నెక్కొండ, సెప్టెంబర్ 3: నెక్కొండ మేజర్ గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ దేవనబోయిన వీరభద్రయ్యపై వార్డు సభ్యులు శనివారం ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం కోరం లేకపోవడంతో వీగిపోయింది. దీంతో వీరభద్రయ్య పూర్తికాలం పదవిలో కొనసాగుతారని ఆర్డీవో ప్రకటించారు. గ్రామ పంచాయతీలోని ప్రస్తుతం 13 మంది వార్డు సభ్యుల్లో అవిశ్వాస తీర్మాన సమావేశానికి కాంగ్రెస్ పార్టీకి చెందిన ఐదుగురు, సీపీఎంకు చెందిన ఒకరు మాత్రమే హాజరయ్యారు. కోరం లేకపోవడంతో ఎన్నిక ప్రక్రియ నిలిచిందని, మరోసారి అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టే అవకాశం ఉండదని ఆర్డీవో పవన్‌కుమార్, తహసీల్దార్ డీఎస్ వెంకన్న స్పష్టం చేశారు. దీంతో టీఆర్ఎస్ శ్రేణులు సుంబురాలు జరుపుకున్నారు. కాంగ్రెస్, బీజేపీ అపవిత్ర కలయికపై టీఆర్ఎస్ శ్రేణులు నిరసన తెలిపారు. నెక్కొండ సొసైటీ చైర్మన్ మారం రాము ఆధ్వర్యంలో టీఆర్ఎస్ నాయకులు పటాకులు కాల్చారు.
రాజకీయాలకు అతీతంగా మండలంలో జరుగుతున్న అభివృద్ధికి అండగా నిలుస్తామని సొసైటీ చైర్మన్ మారం రాము, నర్సంపేట బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కొమ్ము రమేశ్‌యాదవ్ అన్నారు. నెక్కొండలో శనివారం ఉపసర్పంచ్‌పై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోగా టీఆర్ఎస్ నాయకులు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నెక్కొండలో కొద్ది రోజుల క్రితం రాజకీయాలకు అతీతంగా బొడ్రాయి ప్రతిష్ఠాపన మహోత్సవాన్ని వైభవంగా జరుపుకున్నామని, ఇంతలోనే కాంగ్రెస్, బీజేపీ నాయకులు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి అభాసుపాలయ్యాయని తెలిపారు. ఎన్నికల సమయంలోనే రాజకీయాలు చేయాలని, అభివృద్ధికి ఆటంకం కలిగించే పనులు చేయొద్దన్నారు. సొసైటీ మాజీ చైర్మన్ కొమ్మారెడ్డి రవీందర్‌రెడ్డి, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు కొనిజేటి భిక్షపతి, రామాలయ కమిటీ చైర్మన్ పొడిశెట్టి సత్యం, మండల నాయకులు తాటిపెల్లి శివకుమార్, కారింగుల సురేశ్, బొల్లెబోయిన వీరస్వామి, హెచ్ శ్రీను పాల్గొన్నారు.