హనుమకొండ చౌరస్తా, సెప్టెంబర్ 3: అంతరించిపోతున్న నాటక రంగానికి పునర్జీవం కల్పించడానికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తున్నదని తెలంగాణ భాషా సాంసృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ అ న్నారు. పందిళ్ల శేఖర్‌బాబు స్మారక నాటకోత్సవాల్లో భాగంగా రెండో రోజు హనుమకొండలోని పబ్లిక్ గార్డెన్ నేరెళ్ల వేణుమాధవ్ కళా ప్రాంగణంలో ప్రముఖ సాహితీవేత్త గన్నమనేని గిరిజామనోహర్ బాబు అధ్యక్షతన ప్రదర్శనలు జరిగాయి. ముఖ్యఅతిథిగా పాల్గొన్న కుడా ఛైర్మన్ సంగంరెడ్డి సుందర్రాజ్ యాదవ్ జ్యోతిప్రజ్వలన చేసి నాటకోత్సవాలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా మామిడి హరికృష్ణ మాట్లాడుతూ కరోనా కారణంగా రెండు సంవత్సరాల పాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిలిచిపోయాయన్నారు. కరోనా తర్వాత యథావిధిగా జరుగుతున్నాయని పేర్కొన్నారు. కరోనా సమయంలో ఆన్లైన్ ద్వారా ఎన్నో నాటకాలు ప్రదర్శించినట్లు చెప్పారు. పందిళ్ల శేఖర్‌బాబుకు నాటక నీరాజనాన్ని మూడురోజుల పాటు నిర్వహించడం అద్భుతమైన విషయమన్నారు. కళాకారులు కూడా ఎన్నో ప్రతిబంధకాలు ఉన్నా ఉత్సాహంగా కళలను ప్రదర్శిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. కళాకారుల అభివృద్ధికి తనవంతు సహకారం అందిస్తానని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం కళాకారులకు అండగా ఉంటుందన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి శ్రీనివాస్‌గౌడ్, ప్రభు త్వ సలహాదారు రమణాచారి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌కు ఈ సందర్భంగా హరికృష్ణ కృతజ్ఞతలు తెలిపారు.
అంతరించిపోతున్న నాటకాలను, కళాకారులను ప్రతిఒక్కరూ ఆదరించాలని కుడా చైర్మన్ సుందర్రాజ్ యాదవ్ కోరారు. పందిళ్ల శేఖర్ బాబు స్మారక నాటకోత్సవాలు నిర్వహించడం ఓరుగల్లుకే కీర్తి తెస్తుందని శేఖర్‌బాబు సోదరులను అభినందించారు. డిజిటలైజేషన్ కాలంలో నాటక రంగానికి ప్రాముఖ్యత తగ్గిందని, ప్రతి ఇంట్లో హోమ్ థియేటర్ సంసృతి పెరిగిపోతున్నా నాటకాలు చూసే అభిమానులు ఉన్నారని అన్నారు.
కబడ్డీ అసోసియేషన్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు సోదా రామకృష్ణ మాట్లాడుతూ కళలను బతికించాలని కోరారు. కథను నాటక రూపంలో బతికించేవారు కళాకారులని, వారిని ప్రోత్సహించి అండగా నిలవాలన్నారు. గోరంటి వెంకన్నకు ఎమ్మెల్సీ ఇచ్చి తెలంగాణ ప్రభుత్వం కళాకారులను ప్రోత్సహిస్తున్నదన్నారు. ఈ నాటకోత్సవంలో కమిటీ అధ్యక్షుడు వనం లక్ష్మీకాంతారావు, కార్యదర్శి ఆకుల సదానందం కాజీపేట తిరుమలయ్య, నిమ్మల శ్రీనివాస్ వోడపల్లి చక్రపాణి, గూడూరు బాలాజీ, దేవరాజు రవీందర్రావు తదితరులు పాల్గొన్నారు.
నాటకోత్సవాల్లో భాగంగా ప్రముఖ రూపశిల్పి బాపనపల్లి పరమేశ్వర్‌ను అతిథులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా శాలువాతో ఘనంగా సత్కరించి మెమోంటో అందజేశారు. అనంతరం పరమేశ్వర్ మాట్లాడుతూ వేల నాటకాలకు, లక్షల మంది కళాకారులకు మేకప్ వేశానని, పందిళ్ల శేఖర్‌బాబుకు కూడా మేకప్ వేసినట్లు గుర్తుచేశారు..
పందిళ్ల శేఖర్‌బాబు స్మారక నాటకోత్సవాల్లో భాగంగా రెండోరోజు భానోదయ నాట్యమండలి ఆర్ నాగబాబు దర్శకత్వంలో చిన్నారులచే ప్రదర్శించిన భక్త ప్రహ్లాద నాటకోత్సవం ప్రేక్షకులను అలరించింది. చిన్నారులతో అద్భుతంగా ప్రదర్శించిన ఈ నాటకాన్ని ప్రేక్షకులు ఆసక్తిగా తిలకించారు. అనంతరం తెలంగాణ డ్రమెటిక్ అసోసియేషన్ వరంగల్చే ‘గయోపాఖ్యానం’ పద్యనాటిక ప్రదర్శన ఆకట్టుకుంది. కళాకారుల ప్రతి భను పలువురు అభినందించారు.