కాశీబుగ్గ/ మానకొండూర్ రూరల్, సెప్టెంబర్ 3: తమ కూతురికి అమెరికాలో ఉన్నత చదువుల కోసం అవకాశం వచ్చిన సంతోషంలో దైవదర్శనానికి వెళ్తున్న ఆ దంపతులను రోడ్డు ప్రమాద రూపంలో మృత్యువు కబళించింది. వేములవాడ రాజన్న వద్దకు వెళ్తుండగా కారు, లారీ ఢీకొని భార్యభర్తలు చనిపోయారు. వారి కూతురితో పాటు మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.
కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం ముంజంపల్లి శివారులో శనివారం ఉదయం జరిగిన ఈ ఘోర ప్రమాదంలో వరంగల్‌లోని కాశీబుగ్గ ప్రాంతానికి చెందిన ఇద్దరు చనిపోవడంతో స్థానికంగా తీవ్ర విషాదం అలుముకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ నగరంలోని కాశీబుగ్గ ప్రాంతానికి చెందిన పద్మశాలీ యువజన సంఘం జిల్లా మాజీ అధ్యక్షుడు మామిడాల సురేందర్ (50), అతడి భార్య మాధవి (45) దంపతులకు కొడుకు, ఇద్దరు కూతుర్లు ఉన్నారు. కొడుకు కెనడాలో, పెద్ద కూతురు అమెరికాలో ఉన్నత చదువులు చదువుతున్నారు. మాధవి ఆరు నెలల క్రితమే అమెరికా నుంచి ఇండియాకు వచ్చింది.
చిన్న కూతురు మేఘనకు సైతం అమెరికాలో ఉన్నత చదువుల కోసం సీటు వచ్చింది. కాగా సోమవారం ఆమె ఆమెరికా వెళ్లాల్సి ఉన్నది. ఆమె స్నేహితుడికి కూడా అమెరికాలో చదువుల కోసం అవకాశం రాగా, సురేందర్ శుక్రవారం రాత్రి అతడిని హైదరాబాద్‌లోని ఎయిర్‌పోర్ట్‌లో వదిలి వచ్చాడు. శనివారం ఉదయం వేములవాడ రాజన్న దర్శనం కోసం సురేందర్, మాధవి, మేఘనతో పాటు సురేందర్ సోదరి కొడుకు కూచన అశోక్ కారులో బయలు దేరారు. ఈ క్రమంలో మార్గ మధ్యలో కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం ముంజంపల్లి శివారులోని జాలగుట్ట వద్ద వీరు ప్రయాణిస్తున్న కారు, ఎదురుగా వచ్చిన లారీ బలంగా ఢీకొన్నాయి. దీంతో కారు నడుపుతున్న సురేందర్ అందులోనే ఇరుక్కొని చనిపోయాడు.
మానకొండూర్ ఎస్ఐ తిరుపతి ఘటనా స్థలానికి చేరుకొని కారులో ఇరుక్కుపోయిన వారిని గ్యాస్ కట్టర్ల సాయంతో వెలికి తీసి 108లో కరీంనగర్‌లోని ప్రభుత్వ దవాఖానకు తరలిచారు. కాగా పరిస్థితి విషమించి మాధవి చనిపోయింది. మేఘన, అశోక్‌కు తీవ్ర గాయాలయ్యాయి. కాగా మేఘన మరో రెండు రోజుల్లో అమెరికాకు వెళ్లాల్సిన తరుణంలో ఆమె తల్లిదండ్రులు చనిపోవడంతో బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. కాగా పద్మశాలీ యువజన సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా, రాష్ట్ర నాయకుడిగా సురేందర్ ఎంతో సేవ చేశాడని స్థానికులు గుర్తు చేసుకుంటున్నారు. సోమవారం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు బంధువులు తెలిపారు.
వరంగల్ చౌరస్తా: మానకొండూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాద మృతులకు గ్రేటర్ వరంగల్ మేయర్ గుండు సుధారాణి, ప్రభాకర్ దంపతులు నివాళులు అర్పించారు. కరీంనగర్ ప్రభుత్వ మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించి ఎంజీఎం మార్చురీకి తరలించారు. మృతదేహాలను సందర్శించిన మేయర్ మృతులకు నివాళులు అర్పించి, కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. నివాళులు అర్పించిన వారిలో గుండు విజయ్‌రాజ్, గుండేటి నరేందర్, గుండు చందన, బస్వరాజు కుమారస్వామి ఉన్నారు.