.. సుందరంగా అచ్చమైన తెలుగులో తన పద్య స్కంధాలను ఈ లోకానికి అందించాడు.నేటి జనగామ జిల్లా పాలకుర్తి మండలం బమ్మెరలో లక్కమాంబ, కేసయ్య దంపతులకు జన్మించి పోతన, బమ్మెర వంశానికి చెందినవాడు. ఆయన కవిత్వం లో భక్తి, మాధుర్యం, తెలుగుతనం, పాండిత్యం, వినయం కలగలిపి ఉంటాయి.
పోతన చరిత్రను భావితరాలకు చాటేందుకు ప్రభుత్వం కృషి
బమ్మెర పోతన చరిత్రను భావితరాలకు చాటేందుకు రాష్ట్ర ప్రభుత్వం విశే ష కృషి చేస్తున్నది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని బమ్మెర గ్రామానికి చెందిన పోతన జీవిత చరిత్రను, ఆయన సమ గ్ర సాహిత్యాన్ని భవిష్యత్తు తరాలకు అర్థమయ్యే రీతిలో అందించేందుకు ప్రత్యే క కార్యాచరణ చేపట్టింది. వరంగల్ నగరంలోని పోతన విజ్ఞా న పీఠాన్ని ఇందుకు వేదికగా మార్చింది. తాళపత్రాలపై పోతన రాసిన సాహిత్యాన్ని ఇప్పటి టెక్నాలజీతో డిజిటలైజేషన్ చేయించింది. పోతన జీవిత విశేషాలు, ఆయన రచించిన స్కంధాలు ఇప్పటి తరం కూడా చదివేలా ఇక్కడ డిజిటల్ మ్యూజయం ఏర్పాటు చేసింది. కోటి రూపాయల నిధులతో చేపట్టిన డిజిటల్ మ్యూజియం అందుబాటులోకి తెచ్చింది.