వరంగల్, సెప్టెంబర్ 3 : గణేశ్ విగ్రహాల నిమజ్జనానికి గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. వరంగల్, హనుమకొండ, కాజీపేట ప్రాంతాల్లోని 22 చెరువుల్లో నిమజ్జన ఏర్పాట్లు చేస్తున్నారు. సుమారు 10 చెరువుల వద్ద 20 క్రేన్లతో పాటు 7 జేసీబీలను అందుబాటులో ఉంచారు. ఈ నెల 9వ తేదీన నగరంలో నిమజ్జం చేయనున్న తరుణంలో గ్రేటర్ అధికారులు ఇప్పటి నుంచి పనులను మొదలు పెట్టారు. సుమారు కోటి రూపాయలతో నిమజ్జన ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇరిగేషన్, రోడ్లు,రహదారులు, మత్య, మైన్స్ శాఖలను సమన్వయం చేసుకుంటూ గ్రేటర్ అధికారులు నిమజ్జన ఏర్పాట్లలో ముందుకు సాగుతున్నారు. ఇప్పటికే చెరువులతో పేరుకుపోయిన గుర్రపుడెక్క తొలగింపు ప్రక్రియను మొదలు పెట్టారు. చెరువులకు వెళ్లే రహదారుల మరమ్మతులు చేపట్టారు. రోడ్లు, భవనాల శాఖ అధికారులు బారికేడ్లు ఏర్పాటు చేయనున్నారు. శనివారం కలెక్టర్లు రాజీవ్‌గాంధీ హన్మంతు, గోపి, కమిషనర్ ప్రావీణ్య వివిధ శాఖల అధికారులతో కలిసి గ్రేటర్లో నిమజ్జన చెరువుల వద్ద జరుగుతున్న పనులను పరిశీలించారు. సోమవారం నుంచి విగ్రహాల నిమజ్జనం ప్రారంభం కానున్న తరుణంలో ఏర్పాట్లను వేగంగా చేస్తున్నారు.
నిమజ్జన చెరువుల వద్ద గ్రేటర్ అధికారులు లైటింగ్ ఏర్పాటు చేస్తున్నారు. నిమజ్జన చెరువులతో పాటు విగ్రహాలు వచ్చే రహదారుల వెంట అధికారులు లైటింగ్ ఏర్పాట్లు చేస్తున్నారు. వరంగల్ ప్రాంతంలో 8 చెరువులు, హనుమకొండ ప్రాంతలో 14 చెరువుల్లో గణపతి విగ్రహాల నిమజ్జనానికి గ్రేటర్ అధికారులు విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నారు. విద్యుత్ అంతరాయం కలిగిన ఇబ్బందులు కలుగకుండా జనరేటర్లను ఏర్పాటు చేస్తున్నారు. నిమజ్జన చెరువుల వద్ద తెప్పలు, బోట్లు, గజ ఈతగాళ్లను ఏర్పాట్లు చేస్తున్నారు. నిమజ్జనం చేయడానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. పారిశుధ్య పనులతో పాటు తాగునీటి వసతి కల్పించనున్నారు.
ఇన్చార్జిల నియామకం
గణేశ్ నిమజ్జనానికి గ్రేటర్ ఈఈ, డీఈ,ఏఈ స్థాయి అధికారులను ఇన్చార్జిలుగా నియమించారు. ప్రతి నిమజ్జన కేంద్రానికి ఇన్చార్జి అధికారులను నియమిస్తూ కమిషనర్ ప్రావీణ్య ఉత్తర్వులు జారీ చేశారు. వరంగల్ జిల్లా చెరువుల నిమజ్జన పర్యవేక్షణకు ఈఈ శ్రీనివాస్, హనుమకొండ చెరువుల వద్ద నిమజ్జన ఏర్పాట్ల పర్యవేక్షణ బాధ్యతలను ఈఈ బీఎల్ శ్రీనివాస్‌రావుకు కమిషనర్ అప్పగించారు.
హనుమకొండ గణేశ్ నిమజ్జనానికి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన మునిసిపల్ కమిషనర్ ప్రావీణ్యతో కలిసి పద్మాక్షి గుండం, సిద్ధేశ్వర గుండం, బంధం చెరువు, భీమారం చెరువు, హసన్‌పర్తి చెరువులను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నిమజ్జనం సందర్భంగా జిల్లాలో 12 చెరువులను గుర్తించినట్లు తెలిపారు. ఆయన వెంట అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీఆర్వో ఎం వాసుచంద్ర, హనుమకొండ తహసీల్దార్ రాజ్‌కుమార్ ఉన్నారు.
పోచమ్మమైదాన్/కరీమాబాద్ : వరంగల్ కలెక్టర్ గోపీ, నగర పాలక సంస్థ కమిషనర్ ప్రావీణ్య దేశాయిపేటలోని చిన్నవడ్డేపల్లి చెరువు, ములుగు రోడ్డులోని కోట చెరువు, ఉర్సు చెరువులను పరిశీలించారు. నిమజ్జనానికి రెండు రోజుల ముందే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగుకుండా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఆర్డీవో మహేందర్‌జీ, తహసీల్దార్ జయపాల్‌రెడ్డి, ఆర్ఐ జలపతిరెడ్డి, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.